2021లో Kuwait కు 2.50లక్షల మంది ప్రవాసులు గుడ్‌బై!

ABN , First Publish Date - 2022-01-04T17:13:51+05:30 IST

గత కొంతకాలంగా కువైటైజేషన్ పేరుతో వలసదారుల పట్ల గల్ఫ్ దేశం కువైత్‌ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

2021లో Kuwait కు 2.50లక్షల మంది ప్రవాసులు గుడ్‌బై!

కువైత్ సిటీ: గత కొంతకాలంగా కువైటైజేషన్ పేరుతో వలసదారుల పట్ల గల్ఫ్ దేశం కువైత్‌ కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. స్థానికులకు ప్రాధాన్యమిస్తూ భారీ సంఖ్యలో ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. దీంతో ఆ దేశానికి అల్విదా చెబుతున్న ప్రవాసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇలా 2021లో భారీ సంఖ్యలో ప్రవాసులు కువైత్‌కు గుడ్‌బై చెప్పారు. తాజాగా వెలువడిన పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ (పీఏసీఐ), లేబర్ మార్కెట్ సిస్టమ్ గణాంకాల ప్రకారం గతేడాది ఏకంగా 2,57,000 మంది వలసదారులు శాశ్వతంగా ఆ దేశం నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో 2,05,000 మంది ప్రైవేట్ సెక్టార్‌కు చెందిన వారు ఉంటే, 7వేల మంది ప్రభుత్వ రంగానికి చెందినవారని గణాంకాలు చెబుతున్నాయి. 


ఇక గృహ కార్మికుల విషయానికి వస్తే.. గతేడాది 41,200 మంది కువైత్ విడిచి వెళ్లిపోయారు. ఇలా కువైత్‌ లేబర్ మార్కెట్‌లో భారీగా ప్రవాసులు తగ్గిపోవడంతో ఆటోమెటిక్ కువైటీల సంఖ్య పెరిగింది. 2021లో ఏకంగా ఆ దేశ లేబర్ మార్కెట్ కువైటీ కార్మికుల సంఖ్య 23వేలకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో ప్రస్తుతం కువైత్ లేబర్ మార్కెట్‌లో స్థానిక కార్మికుల సంఖ్య 2.7 మిలియన్లకు చేరింది. అయితే, ఇప్పటికీ డొమెస్టిక్ వర్కర్ల విషయంలో మాత్రం వలస కార్మికులే అధికంగా ఉన్నారు. ప్రస్తుతం కువైత్ లేబర్ మార్కెట్‌లో 6.39లక్షల మంది ప్రవాస గృహ కార్మికులు ఉన్నారు. ఆ దేశంలోని మొత్తం లేబర్ ఫోర్స్‌లో ఇది 22.8 శాతం.    

Updated Date - 2022-01-04T17:13:51+05:30 IST