దక్షిణాదిలో టాటా ఏఐఏ లైఫ్‌ విస్తరణ

ABN , First Publish Date - 2021-12-09T06:18:25+05:30 IST

దక్షిణాది మార్కెట్లలోకి విస్తరించాలని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ భావిస్తోంది.

దక్షిణాదిలో టాటా  ఏఐఏ లైఫ్‌ విస్తరణ

  • గత 3 నెలల్లో తెలుగు రాష్ట్రాల్లో 9 శాఖలు
  • 1,400 అడ్వైజర్ల నియామకం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దక్షిణాది మార్కెట్లలోకి విస్తరించాలని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో గత మూడు నెలల్లోనే 9 శాఖలను ప్రారంభించామని, ప్రస్తుతం రెండు రాష్ట్రా ల్లో 22 శాఖలున్నాయని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ నవీన్‌ తహిల్యానీ తెలిపారు. ‘‘ఏజెన్సీల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీకి లభించిన కొత్త ప్రీమియం ఆదాయంలో తెలుగు రాష్ట్రాల వాటా 8 శాతం ఉంది. మొత్తం వ్యాపారంలో 5.5 శాతం వృద్ధి నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబరు వరకూ 1,400 మంది అడ్వైజర్లను నియమిం చాం. హైదరాబాద్‌లో కొత్తగా 600 అడ్వైజర్లను తీసుకున్నాం. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం 4,400 మంది అడ్వైజర్లు ఉన్నారు’’ అని నవీన్‌ తెలిపారు. ఏజెన్సీలతోపాటు, బ్రోకర్లు, బ్యాంకులు, డిజిటల్‌ తదితర మార్గాల ద్వారా పాలసీలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.  


వచ్చే మూడేళ్లు 30-40ు వృద్ధి: వచ్చే మూడేళ్లలో ఏడాదికి వ్యాపారంలో 30-40 శాతం వృద్ధి నమోదు చేయాలని టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సురెన్స్‌ లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. పంపిణీ వ్యవస్థను పెంచుకోవడంతోపాటు రక్షణ, పెన్షన్‌ పాలసీలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నామన్నారు. ‘‘సాధారణంగా జీవిత బీమాకు డిసెంబరు నుంచి మార్చి వరకూ అధిక వ్యాపారం జరుగుతుంది. ఈ కాలంలోనే కంపెనీలు 60 శాతం వ్యాపారం చేస్తాయన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో టాటా ఏఐఏ లైఫ్‌ మొత్తం ప్రీమియం ఆదాయం 34 శాతం పెరిగి రూ.8,308 కోట్ల నుంచి రూ.11,105 కోట్లకు చేరింది. రెన్యువల్‌ ప్రీమియం ఆదాయాన్ని తీసుకుంటే 37 శాతం పెరిగి రూ.5,066 కోట్ల నుంచి రూ.6,961 కోట్లకు చేరింది’’ అని నవీన్‌ చెప్పారు. 


కొత్తగా 100 శాఖల ఏర్పాటు..: దేశ వ్యాప్తంగా టాటా ఏఐఏ లైఫ్‌కు 314 శాఖలు ఉన్నాయి. ఇందులో 100 శాఖలను గత మూడు నెలల్లోనే ప్రారంభించింది. వచ్చే ఆరు నెలల్లో మరో 100 శాఖలను కంపెనీ ప్రారంభించనుంది. గత ఏడాది నాటికి మొత్తం 45,000 మంది అడ్వైజర్లు ఉన్నారు. 2022 ద్వితీయార్ధం చివరకు మొత్తం శాఖలు 415కు చేరగలవని నవీన్‌ తెలిపారు. దక్షిణాదిలో శాఖలను ప్రారంభించడం ద్వారా మరింత విస్తరించాలని భావిస్తోంది. విస్తరణకు అవసరమైన నిధులకు దాదాపు రూ.500 కోట్ల నిధులు సమీకరించాలని యోచిస్తోంది.  

Updated Date - 2021-12-09T06:18:25+05:30 IST