సీఐల బదిలీలపై కసరత్తు

ABN , First Publish Date - 2020-06-03T10:06:07+05:30 IST

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమయింది.

సీఐల బదిలీలపై కసరత్తు

తుది జాబితా సిద్ధం చేసిన సీపీ 

నేడో, రేపో ఉత్తర్వులు జారీ


విశాఖపట్నం, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్ల బదిలీలకు రంగం సిద్ధమయింది. ఆర్కే మీనా సీపీగా బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్నా ఇప్పటివరకు పూర్తిస్థాయిలో సీఐల బదీలు చేపట్టలేదు.  కొంతకాలంగా ఈ ప్రక్రియ ప్రారంభించాలని భావిస్తున్నా, స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌, లాక్‌డౌన్‌ కారణాలతో వీలుపడలేదు. నగరంలో పనిచేస్తున్న కొంతమంది సీఐల పనితీరుపై విమర్శలు, ఆరోపణలు వస్తుండగా, మరికొందరికి తగిన సామర్థ్యం లేకపోవడంతో బదిలీల నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆరిలోవ, ఎయిర్‌పోర్టు, ఫోర్త్‌టౌన్‌ వంటి కీలక పోలీస్‌స్టేషన్లకు ఇంతవరకూ సీఐలను నియమించకపోవడంతో అక్కడ సీనియర్‌ ఎస్‌ఐలనే ఇన్‌చార్జిలుగా కొనసాగిస్తున్నారు.


ఆరు నెలలుగా ఇదే పరిస్థితి ఉండడంతో ఆయా స్టేషన్లలో కీలక కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదు. కొన్ని సందర్భాల్లో పోలీసులు కోర్టు ముందు నిలబడాల్సి వస్తోంది. ఈ ఏడాది మార్చి 25న ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడును ఎయిర్‌పోర్టులో వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ ఉదంతంపై హైకోర్టు సీరియస్‌ కావడంతో డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ కోర్టుకెళ్లి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. తాజాగా డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారంలో కూడా పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కేసును సీబీఐకి అప్పగించింది. ఆయా స్టేషన్ల పరిధిలో సీఐలు లేకపోవడమే ఇలాంటి పరిస్థితికి దారితీసిందనే వాదన ఆశాఖలో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐలు లేనిస్టేషన్లలో కొత్తగా నియమించడంతోపాటు,  పనితీరు సరిగా లేని వారిని ఇతర ప్రాంతాలకు పంపేయాలన్న భావనతో సీపీ ఆర్కేమీనా ఉన్నారని సమాచారం. దీంతో నగరంలో సుమారు 12 మంది సీఐలను రేంజ్‌కు సరండర్‌ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలిసింది.


కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై నిర్ణయానికి వచ్చారని, ఏజెన్సీలో ఎక్కువ కాలంగా పనిచేస్తున్నవారికి అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈమేరకు జాబితాను రూపొందించినట్టు పోలీస్‌వర్గాలు పేర్కొంటున్నాయి. ఇద్దరు డీసీపీలతో కలిసి జాబితాపై శనివారమే చర్చించినట్టు సమాచారం. అయితే ఉత్తర్వులు జారీచేసే ముందు జాబితాను నగరంలో చక్రం తిప్పుతున్న అధికారపార్టీకి చెందిన ఒక నేత ఆమోదానికి సోమవారమే సీపీ తీసుకువెళ్లారని, అయితే తాను సీఎంతో కలిసి ఢిల్లీ వెళ్తున్నందున దీనిపై తర్వాత మాట్లాడతానని ఆ నేత సీపీకి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో బదిలీల ఉత్తర్వులు జారీ కావడం ఖాయమని పోలీస్‌వర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2020-06-03T10:06:07+05:30 IST