బయోత్పాతం

ABN , First Publish Date - 2021-10-19T05:45:26+05:30 IST

ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయరంగాన్ని కుదిపేస్తున్నాయి. అతివృష్టితో ఇప్పటికే పంటలు దెబ్బతినగా, చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. విత్తనాలు మొదలు పంటచేతికొచ్చేంత వరకు అన్నదాతలు తెగుళ్ల చక్రబంధంలో చిక్కి విలవిల్లాడుతున్నారు.

బయోత్పాతం

జోరుగా పెస్టిసైడ్స్‌ దందా

తెగుళ్ల నివారణసాకుతో అమ్మకాలు

అసలు ధరకంటే అదనంగా వసూలు

నమ్మి మోసపోతున్న రైతాంగం

క్షేత్రస్థాయిలో కనిపించని వ్యవసాయాధికారులు


మిర్యాలగూడ అర్బన్‌: ప్రతికూల వాతావరణ పరిస్థితులు వ్యవసాయరంగాన్ని కుదిపేస్తున్నాయి. అతివృష్టితో ఇప్పటికే పంటలు దెబ్బతినగా, చీడపీడలు, తెగుళ్ల వ్యాప్తి రైతాంగానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. విత్తనాలు మొదలు పంటచేతికొచ్చేంత వరకు అన్నదాతలు తెగుళ్ల చక్రబంధంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. నూర్పిడి దశ చేరువలో వరిపంటను ఆశిస్తున్న చీడపీడలను నివారించేందుకు అగచాట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సాధారణానికి మించి 9.28లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అందులో సుమారు 6.82లక్షల ఎకరాల విస్తీర్ణంలో సన్నాలను (పూజ, చింట్లు 101, సాంబమసూరి) రైతులు సాగుచేశారు. జూన్‌, జూలై మాసాల్లో సాగైన వరిపైర్లు మరో పక్షం రోజుల్లో నూర్పిడి దశకు చేరుకుంటాయి. ఈ తరుణంలో దోమపోటు, ఎండాకు, పాముపొడవంటి తెగుళ్లవ్యాప్తి రైతాంగానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. అయితే కర్షకుల అవసరాన్ని సొమ్ముచేసుకునేందుకు పెస్టిసైడ్స్‌ వ్యాపారు లు కుమ్మక్కై అందినకాడికి దండుకుంటున్నారు.


 ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పెస్టిసైడ్స్‌ వ్యాపారులు బయో దందా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు పట్టణాలకే పరిమితమైన పు రుగుమందు వ్యాపారం క్రమేపీ గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించింది. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతా ల్లో సగటున నాలుగైదు ఫెస్టిసైడ్స్‌ దుకాణాలు ఉన్నాయి. వీటన్నింటినీ ప్రతినెలా తనిఖీ చేయాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తుండటంతో వ్యాపారులు అక్రమదందాకు పాల్పడుతున్నారు. ఎక్కువ మార్జిన్‌, వన్‌ ప్లస్‌ వన్‌ ఆఫర్లున్న కంపెనీల మందులను విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయాధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నతీరు పలు ఆరోపణలకు తావిస్తోంది. అయితే నకిలీ పురుగుమందుల నియంత్రణ చర్యల్లో భాగంగా నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం వ్యవసాయాధికారులు సూచించిన మందులనే రైతులకు ఇవ్వాలనే నిబంధన విధించింది. ప్రభుత్వ నిబంధనలు క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆచరణకు నోచుకోవడంలేదు. వ్యాపారులు, డీలర్లు చెప్పిందే వేదం, ఇచ్చిందే పురుగుమందు అన్నట్టు పరిస్థితి మారింది. నిత్యం లక్షలాది రూపాయల విలువైన బయో మందుల విక్రయాలు సాగుతున్నా వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు కొరవడ్డాయనే ఆరోపణలు ఉన్నాయి.


పెట్టుబడి ఘనం, ఫలితం శూన్యం

వానాకాలంలో సీజన్‌లో ఆగస్టు, సెప్టెంబరు మాసాల్లో కురిసిన వర్షాలతో వరిపైర్లు ఏపుగా పెరిగాయి. దీంతో ఈ దఫా మంచి దిగుబడులు వస్తాయని రైతులు ఆశించారు. ఆ తరువాత ప్రతికూల వాతావరణ పరిస్థితులు వరిని దెబ్బతీశాయి. ఉక్కపోత, ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గులతో వైర్‌సవ్యాప్తి పెరిగి ఎండాకు తెగులు విస్తృతమైంది. దీన్ని నియంత్రించేందుకు రైతాంగం అధికారులను ఆశ్రయించినా, వారి నుం చి సరైన సలహాలు కరువయ్యాయి. దీంతో వ్యాపారులు ఇచ్చిన మం దును వాడుతూ పెట్టుబడి భారాన్ని పెంచుకుంటున్నారు. ఎండాకు తెగులు గుబులు వీడకముందే సుడిదోమ వ్యాప్తి రైతులను మరింతగా కుంగదీస్తోంది. పంట నూర్పిడి దశలో సుడిదోమను అరికట్టేందుకు రైతులు ఇక్కట్లుపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో భరోసా ఇవ్వాల్సిన అధికారుల దర్శనం కరువైందని రైతులు వాపోతున్నారు.


అధికారులు ఫుల్‌, తనిఖీలు నిల్‌

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 15లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. దీన్ని పర్యవేక్షించేందుకు వ్యవసాయశాఖలో నల్లగొండ జిల్లాలో 31 మంది ఏవోలు, 113మంది విస్తరణాధికారులు (ఏఈవో), సూర్యాపేట జిల్లాలో 23 ఏవోలు, 82మంది విస్తరణాధికారులు, యాదాద్రి జిల్లాలో 17మంది ఏవోలు, 92 మంది విస్తరణాధికారులు పనిచేస్తున్నారు. ప్రతి ఐదు వేల ఎకరాలకు ఓ విస్తరణాధికారి చొప్పున క్లస్టర్‌ పోస్టులు భర్తీ అయ్యాయి. అయినా రైతులకు అవసరమైన సమయంలో శాఖాపర సలహాలు, సూచనలు అందని ద్రాక్షలా మారాయి. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతుబంధు, క్రాప్‌ కాలనీల గుర్తింపు, పంటసాగు వివరాల సేకరణ తదితర పనులతో అసలు విధులను గాలికి వదిలేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. అదేవిధంగా టాస్క్‌ఫోర్స్‌, విజిలెన్స్‌శాఖలు నామమాత్రమయ్యాయి. దీంతో ఫెస్టిసైడ్స్‌ తయారీ సంస్థల డీలర్లు, గుమస్తాలు, వ్యాపారులు చెప్పినట్టు పురుగు మందులు వాడుతున్న రైతులు అప్పుభారాన్ని మూటగట్టుకుంటున్నారు. వ్యాపారులు, అఽధికారుల మధ్య సఖ్యత కుదిరిందనే విమర్శలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న కొన్ని బయో కంపెనీలతో సత్సంబంధాలు నెరపుతున్న అధికారులు, ఆయా కంపెనీల ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని డీలర్లను ఆదేశిస్తున్నట్టు తెలిసింది. కృత్రిమ కొరతతో అధిక ధరకు ఎరువులు, క్రిమిసంహారక మందుల అమ్మకాలు చేసి అందులో అధికారులకు మామూళ్ల రూపంలో ముట్టజెప్పుతున్నట్టు ప్రచారంలో ఉంది. ప్రతినెలా దుకాణాల్లో పూర్తిస్థాయి తనిఖీలు చేయకుండానే స్టాక్‌రికార్డుల్లో అంతా ఓకే అన్నట్టు ముద్రవేసి సంతకంపెట్టి సర్దుకుంటున్నారని రైతుసంఘాలు ఆరోపిస్తున్నాయి.


ఎన్ని మందులు పిచికారీ చేసినా ఫలితం లేదు : మాతంగి కోటి, రైతు, వేములపల్లి

ప్రతి వానాకాలంలో సన్నాలే ఎక్కువగా సాగుచేస్తాం. పొట్ట, కంకి దశలో మందులు పిచికారీ చేస్తే మంచి దిగుబడులొచ్చేవి. ఎండాకు, దోమపోటు, పాముపొడ నివారణకు నాలుగుమార్లు మందులు పిచికారీ చేసినా ఆశించిన ఫలితం లేదు. గతంలో దోమమందు పిచికారీ చేస్తే 25రోజులు పనిచేసేది. ప్రస్తుతం వారం రోజులకే దోమ వ్యాప్తిచెందుతోంది. వానాకాలంలో వాడిన మందు యాసంగిలో దొరకదు. కొత్త మందుల్లో ఏది పిచికారీ చేయాలో అర్థం కావడం లేదు.


తనిఖీలు విస్తృతం చేస్తాం : శ్రీధర్‌రెడ్డి, డీఏవో, నల్లగొండ

నకిలీ మందుల విక్రయాలను అరికట్టేందు కు తనిఖీలు మరింత విస్తృతం చేస్తాం. కొన్ని బయో కంపెనీలు హైకోర్టు అనుమతితో ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. వాటిని అడ్డుకునే అధికారం మా పరిధిలో లేదు. రైతుల నుంచి ఫిర్యాదులొస్తే శ్యాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపిస్తాం. బయోకంపెనీల నాసిర కం ఉత్పత్తులను అరికట్టేలా త్వరలో ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేయనుంది. క్షేత్రస్థాయి అధికారులంతా రైతులకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు అందించాలి. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేదిలేదు.


Updated Date - 2021-10-19T05:45:26+05:30 IST