భూతయంత్రం

ABN , First Publish Date - 2022-06-14T06:29:06+05:30 IST

తప్పొప్పుల విషయంలో వ్యవహారం చట్టబద్ధంగా ఉండాలన్నది ఆధునిక సమాజాల ప్రాథమిక సూత్రం. ఎంత పెద్ద తప్పు చేసినవారి విషయంలో అయినా, ఈ సూత్రం మారకూడదు...

భూతయంత్రం

తప్పొప్పుల విషయంలో వ్యవహారం చట్టబద్ధంగా ఉండాలన్నది ఆధునిక సమాజాల ప్రాథమిక సూత్రం. ఎంత పెద్ద తప్పు చేసినవారి విషయంలో అయినా, ఈ సూత్రం మారకూడదు. తప్పులు చేసేవారికి నియమాలు, చట్టాలు వర్తించవు అనే వాదన చెల్లకూడదు. అభియోగం మోపడం, విచారణ జరపడం, తీర్పు ప్రకారం ఫలితాన్ని అమలుచేయడం, ఇదొక న్యాయప్రక్రియ. ఈ న్యాయాధికారాన్ని రాజకీయవాదులకు కానీ, అధికారయంత్రాంగానికి కానీ అప్పగించకుండా, భారతరాజ్యాంగం, దాదాపుగా సరిసమాన స్థాయిలో ఏర్పరచిన న్యాయవ్యవస్థకు అప్పగించింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం సాధారణ పౌరులకే కాదు, పాలకులకు, పోలీసులకు ఎవరికీ లేదు. కస్టడీలో ఒకరిని కొట్టి చంపారంటే, ఒకరిని కాల్చిచంపి ఎదురుకాల్పులని కథలు చెప్పారంటే, అర్థం, న్యాయప్రక్రియను కాదని ప్రభుత్వ యంత్రాంగం తానే శిక్షను అమలుజరిపిందని. బాధితులు తప్పు చేసి ఉండకపోవచ్చు, తప్పు అని అధికారులు అనుకున్నది తప్పే కాకపోవచ్చు, తప్పొప్పులతో నిమిత్తం లేకుండా ప్రభుత్వాల ఒక విధానాన్ని అమలు చేయడానికో, వ్యక్తుల ప్రయోజనాలను నెరవేర్చడానికో మాత్రమే ఆ చట్టబాహ్య చర్య జరిగిఉండవచ్చు. ఎందుకు జరిగినా, ఫలితం మాత్రం రాజ్యాంగ ఉల్లంఘనం, న్యాయవ్యవస్థ ప్రతిపత్తిని అపహరించడం!


లాకప్ హత్య, ఎన్‌కౌంటర్ వంటి వాటి సరసన తాజాగా చేరినది బుల్‌డోజర్ ప్రయోగం. శాంతిభద్రతల పరిరక్షణకు పురపాలన యంత్రాంగాన్ని వాడడం ఒక సరికొత్త ప్రయోగం. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాచుర్యంలోకి తెచ్చిన బుల్‌డోజర్ ప్రయోగం దేశమంతటా కూడా బిజెపి ప్రభుత్వాలకు అభిమాన దండోపాయంగా మారింది. పట్టణ పేదలు చాలా మంది సరైన పత్రాలు లేని చోట నివాసాలు ఏర్పరచుకుంటారు. పేదలు, మధ్యతరగతి, ఉన్నతాదాయవర్గాలు అందరూ నిర్మించుకునే ఇళ్లలో డిజైనింగ్‌లోనో, అనుమతులలోనో ఏదో ఒక లోపం, ఉల్లంఘన ఉంటాయి. నియమాలు అతిక్రమించిన నిర్మాణాలను కూల్చడానికి స్థానికసంస్థల యంత్రాంగానికి అధికారాలు ఉంటాయి. ఈ నిబంధనా వాతావరణాన్ని ఆసరా చేసుకుని రాజకీయ కక్షలో, విధానపరమైన విద్వేషాలనో తీర్చుకోవాలని ప్రయత్నిస్తే, అదెంత దుర్మార్గం? ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానో, లేదా, ఏ ఇతర సామాజిక పరిణామాలపై నిరసనగానో ప్రజలు ఆందోళనలు, ప్రదర్శనలు చేస్తారు. వాటిని అనుమతించడంతో పాటు, అవి సురక్షితంగా జరిగేట్టు చూడడం ప్రభుత్వ యంత్రాంగం బాధ్యత. నిరసనల వంటి ప్రజాస్వామిక కార్యక్రమాలలో ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే అందుకు మొదటి బాధ్యత ప్రభుత్వానిదే. అశాంతి జరిగే అవకాశమున్నదన్న పేరిట, ప్రజాస్వామిక ప్రక్రియలనే నిరోధించడం మంచిది కాదు. చెదురుమదురు సంఘటనలు జరిగాయన్న పేరుతో నిరసనకారులను ఎంపిక చేసి, తక్షణ న్యాయం అమలుచేయాలనుకోవడం జనస్వామ్యం కాదు. నిరసనలకు అవకాశం లేకపోతే, జనంలో అసమ్మతి ఎటువంటి వ్యక్తీకరణ లేక, తీవ్రమైన రూపాలు తీసుకునే ప్రమాదముంటుంది కాబట్టి. నేరాలను, నిరసనలను ఎన్‌కౌంటర్లతో, బుల్‌డోజర్లతో అదుపు చేయగలమనుకుంటే, అది ప్రజాస్వామ్యమూ కాదు, నాగరికమూ కాదు.


నిరసనకారుడు ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఆందోళన సందర్భంగా అదుపు తప్పి ప్రవర్తిస్తే, దాన్ని న్యాయస్థానంలో నిరూపించి, అందుకు అనుగుణమైన శిక్షను విధింపజేయాలి. అట్లా కాక, వారి మీద పెండింగులో ఉన్నవో, కొత్తగా కల్పించినవో అక్రమనిర్మాణాల కేసులు ఉంటే, వాటిని తవ్వితీసి, ఇళ్లను కూల్చివేయడం ఏ రకంగా న్యాయం? పోనీ, తాము, ఫలానా కారణంతో ఈ శిక్ష విధించాము అని బాహాటంగా చెప్పుకోగలరా? లేదు, అక్రమనిర్మాణాల కారణంగానే కూల్చివేశాము అని పైకి చెబుతారు, యోగి అభిమానులేమో, ముస్లిమ్ నిరసనకారులకు ఆయన విధించిన తక్షణ శిక్ష గురించి గర్వంగా చెబుతుంటారు. ఇల్లు అన్నది ఒక మనిషిది కాదు. ఆ నీడ కింద కుటుంబం బతుకుతుంది. ఇళ్లను కూల్చివేస్తున్నప్పుడు, ప్రభుత్వ యంత్రాంగాలు గ్రహించవలసింది తాము ఒక కుటుంబాన్ని కూల్చుతున్నామని. గతంలో ఢిల్లీలో జహంగీర్‌పూర్‌లోను, ఇప్పుడు ప్రయాగరాజ్‌లోనూ, నడుమ మధ్యప్రదేశ్‌లోనూ, గుజరాత్‌లోనూ జరిగిన కూల్చివేతలు మైనారిటీ మతస్థుల ఇళ్లు కావచ్చును కానీ, ఇదే పద్ధతి రాజకీయ ప్రత్యర్థుల మీద, సైద్ధాంతిక ప్రత్యర్థుల మీద ప్రయోగించడం ఆనవాయితీ కావచ్చు. బిజెపి స్థానంలో అధికారంలోకి వచ్చినవారు, రేపు బిజెపి అభిమానుల ఇళ్ల మీద కూడా ఇదే విధానాన్ని అమలుచేయవచ్చు. ఫలానా వారి మీద చేసినందుకు సంబరపడుతున్నవారు, ఒక దారుణమైన పద్ధతికి ఆమోదం ఇస్తున్నారని గ్రహించాలి. ఎవరూ ఎవరి మీదా ఇటువంటి నికృష్ట దౌర్జన్యాన్ని ప్రయోగించకుండా పౌరసమాజం గట్టి నిరసన తెలపాలి.


అప్రజాస్వామిక విధానాలను అరాధించడం, ‘ఇతరులను’ వేధించడాన్ని ఆనందించడం మన సమాజంలో కూడా మొదలయింది. వ్యక్తిగత కక్షలను మించిన కార్పణ్యంతో ప్రభుత్వాలు వ్యవహరించే కాలం అవతరిస్తున్నది. మూడు పాతికల నాటికి స్వతంత్రదేశంలో స్వేచ్ఛలకు ఏ స్థితి మిగలనున్నదో?

Updated Date - 2022-06-14T06:29:06+05:30 IST