వేగంగా విస్తరిస్తోంది

ABN , First Publish Date - 2022-01-18T05:45:02+05:30 IST

వేగంగా విస్తరిస్తోంది

వేగంగా విస్తరిస్తోంది
కొవిడ్‌ పరీక్షల కోసం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆర్టీపీసీఆర్‌ కేంద్రం వద్ద బారులు తీరిన దృశ్యం

ఉమ్మడి జిల్లాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

వైరస్‌ బారిన పలువురు వైద్యసిబ్బంది 

ఆర్టీపీసీఆర్‌ కేంద్రాలకు క్యూ కడుతున్న జనం 

అనారోగ్య తీవ్రత తక్కువగా ఉన్నా మూడో దశలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. జనం ఆందోళనతో పరీక్షా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. కొన్నినెలలుగా కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు కొవిడ్‌ నిబంధనలను విస్మరించారు. దాంతో కేసులు పెరిగిపోతున్నాయి. 

ఖమ్మం కలెక్టరేట్‌, జనవరి 17: ఈ నెల ఒకటినుంచి ఇరు జిల్లాల్లో కేసుల సంఖ్య భారీగా నమోదవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఖమ్మం జిల్లాలో రోజూ 100కు పైగానే కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలతో పాటు వైద్య ఆరోగ్యశాఖ అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. 

నిర్ధారణ పరీక్షలకోసం పరుగులు

కారోనా వ్యాప్తి పెరుగుతుండడంతో చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా జనం కొవిడ్‌ టెస్ట్‌ కోసం పరుగులు తీస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 26 పీహెచ్‌సీలు, 4 యూపీహెచ్‌సీల్లో నిత్యం ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహిస్తు న్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొవిడ్‌ లక్షణాలు ఉంటే విధిగా ఆర్టీపీసీఆర్‌ పరీక్షలను న్విహిస్తున్నారు. ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో దాదాపు సగం మందికి పాజిటివ్‌ తేలుతోంది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో సోమవారం 376 శాంపిల్స్‌ సేకరించగా 189కేసులు పాజిటివ్‌ వచ్చాయి. అంటే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో పాజిటివ్‌ రేటు సుమారు 50శాతంగా నమోదవుతోంది. వీటితో పాటు ప్రైవేటు ఆసుపత్రులు, ల్యాబుల్లోనూ కేసులు భారీ సంఖ్యలోనే నమోదువుతున్నాయి. జ్వరం, జలుబు, ఒంటి నొప్పులతో జనం సతమతమవుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో నిర్వహించే ర్యాపిడ్‌ పరీక్షల్లో ప్రతి 100మందిలో కనీసం 45నుంచి 55 పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవలి వరకు ఒకటి రెండు పాజిటివ్‌ కేసులు నమోదవ్వగా గత నాలుగులు రోజులుగా 50కి పైగానే పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నారు. సోమవారం ఆ జిల్లాలో 89పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 

ఖమ్మం ఆసుపత్రిలో వైద్య సిబ్బందికీ పాజిటివ్‌?  

మొదటి రెండు దశల్లో మాదిరిగానే ప్రస్తుత మూడో దశలోనూ వైద్య సిబ్బంది భారీ సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ఖమ్మంప్రభుత్వ ఆసుపత్రిలోని ఆర్టీపీసీఆర్‌ కేంద్రంలో రోజుకి 350నుంచి 400పరీక్షలు నిర్వహిస్తు న్నారు. ఈ క్రమంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికీ వైరస్‌ సోకుతోంది. ఇప్పటికే ఇద్దరు అధికారులతోపాటు నలుగురు సిబ్బందికి పాజిటివ్‌ సోకినట్లు తెలిసింది. బ్లడ్‌బ్యాంకు తదితర విభాగాల్లో పని చేస్తున్న వైద్య సిబ్బంది కూడా పాజిటివ్‌ బారిన పడుతున్నారు. దీంతో అధికారులు, వైద్యులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.  

ఈ జాగ్రత్తలు పాటిస్తే సరి  

ప్రస్తుతం విస్తరిస్తున్న కరోనా వేరియంట్‌తో తాత్కాలికమైన జలుబు, దగ్గు వంటి లక్షణాలే కనిపిస్తున్నట్లు వైద్యులు చెబుతునన్నారు. వైద్యుల సలహా మేరకు మందులు వాడితే వారం రోజుల్లో వైరస్‌నుంచి బయట పడవచ్చు. ఈ క్రమంలో 15రోజులు ఇంట్లో ఉండి మంచి ఆహారం తీసు కుంటూ సమయానికి నిద్రపోవాలి. పండ్లు, పోషకాహారంతోపాటు వ్యాయామం, యోగా చేస్తూ నిత్యం వేడినీళ్లు తాగాలి. ఆవిరి పట్టాలి. ఎలాంటి లక్షణాలు ఉన్నా.. ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించుకొని వారి సూచనల మేరకు మందులను వాడితే ప్రమాదం ఉండదు. 

అపోలోలో చేరిన సీఎల్పీ నేత భట్టి

ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు 

మధిర, జనవరి 17: కరోనా బారిన పడిన సీఎల్పీనేత, ఖమ్మం జిల్లా మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సోమవారం హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆయనకు ఆదివారం కరోనా పాజిటివ్‌ నిర్ధారణవగా హైదరాబద్‌లోని తన నివాసంలో హోంఐసోలేషన్‌కు వెళ్లారు. ఈ క్రమంలో స్వల్ప అస్వస్థతకు గురైన ఆయన ఆదివారం రాత్రి అపోలో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు. అయితే ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎలాంటి ఆందోళన చెందొద్దని భట్టి విక్రమార్క కోరారు. తనను కలవడానికి హైదరాబాద్‌ ఎవరూ రావొద్దని, కొవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత తానే వచ్చి అందరినీ కలుస్తానన్నారు. 

కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా దంపతులకు కొవిడ్‌

కుటుంబసభ్యుల్లో మరో ఆరుగురికీ లక్షణాలు

కొత్తగూడెం కలెక్టరేట్‌, జనవరి 17 : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి పద్మావతి కొవిడ్‌ బారిన పడ్డారు. సోమవారం వారికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో.. వెంటనే వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్చారు. 75సంవత్సరాల వయసున్న వనమాకు ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో వెన్నెముక సంబంధ శస్త్రచికిత్స జరగ్గా.. అప్పటినుంచి ఆయన అక్కడి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే పాతపాల్వంచకు చెందిన నాగరామకృష్ణ కుటుంబం ఆత్మాహుతి ఘటనలో ఆయన కుమారుడు రాఘవ జైలుకు వెళ్లిన అనంతరం వనమా వెంకటేశ్వరరావు సతీమణి పద్మావతి, ఆయన ఇతర కుటుంబసభ్యులంతా కొత్తగూడెం నుంచి హైదరాబాద్‌ వెళ్లారు. ఈ క్రమంలోనే వనమా దంపతులతో ఆ కుటుంబంలోని మరో ఆరుగురికి కొవిడ్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణైనట్టు సమాచారం. 

పోలీసులపై భద్రాద్రి ముక్కోటి ఉత్సవాల ప్రభావం

జూలూరుపాడు పీఎస్‌లో మరొకరు, ఇల్లెందులో ఏడుగురు, భద్రాచలంలో ఐదుగురు పోలీసులకు కొవిడ్‌

జూలూరుపాడు/ఇల్లెందుటౌన్‌, భద్రాచలం, జనవరి 17:ఇటీవల భద్రాచలం ముక్కోటి ఏకాదశి ఉత్సవాల ప్రభావం పోలీసు శాఖపై పడింది. బందోబస్తులో పాల్గొన్న పోలీసులు ఒక్కొక్కరుగా కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే జూలూరుపాడు పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏడుగురికి కొవిడ్‌ సోకగా మరో ట్రెయినీ ఎస్‌ఐకు కూడా నిర్ధారణైంది. ఇక భద్రాద్రి బందోబస్తుకు వెళ్లినవారిలో ఇల్లెందు పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఏడుగురు కానిస్టేబుళ్లకు కూడా సోమవారం కరోనా నిర్ధారణైంది. ఇక జూలూరుపాడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ హెల్త్‌ సూపర్‌వైజర్‌, స్టాఫ్‌నర్స్‌కు పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయా కార్యాలయంలో శానిటైజేషన్‌ చర్యలు చేపట్టారు. భద్రాచలంలో సీఐ స్వామికి, పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో నలుగురికి పాజిటివ్‌ వచ్చింది. అలాగే మరో నలుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు సమాచారం. అదేవిధంగా ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐతో పాటు ఏడుగురికి పాజిటివ్‌ వచ్చినట్టు తెలుస్తోంది.

వైరా ‘ఈజీఎస్‌’లో పది మందికి పాజిటివ్‌

వైరా, జనవరి 17: వైరా మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ పరిధిలో పని చేస్తున్న పదిమంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఎంపీడీవో కార్యాలయంలో ఇద్దరికి, ఈజీఎస్‌ కార్యాలయంలో ఐదుగురు, ముగ్గురు పంచాయతీ కార్యదర్శులకు పాజిటివ్‌ నమోదైంది. దాంతో ఈజీఎస్‌ కార్యాలయం మూతపడింది. 

ఇరు జిల్లాల్లో 481 కరోనా కేసులు 

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌,జనవరి 17: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇరుజిల్లాల్లో సోమవారం 481పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలో మొత్తం 6,681 పరీక్షలు నిర్వహించగా 392 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 5,181మందికి పరీక్షలు నిర్వహించగా 89మందికి పాజిటివ్‌ నమోదైంది. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో సోమవారం ముగ్గురు చేరారు. ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 19 మంది చికిత్స పొందుతున్నారు. 301బెడ్లు ఖాళీగా ఉన్నాయి.   

Updated Date - 2022-01-18T05:45:02+05:30 IST