కందుకూరు డివిజన్‌పై కసరత్తు

ABN , First Publish Date - 2022-01-29T04:52:50+05:30 IST

కందుకూరు రెవెన్యూ డివిజన్‌ రద్దు ప్రతిపాదనపై ప్రభుత్వం పునఃపరిశీలన ప్రారంభించింది. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రతిపాదిత నెల్లూరు జిల్లాలోకి మార్చటమేకాక డివిజన్‌ను రద్దుచేయాలని కొత్త జిల్లాల గెజిట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే.

కందుకూరు డివిజన్‌పై కసరత్తు
కందుకూరు సబ్‌కలెక్టర్‌ కార్యాలయం (ఫైల్‌)

ఇటు ఎమ్మెల్యే లేక అటు మంత్రి జోక్యం

సరిపఢా మండలాలు లేక కుస్తీ

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

కందుకూరు రెవెన్యూ డివిజన్‌ రద్దు ప్రతిపాదనపై ప్రభుత్వం పునఃపరిశీలన ప్రారంభించింది. జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాన్ని ప్రతిపాదిత నెల్లూరు జిల్లాలోకి మార్చటమేకాక డివిజన్‌ను రద్దుచేయాలని కొత్త జిల్లాల గెజిట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో కందుకూరు నియోజకవర్గ ప్రజల్లో పార్టీరహితంగా అసంతృప్తులు వ్యక్తమయ్యాయి. డివిజన్‌ రద్దు ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని సీఎంకి అదేపార్టీ ఎమ్మెల్యే మహీధరరెడ్డి లేఖ రాశారు. మరోవైపు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కూడా ఆ నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కలిశారు. ఈ నేపఽథ్యంలో కందుకూరు డివిజన్‌పై ప్రభుత్వంలో పునరాలోచన ప్రారంభమైంది. సీఎం కార్యాలయ అధికారులు ఇచ్చిన ఆదేశాలతో సంబంధిత ఉన్నతాధికారులు కందుకూరు డివిజన్‌గా కొనసాగించే ప్రతిపాదనపై కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుత సమాచారం మేరకు ఒక్కో రెవెన్యూ డివిజన్‌లో కనీసం 12 మండలాలు ఉండాలి. అదీ ఒకే జిల్లాకు చెందిన మండలాలు అయి ఉండాలి. ప్రస్తుతం కందుకూరు నియోజకర్గంలో ఐదు మండలాలు ఉండగా ఈ ఐదింటిని కావలి రెవెన్యూ డివిజన్‌లో కలపాలని గెజిట్‌లో ప్రతిపాదించారు. ఇప్పుడు కందుకూరు డివిజన్‌ను కొనసాగించాలంటే ఈ ఐదు మండలాలకు తోడు మరో ఏడు మండలాల వరకు కావాల్సి ఉంది. అయితే కావలి రెవెన్యూ డివిజన్‌ను కొనసాగిస్తూనే కందుకూరు పునరుద్ధరణకు అవకాశం చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఉదయగిరి నియోజకవర్గంలో కందుకూరు సమీపంలో ఉండే రెండు మండలాలను కలపాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆ ప్రకారమైనా మరో ఐదు మండలాలు కావాల్సి ఉండటంతో అటు కావలి డివిజన్‌కు ఇబ్బందిలేకుండా కందుకూరును కొనసాగించేందుకు ఇతరత్రా ఉన్న అవకాశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.  కందుకూరు నెల్లూరు జిల్లాలోకి మారుతున్నందునదాని సమీపంలో ఉన్న కొండపి, కనిగిరి నియోజకవర్గంలోని మండలాలను కలిపేందుకు అవకాశం లేదు. అందువల్ల ప్రతిపాదిత నెల్లూరు జిల్లా పరిఽధిలోని మండలాలతోనే కందుకూరు డివిజన్‌ను కొనసాగించటం సాధ్యమవుతుందా అన్న అనుమానాలు లేకపోలేదు. ఎలాగైనా రెవెన్యూ డివిజన్‌ కొనసాగించాలని మంత్రి ఒత్తిడి చేస్తుండగా నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలోకి మారిస్తే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్యే మహీధరరెడ్డి ఉన్నతాధికారులకు సూచించినట్లు తెలుస్తుంది. దీంతో ఈ కసరత్తు ఎంతమేరకు ముందుకు పడుతుందనేది వేచిచూడాల్సి ఉంది.

 సీఎంను కలిసే యోచనలో మహీధర్‌

సీఎం కలిసి సమస్యను పూర్తిగా వివరించాలన్న ఆలోచనలో ఎమ్మెల్యే మహీధరరెడ్డి ఉన్నారు. ఆ మేరకు ఆయన శుక్రవారం సెక్రటరియేట్‌లో సీఎంవో అధికారులను కలిసినట్లు తెలిసింది. అయితే వచ్చే సోమవారం తర్వాత సీఎంను కలిసేందుకు అవకాశం ఇస్తామని చెప్పినట్లు సమాచారం. రెవెన్యూ డివిజన్‌ కొనసాగించటంతోపాటు కందుకూరును ప్రకాశం జిల్లాలోనే కొనసాగే విధంగా చూడమని ఆయన సీఎంని కోరనున్నారు. మరోవైపు ఒంగోలుకు సుదూరంలో ఉన్న గిద్దలూరు నియోజకవర్గాన్ని నంద్యాలలో కలిపి కందుకూరును ఒంగోలులోనే కొనసాగిస్తే బాగుంటుందనే ప్రతిపాదనను కూడా అదే పార్టీలోని కొంతమంది లేవనెత్తినట్లు తెలిసింది. గిద్దలూరును నంద్యాలలో కలపమని ఇప్పటికే ఆ నియోజకవర్గ నాయకులు కోరుతున్నారు. ఈ నేపఽథ్యంలో కందుకూరు డివిజన్‌ కోసం ఇటు మంత్రి అటు ఎమ్మెల్యే ప్రారంభించిన ప్రయత్నాలు ఏ మలుపు తిరుగుతాయనేది వేచిచూడాలి.


Updated Date - 2022-01-29T04:52:50+05:30 IST