‘విస్తరణ’ వ్యూహాలు

ABN , First Publish Date - 2021-07-09T06:30:35+05:30 IST

సమస్య ఇంజన్‌లో ఉన్నప్పుడు, బోగీలు మార్చితే ఏం ప్రయోజనం? అని వ్యాఖ్యానించాడు దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణను ఉద్దేశించి....

‘విస్తరణ’ వ్యూహాలు

సమస్య ఇంజన్‌లో ఉన్నప్పుడు, బోగీలు మార్చితే ఏం ప్రయోజనం? అని వ్యాఖ్యానించాడు దళిత నాయకుడు జిగ్నేష్‌ మేవానీ బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణను ఉద్దేశించి. మోదీ కొత్త మంత్రివర్గం అనేకులకు ఆశ్చర్యం కలిగించింది. హేమాహేమీలూ, పాతతరం యోధులు అనుకుంటున్నవారిని అవలీలగా పక్కకు నెట్టేసి, అనేక కొత్తమొఖాలకు పెద్ద పదవులు కట్టబెట్టి కూచోబెట్టడం విచిత్రం అనిపించింది. రాజ్‌నాథ్‌ వంటి ఎవరో ఒకరిద్దరు తప్ప అటల్‌ అద్వానీ కాలంనాటి యోధులంతా ఈ దెబ్బతో పదవులకు దూరమైపోయినట్టే. పాలనలో సమర్థతను పెంచడం కన్నా, అప్రదిష్టపాలైన ప్రభుత్వ ముఖచిత్రాన్ని మార్చడం, తాము మారినట్టు కనిపించడం ఈ మంత్రివర్గ విస్తరణ లక్ష్యం కావచ్చు.


ఎన్నికలు ముంచుకొస్తున్నప్పుడల్లా చేసే విన్యాసాలే ఇవి. కొందరు మంత్రులను పీకిపారేస్తే, పొరపాట్లూ పాపాలూ వారితో కొట్టుకుపోతాయి, ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టూ కనిపించవచ్చు. ఇప్పుడు అతిముఖ్యమైన ఉత్తర్‌ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల ఎన్నికలు ముందున్నాయి. కమలం కోసం పనిచేస్తే కచ్చితంగా ప్రయోజనం దక్కుతుందని మొన్నటి ఎన్నికల ఆధారంగా చూపవలసిన అవసరమూ ఉంది. ఉన్న పార్టీని ముంచి తమతో చేరినవారినీ, శత్రువును చీల్చినవారినీ, రహస్యంగా కోటద్వారాలు తెరిచినవారినీ గుర్తించి గౌరవించుకోవాల్సిన బాకీలూ తీర్చాలి. విస్తరణలో చేరివచ్చిన కొత్తమంత్రుల్లో అత్యధికులకు పాలనానుభవం లేకున్నా రాష్ట్రాల ఎన్నికల్లో వారి ప్రభావం కాదనలేనిది. ఏడుగురికి ప్రమోషన్‌, పన్నెండుమంది మీద వేటు, ముప్పైఆరు కొత్తముఖాలకు చోటు, అత్యధికంగా 47మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు స్థానం కల్పించడం వెనుక కుల సమీకరణలు, రాజకీయ లక్ష్యాలు ఉన్నమాట నిజం. అటల్‌ అద్వానీ కాలంలో బ్రాహ్మణ బనియా పార్టీగా ముద్రపడిన బీజేపీ, ఇప్పుడు మిగతా వర్గాలవైపు కదులుతూండటమూ కనిపిస్తున్నది. మంత్రివర్గ విస్తరణలో యూపీనుంచి యాదవేతర బీసీలకు, జాతవేతర దళితులకు గరిష్ఠ ప్రాధాన్యం ఇవ్వడం వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల దృష్టిలోనే. కొందరికి మంత్రిపదవులు ఇవ్వడం ద్వారా, అప్పటివరకూ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను పూర్తిగా చెరిపేయడం సాధ్యం కాకపోవచ్చుగానీ, అధికజనాభా కులాలకు వారిని గుర్తించి గౌరవించిన సందేశాన్ని ఇవ్వవచ్చు. గత యూపీ ఎన్నికలకు ఆర్నెల్ల ముందు ఇదే లక్ష్యంతో జరిగిన కేంద్రమంత్రివర్గ విస్తరణ ఆయా కులాల ఓట్లను కనీసం రెట్టింపుచేశాయని అంటారు. ఇదేతరహాలో గుజరాత్‌నుంచి ఆరుగురికి దక్కిన ప్రాతినిధ్యం ఆ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడానికి ఉపకరించవచ్చు. తెలంగాణ వంటి పట్టుబిగించ దల్చుకున్న రాష్ట్రాలకూ ఈ విస్తరణలో ప్రాధాన్యం దక్కింది.


ప్రధానమంత్రి కార్యాలయమే సర్వమూ చక్కబెడుతున్న నేపథ్యంలో, మంత్రులను మార్చినంత మాత్రాన, ఆయా శాఖలకు సరికొత్త దిశానిర్దేశం ఒనగూరుతుందని అనుకోలేం. ఆయా శాఖల్లో మార్పుచేర్పులు సదరు మంత్రుల వైఫల్యాలూ అసమర్థతల ప్రాతిపదికన జరిగిందనీ చెప్పలేం. చైనా వీరంగాలు, కశ్మీర్‌ పరిణామాలు, కుప్పకూలిన ఆర్థికం, రైతు ఉద్యమాలు ఇలా అనేకానేక ఘట్టాల నేపథ్యంలో, మిగతావారిని తాకకుండా హర్షవర్థన్‌ను మాత్రమే శిక్షించడం ద్వారా కరోనా రెండోవిడతలో కనబరిచిన క్షమార్హం కాని నిర్లక్ష్యం నుంచి ప్రజల దృష్టి కాస్తంతైనా మళ్ళించగలనని ప్రభుత్వం భావించి ఉండవచ్చు. దేశంలో కరోనా కాలూనడంనుంచి వాక్సిన్‌ విధానం వరకూ సమస్తమూ పీఎంవో చక్కబెడుతున్నందున ఆరోగ్యమంత్రిపై వేటు మోదీ ఇమేజ్‌ కాపాడటానికి ఉపకరించవచ్చునేమో కానీ, సమస్యను పరిష్కరించదు. మరిన్ని వేవ్‌లూ, వేరియంట్లూ తరుముకొస్తున్న తరుణంలో కరోనా నిర్వహణ విధానాన్ని పునఃస్సమీక్షించుకొని, కొత్తమంత్రిని కాస్తంత కదలినిస్తే ఫలితం ఉండవచ్చు. ఇక, జ్యోతిరాదిత్య సింధియా, నారాయణరాణే వంటివారి రుణం తీర్చుకోవడంద్వారా అధికారానికీ, విస్తరణకూ తప్ప మిగతావేటికీ అంతగా విలువనివ్వబోమని మోదీ సారథ్యంలోని బీజేపీ మరోమారు తేల్చేసింది.

Updated Date - 2021-07-09T06:30:35+05:30 IST