విస్తరిస్తున్న విష సంస్కృతి!

ABN , First Publish Date - 2022-01-25T06:30:31+05:30 IST

నగరంలో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోందనడానికి నిదర్శనం. చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను, ఏజెన్సీ నుంచి గంజాయిని కొంతమంది దిగుమతి చేసుకుంటున్నారు.

విస్తరిస్తున్న విష సంస్కృతి!

నగరంలో పెరుగుతున్న డ్రగ్స్‌ వినియోగం

బెంగళూరు, గోవా నుంచి కొకైన్‌, ఎండీఎంఏ దిగుమతి

గత వారం రోజుల్లో రెండు చోట్ల 12 మంది పట్టివేత


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)


మధురవాడలోని ఎన్‌జీవోస్‌ కాలనీ పార్కు వద్ద ఈ నెల 16వ తేదీన డ్రగ్స్‌ సేవిస్తున్న పది మందిని పీఎంపాలెం పోలీసులు అరెస్టు చేసి, వారి నుంచి ఎండీఎంఏ చిప్‌లు, గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

తాజాగా సోమవారం అక్కయ్యపాలెంలో నివాసం వుంటూ డ్రగ్స్‌ను విక్రయిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెదిన రాహుల్‌ (22), పెదగంట్యాడకు చెందిన అఖిల్‌(23)ను ఎంవీపీ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి 19 ఎల్‌ఎస్‌డీ, ఏడు ఓసీబీ షీట్స్‌, మూడు ఎండీఎంఏ చిప్స్‌, 20 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.


...పై రెండు ఉదంతాలు నగరంలో గంజాయి, డ్రగ్స్‌ వినియోగం చాపకింద నీరులా విస్తరిస్తోందనడానికి నిదర్శనం. చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుంచి డ్రగ్స్‌ను, ఏజెన్సీ నుంచి గంజాయిని కొంతమంది దిగుమతి చేసుకుంటున్నారు. తాము వినియోగిస్తూనే తమ స్నేహితులు, పరిచయస్తులకు విక్రయిస్తున్నారు. కొంతకాలం కిందట నగరంలో ఫోర్ట్విన్‌ ఇంజక్షన్లు వంటి మత్తుమందుల వినియోగం సాగేది. ఇప్పుడు ఖరీదైన కొకైన్‌, ఎండీఎంఏ పౌడర్‌, ఎల్‌ఎక్స్‌డీసీ చిప్స్‌ వరకూ వచ్చింది. రెండేళ్ల కిందట రుషికొండ బీచ్‌రోడ్డులోని ఒక రిసార్ట్‌లో కొంతమంది యువకులు పార్టీలో కొకైన్‌, హెరాయిన్‌, ఎండీఎంఏ పౌడర్‌, ఎల్‌ఎక్స్‌డీసీ చిప్స్‌ను వినియోగిస్తూ పోలీసులకు పట్టుబడడంతో నగరంలో కొకైన్‌, హెరాయిన్‌ ఉనికి బయటపడింది. తర్వాత కొంతకాలానికి నగరానికి చెందిన ఒక రౌడీషీటర్‌ ఆధ్వర్వంలో ముగ్గురు యువకులు కొకైన్‌ తరలిస్తూ రామా టాకీస్‌ వద్ద పట్టుబడ్డారు. 


డ్రగ్స్‌, గంజాయి వాడుతున్న వారిలో కాలేజీ విద్యార్థులు ఎక్కువగా ఉంటున్నారు. మొదట సరదా కోసం ప్రారంభించి తర్వాత వాటికి బానిసలుగా మారుతున్నారు. 2021లో గంజాయి రవాణా, విక్రయాలకు సంబంధించి 225 కేసులు నమోదు కాగా, 554 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి ఆరు వేల కిలోల గంజాయిని సీజ్‌ చేశారు. అలాగే డ్రగ్స్‌కు సంబంధించి గత ఏడాది కేవలం రెండు కేసులు మాత్రమే నమోదు కాగా, ఈ ఏడాది వారం రోజుల వ్యవధిలోనే రెండు కేసులు నమోదు కావడం విశేషం. రెండు కేసుల్లో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి 22 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, ఏడు ఓసీబీ షీట్స్‌, ఆరు ఎండీఎంఏ చిప్స్‌, 23 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా ఎంవీపీ పోలీసులు అరెస్టు చేసిన ఇద్దరు యువకులు చెన్నైలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. వారిద్దరూ అక్కడ చదువుతుండగా స్నేహితులుగా మారారు. కాలేజీలో డ్రగ్స్‌ వినియోగానికి అలవాటు పడ్డారు. తర్వాత నగరానికి వచ్చినప్పటికీ చెన్నై నుంచి తమ స్నేహితుల ద్వారా డ్రగ్స్‌ను దిగుమతి తెప్పించుకుంటున్నట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. అందులో కొంత తాము వినియోగించుకుని, మిగిలిన దానిని తమ స్నేహితులు, పరిచయస్తులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

Updated Date - 2022-01-25T06:30:31+05:30 IST