మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న ‘నైరుతి’

ABN , First Publish Date - 2020-06-06T11:52:03+05:30 IST

మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న ‘నైరుతి’

మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్న ‘నైరుతి’

విశాఖపట్నం/అమరావతి(ఆంధ్రజ్యోతి): ముంబై సమీపంలో రెండురోజుల క్రితం తీరం దాటిన తుఫాన్‌ బలహీనపడుతూ ఈశాన్యంగా పయనించి శుక్రవారం నాటికి బిహార్‌ పరిసరాల్లో కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో పాటు మాన్‌సూన్‌ కరెంట్‌ బలపడటంతో నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూల వాతావరణం ఏర్పడింది. రానున్న రెండురోజుల్లో ఇవి మధ్య అరేబియా సముద్రం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌, ఆగ్నేయ బంగాళాఖాతం మొత్తం, నైరుతి, తూర్పు, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. దీనివల్ల 8వ తేదీకల్లా తూర్పు, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో రాయలసీమకు నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రానున్న 24గంటల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయి. శని, ఆదివారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సమాచారం మేరకు శుక్రవారం పన్నూరు(చిత్తూరు)లో 43, కందుకూరులో 42.87, పమిడిముక్కలలో 42.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Updated Date - 2020-06-06T11:52:03+05:30 IST