Cong. Presidnet election: త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ... ఖర్గే, థరూర్ మధ్యే పోటీ

ABN , First Publish Date - 2022-10-01T23:37:36+05:30 IST

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగిన జార్ఖాండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి..

Cong. Presidnet election: త్రిపాఠి నామినేషన్ తిరస్కరణ... ఖర్గే, థరూర్ మధ్యే పోటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో (congress president election) బరిలోకి దిగిన జార్ఖాండ్ మాజీ మంత్రి కేఎన్ త్రిపాఠి (KN Tripathi) నామినేషన్ (nomination) తిరస్కరణకు (Rejected) గురైంది. దీంతో పార్టీ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), శశిథరూర్‌ (Shashi  Tharoor) మధ్యే పోటీ ఖాయమైంది. నామినేషన్ల చివరి రోజైన శుక్రవారంనాడు త్రిపాఠి, ఖర్గే, శశిథరూర్ నామినేషన్ వేశారు. కాగా, త్రిపాఠి  నామినేషన్‌ను తిరస్కరించినట్టు ఏఐసీసీ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ (Madhusudan mistri) శనివారంనాడిక్కడ పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


నామినేషన్ ప్రక్రియలో 20 పత్రాలు అందాయని, వాటిలో నాలుగింటిని తిరస్కరించినట్టు మిస్త్రీ చెప్పారు. ఖర్గే 14 పత్రాలను సమర్పించగా, థరూర్ 5 పత్రాలను, త్రిపాఠి ఒక పత్రాన్ని సమర్పించారని తెలిపారు. త్రిపాఠి  నామినేషన్ పత్రంలోని ప్రపోజర్లలో ఒకరి సంతకం మ్యాచ్ కాలేదని, మరో ప్రపోజర్ సంతకం రిపీట్ అయిందని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే, డాక్టర్ శశిథరూర్ నామినేషన్ పత్రాలు మాత్రమే సక్రమంగా ఉన్నట్టు నిర్ధారించామని  తెలిపారు. అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేశారు.


లీడింగ్‌లో ఖర్గే...

కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే పార్టీ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగడంతో రాజ్యసభలో ప్రతిపక్ష నేత (ఎల్ఓపీ) పదవికి శనివారంనాడు ఆయన రాజీనామా  చేశారు. ''ఒక మనిషికి ఒకే పదవి'' అంటూ కాంగ్రెస్ ఉదయపూర్ తీర్మానానికి అనుగుణంగా ఆయన ఎల్ఓపీ పదవికి రాజీనామా చేశారు. కాగా, పార్టీ అధ్యక్షుడి ఎన్నికల్లో మద్దతు పరంగా ఖర్గే లీడింగ్‌లో ఉన్నారు. దళిత నాయకుడు కావడం, గాంధీ  కుటుంబం ఆయన వైపు మొగ్గుచూపుతున్నారనే సమాచారాన్ని బట్టి ఆయనే కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. అయితే, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్థులకు మద్దతు విషయంలో తటస్థంగా ఉన్నట్టు చెబుతోంది.


నాకు ఓటు వేయండి: ఖర్గే

పార్టీలో పెనుమార్పుల కోసం శక్తివంచన లేకుండా పోరాటం చేస్తానని, డెలిగేట్లు అందరూ తనకు ఓటు వేయాలని ఖర్గే కోరారు. అధ్యక్ష ఎన్నికల్లో తనకు మద్దతిస్తున్న అన్ని రాష్ట్రాల సీనియర్ నేతలకు కృతజ్ఞతలు తెలియశారు. ఖర్గే అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించిన (Proposed) సీనియర్ నేతల్లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, దిగ్విజయ్ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఏకే ఆంటోని, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ ఉన్నారు. జీ-23 నేతలైన ఆనంద్ శర్మ, మనీష్ తివారీ సైతం ఖర్గేకు మద్దతుగా నిలుస్తున్నారు.

Updated Date - 2022-10-01T23:37:36+05:30 IST