క్రమబద్ధీకరణకు కసరత్తు

ABN , First Publish Date - 2021-07-27T06:15:15+05:30 IST

ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కోనుగొళ్లు చేసిన ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు మార్గదర్శకాలను జారీ చేసింది. మున్సిపాలిటీలు, క్షేత్రస్థాయిలలో అఽధకార బృందాలను ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించనుంది. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ

క్రమబద్ధీకరణకు కసరత్తు
జిల్లాలో లేఅవుట్‌ లేకుండా ఉన్న ప్లాట్లు

- అక్రమ లేఅవుట్‌ల క్రమబద్ధీకరణకు మరో అవకాశం

- మార్గదర్శకాలను జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

- దరఖాస్తుల పరిశీలనకు అధికారుల బృందాల ఏర్పాటు

- 15 రోజుల్లో అర్హుల జాబితాను విడుదల చేయనున్న సిబ్బంది

- ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల ద్వారా సమకూరిన రూ.29.19 కోట్ల ఆదాయం 

- జిల్లావ్యాప్తంగా వచ్చిన మొత్తందరఖాస్తులు 29 వేలు

కామారెడ్డి, జూలై 26(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కోనుగొళ్లు చేసిన ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు రాష్ట్ర సర్కారు మార్గదర్శకాలను జారీ చేసింది. మున్సిపాలిటీలు, క్షేత్రస్థాయిలలో అఽధకార బృందాలను ఏర్పాటు చేసి వాటిని పరిష్కరించనుంది. గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన ఇంటి స్థలాలకు.. అలాగే అనుమతి లేక ఇళ్లు కట్టాలేక, అమ్ముకోలేక, బ్యాంకు రుణాలు పొందలేక ఇబ్బంది పడేవారి ఇక్కట్లను తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఖాళీ స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌)కు అవకాశం కల్పించింది. 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్ట్రేషన్‌ అయిన వాటిని క్రమద్ధీకరించుకోవచ్చని సూచించింది. దరఖాస్తులను పరిశీలించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. ప్రత్యేక బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 15 రోజుల్లో జాబితాలను రూపొందించనున్నాయి. మొదట మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ పరిధిలో సర్వే చేపట్టనున్నారు.

జిల్లాలో 29వేల 193 దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం ప్రభుత్వం గత ఏడాది అక్టోబర్‌లో దరఖాస్తులు స్వీకరించింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకే పరిమితమైన ఈ ప్రక్రియ గ్రామ పంచాయతీలకు వర్తింపజేశారు. జిల్లాలో మూడు మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలలో సుమారు 29,193 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులంతా ఆన్‌లైన్‌లో రూ.వెయ్యి చెల్లించారు. ఇళ్లు కట్టుకోవాలన్న, అమ్ముకోవాలన్న, 10 నెలలుగా ఇబ్బందులు పడుతున్న వారికి ప్రభుత్వ నిర్ణయంతో మేలు చేకూరనుంది. అంతేకాకుండా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లే అవుట్‌ లేనటువంటి ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అదేవిధంగా గతంలో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించనున్నారు.

దరఖాస్తుల రూపేనా దండిగా ఆదాయం

లే అవుట్‌ లేకుండా వెంచర్లు ఏర్పాటు చేయడం, అక్రమ లేఅవుట్‌లు విచ్చలవిడిగా అమ్మకాలు కొనుగోలు చేయడంతో ప్రభుత్వానికి ఆదాయం సమకూరడం లేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది లేఅవుట్‌ లేని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు నిలిపివేసింది. దీంతో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌లు చాలా తగ్గిపోయాయి. ఆదాయం కూడా తగ్గడంతో ప్రభుత్వం పునరాలోచించింది. ఆన్‌లైన్‌లో రూ.వెయ్యి ఫీజు చెల్లించి లేఅవుట్‌ లేని ప్లాట్లను రిజిస్ట్రేషన్‌ చేసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకుంటే రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో ప్లాట్ల క్రయవిక్రయాలు జరుపుకోవచ్చని ఆదేశించింది. దీంతో లేఅవుట్‌ లేని ప్లాట్ల యాజమానులు ఆన్‌లైన్‌లో రూ.వెయ్యి చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుల రూపేనా ప్రభుత్వానికి దండిగానే ఆదాయం సమకూరడం గమనార్హం. జిల్లావ్యాప్తంగా మూడు మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలలో మొత్తం 29,193 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల రూపేనా రూ.29.19 కోట్లు ఆదాయం సమకూరింది. 526 గ్రామపంచాయతీలలో సుమారు 9,257 అక్రమ ప్లాట్ల దరఖాస్తులు రాగా, వీటి రూపేనా రూ.9,25,7000 వచ్చింది. కామారెడ్డి మున్సిపాలిటీలో 17,124 దరఖాస్తులు రాగా రూ.17,12,4000 ఆదాయం సమకూరింది. బాన్స్‌వాడలో 1904 దరఖాస్తులు రాగా రూ.1,90,4000 ఆదాయం సమకూరింది. ఎల్లారెడ్డిలో 908 దరఖాస్తులు రాగా రూ.90,8000 ఆదాయం వచ్చింది.

రెండు దశల్లో క్రమబద్ధీకరణ పూర్తి

అక్రమ ప్లాట్ల క్రమబద్ధీకరణను రెండు దశల్లో పూర్తి చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను మొదట మున్సిపాలిటీ, పంచాయతీల వారిగా వేరు చేస్తారు. తర్వాత గ్రామ సర్వే నెంబర్‌, కాలనీ, వార్డుల వారిగా విభజిస్తారు. రెండో దశలో అధికారులు క్షేత్రస్థాయిలో స్థలాలను పరిశీలిస్తారు. రెవెన్యూ, నీటిపారుదల పంచాయతీరాజ్‌ శాఖలు, పట్టణ ప్రణాళికా అఽధికారులు ఈ బృందంలో సభ్యులుగా ఉంటారు. ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనలకు లోబడి ఉన్న వాటి వివరాలు మున్సిపల్‌ కమిషనర్‌కు అందించనున్నారు. అనంతరం వాటిని కలెక్టర్‌ అనుమతితో ఆమోదిస్తారు.

వీటికి మాత్రమే అనుమతి

అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. అనధికార లేఅవుట్లలో రిజిస్టర్‌ సెల్‌ డీడ్‌ ద్వారా కొనుగోలు చేసిన ప్లాట్లకు అనుమతి ఇవ్వనున్నారు. కనీసం 10 శాతం ప్లాట్ల రిజిస్టర్‌ సెల్‌ డీడ్‌ ద్వారా విక్రయించిన అనధికార లే అవుట్‌లకు, సెల్‌ డీడ్‌ లేదా టైటిల్‌ డీడ్‌ తప్పనిసరిగా ఉండాలి. అసైన్‌ భూముల్లో ప్లాట్లు, లే అవుట్‌లు ఉంటే కలెక్టర్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోనున్నారు. నిషేధిత జాబితాలో భూములను ప్లాట్లుగా మార్చితే.. వాటిని ఎల్‌ఆర్‌ఎస్‌కు రిజక్ట్‌ చేయనున్నారు. భూ గరిష్ట పరిమితి చట్టానికి భిన్నంగా ఉన్నవి, సరిహద్దులు మొదలైన వివాదాలు ఉంటే అనుమతి నిరాకరించనున్నారు. జీవో 111లో నిర్దేశించిన ప్రాంతాలు, చెరువులు, ఎఫ్‌డీఎల్‌ పరిధిలో ఉన్నవి, నాలాకు రెండు మీటర్ల లోపు ఉంటే వాటికి అనుమతి నిరాకరించనున్నారు.

అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి

: దేవేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌, కామారెడ్డి

కామారెడ్డి మున్సిపల్‌ పరిధిలో అక్రమంగా చేపట్టిన లేఅవుట్లను క్రమబద్ధీకరించుకోవాలి. ఇప్పటి వరకు 17,124 దరఖాస్తులు రాగా రూ.17 కోట్ల వరకు ఆదాయం మున్సిపాలిటీకి సమకూరింది. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  

Updated Date - 2021-07-27T06:15:15+05:30 IST