‘పరిషత్‌’లో స్థాయీ సంఘాల ఏర్పాటుకు కసరత్తు

ABN , First Publish Date - 2021-10-12T06:33:36+05:30 IST

జిల్లా పరిషత్‌లో పాలనకు సంబంధించి కీలకమైన అడుగులు పడబోతున్నాయి. స్థాయీ సంఘాల ఏర్పాటుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

‘పరిషత్‌’లో స్థాయీ సంఘాల ఏర్పాటుకు కసరత్తు

జడ్పీ చైర్‌పర్సన్‌గా 15న బాధ్యతలు స్వీకరించనున్న వెంకాయమ్మ

ఒంగోలు (జడ్పీ), అక్టోబరు 11: జిల్లా పరిషత్‌లో పాలనకు  సంబంధించి కీలకమైన అడుగులు పడబోతున్నాయి. స్థాయీ సంఘాల ఏర్పాటుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది. సాంకేతికంగా ఇప్పటికే జడ్పీ పాలకవర్గం కొలువుదీరినప్పటికీ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ఊపందుకోలేదు. గతనెల 25న చైర్‌పర్సన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన బూచేపల్లి వెంకాయమ్మ ఈనెల 15న పూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.


పాలకవర్గ సమావేశానికి ముందే  స్థాయీ సంఘాలు

జిల్లా పరిషత్‌ పాలకవర్గ సమావేశం ప్రతి మూడు నెలలకొకసారి నిర్వహించాల్సి ఉంది. ఈలోపు  కీలకమైన ఏడు విభాగాలకు సంబంధించిన స్థాయీ సంఘాలు సమావేశం కావాల్సి ఉంది. అందుకే ఈనెలాఖరు లోపు వీటి ఏర్పాటుకు యంత్రాంగం కసరత్తు చేస్తోంది.  జడ్పీటీసీలకు ఈ సంఘాలలో చోటు కల్పిస్తారు. వ్యవసాయం, విద్య-వైద్యం, సాంఘిక సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక, మహిళా సంక్షేమం, పనుల సంఘం ఇలా ఏడు విభాగాల్లో స్థాయీ సంఘాలు ఏర్పడతాయి. ఇవి తమకు కేటాయించిన  పనుల పురోగతిని సమీక్షించడంతోపాటు, లోటుపాట్లను పాలకవర్గానికి నివేదించాల్సి ఉంటుంది. సమస్యల పరిష్కారంలో వీటి పాత్ర ప్రముఖంగా ఉండనుంది.




Updated Date - 2021-10-12T06:33:36+05:30 IST