‘దళితబంధు’కు కసరత్తు

ABN , First Publish Date - 2022-01-28T04:01:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమం

‘దళితబంధు’కు కసరత్తు

  • ఒక్కో నియోజకవర్గంలో వంద మంది లబ్ధిదారుల ఎంపిక
  • జిల్లాలో 800 కుటుంబాలు లబ్ధిపొందే అవకాశం 
  • లబ్ధిదారులకు రూ.9.90 లక్షలతో యూనిట్‌, రూ.10వేలతో రక్షణ నిధి
  • ఎమ్మెల్యేలకు సవాలుగా మారనున్న ఎంపిక ప్రక్రియ 
  • ఫిబ్రవరి 5 వరకు లబ్ధిదారుల ఎంపిక, మార్చి 7లోగా గ్రౌండింగ్‌ చేసేందుకు చర్యలు


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు కార్యక్రమం జిల్లాలో అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది.  ప్రతి నియోజక వర్గంలో వంద మంది లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను సర్కార్‌ ఎమ్మెల్యేలకు అప్పగించింది. అయితే లబ్ధిదారుల ఎంపిక వీరికి తలనొప్పిగా మారింది. జిల్లాలో దళిత కుటుంబాలు అధికంగా ఉన్న నేపథ్యంలో ఎవరిని ఎంపిక చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 


రంగారెడ్డి అర్బన్‌, జనవరి 27 : జిల్లాలో దళితబంధు పథకం అమలు కోసం లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు మొదలైంది. చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌, మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, షాద్‌నగర్‌ కల్వకుర్తి నియోజకవర్గాలున్నాయి. ఒక్కో నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఎంపికలో పారదర్శకంగా ఉండేందుకు నియోజకవర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. ఎంపిక ప్రక్రియ షురూ అయింది. 

లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలదే..

దళితబంధు పథకానికి లబ్ధిదారుల ఎంపిక చేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలకు అప్పగించింది. దీంతో ఎమ్మెల్యేలు ఎంపిక ప్రక్రియను ఎలా చేపడదామన్న ఆలోచనలో పడ్డారు. ఒక్కో నియోజకవర్గంలో వంద కుటుంబాలను ఎంపిక చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం రూ.10 లక్షల నిధులను ఎలాంటి షరతులు లేకుండా మంజూరు చేయడంతో ఎక్కువ మంది లబ్ధిదారులు దళితబందు పథకంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే ఎవరిని కాదన్నా ఎమ్మెల్యేలకు వ్యతిరేకత, ఇతర ఇబ్బందులు వచ్చిపడే అవకాశం కనిపిస్తోంది. ఒకరిని ఎంపిక చేసి మరొకరిని చేయకుంటే.. ఇబ్బందులు తప్పవన్న భావనతో ఎమ్మెల్యేలున్నారు. వ్యతిరేకత వ్యక్తమైతే పరిస్థితులు ఏమిటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీకి చెందినవారికే పథకం అందితే ఇతర పార్టీల నుంచి ఆరోపణలు, విమర్శలు తప్పేలా లేవంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేలకు సవాలుగా మారనుంది. 

నేరుగా రూ.10లక్షలు జమ

ఈపథకం కింద దళితులకు బ్యాంక్‌లతో సంబంధం లేకుండా రూ.10 లక్షలు నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తారు. తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా గ్రాంట్‌ రూపంలో అందజేస్తారు. ప్రస్తుతం జిల్లాలో 1,18,541 దళిత కుటుంబాలు ఉన్నట్లు సర్వే ద్వారా తేలింది. దళిత జనాభాను పరిశీలిస్తే... జిల్లాలో మ్తొతం 4,47,888 దళితులు ఉన్నారు. అందులో 2,25,317 మంది పురుషులు, 2,21,834 మంది మహిళలు, 737 మంది ఇతరులు ఉన్నారు. 

లబ్ధిదారులు ఎంపిక చేసుకునేవి ఇవే..

దళితబంధు పథకం ద్వారా ప్రభుత్వం అందించే డబ్బులతో వ్యవసాయ, అనుబంధపథకాలు ఎంపిక చేసుకోవచ్చు. అందులో మినీ డెయిరీ (పాడిగేదెల పెంపకం), ట్రాక్టర్‌ ట్రాలీ, ట్రాక్టర్‌, కోడిపిల్లల పెంపకం, (నాటుకోళ్లు/బాయిలర్‌+ఆటోట్రాలీ, వరినాటు వేసే యంత్రం (2యూనిట్స్‌)+పవర్‌ టిల్లర్‌, పందిరి కూరగాయల సాగు ఉన్నాయి. అలాగే ట్రాన్స్‌పోర్టు (ప్యాసెంజర్‌అండ్‌ గూడ్స్‌)లో... 7సీటర్‌ ఆటో, ఆటోరిక్షా (ప్యాసెంజర్‌ ఆటో-3 యూనిట్స్‌), 3 చకాల్ర ఆటో ట్రాలీ, (సరుకుల రవాణా), నాలుగు చక్రాల ఆటో (ప్రయాణికులు/సరుకు రవాణా) ఉన్నాయి. 

అలాగే ఉత్పత్తి పథకాల్లో... ఐరన్‌గేట్స్‌, గ్రిల్స్‌ తయారీ యూనిట్‌+ఆటో ట్రాలీ, కాంక్రీట్‌ మిశ్రమం తయారీ యంత్రాలు (2, 3యూనిట్లు), సిమెంట్‌ ఇటుకలు/రింగుల తయారీ, ఫ్రీ కాస్టింగ్‌ గోడలు+ఆటో ట్రాలీ, సెంట్రింగ్‌/ఆర్‌సీసీరూప్‌ మేకింగ్‌ యూనిట్‌ (స్టీల్‌అండ్‌ వుడెన్‌ )/కాంక్రీట్‌ మిశ్రమం తయారీ యంత్రం, మట్టి ఇటుకల తయారీ+ఆటో ట్రాలీ, మడిగల నిర్మాణం, వ్యాపారం, ఆయిల్‌ మిల్‌, వెట్ట గ్రైండర్‌, బియ్యం, పసుపు, కారం మిల్లులున్నాయి. 

రిటైల్‌ దుకాణాల్లో... మెడికల్‌ అండ్‌ జనరల్‌ స్టోర్స్‌, మినీ సూపర్‌ బజార్‌, ఎలక్ర్టానిక్‌ పరికరాల అమ్మకం, సేవలు, ఎలక్ర్టికల్‌ షాప్‌, మోటర్‌ వైండింగ్‌, బ్యాటరీ సేవలు, హార్డ్‌వేర్‌, శానిటరీ దుకాణం+ఆటోట్రాలీ, టైల్స్‌ వ్యాపారం (రిటైల్‌) +ఆటో ట్రాలీ, విత్తనాలు/ఎరువుల, క్రిమిసంహార మందుల దుకాణం, వ్యవసాయ సాగు యంత్ర పరికరాల సేల్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

సేవల్లో... హోటల్‌ అండ్‌ క్యాటరింగ్‌ సర్వీ్‌స (దాబా)+ఆటో ట్రాలీ, డీటీపీ, మీసేవా, సీఎస్సీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ సెంటర్‌ మరియు ఫొటో స్టూడియో, డయోగ్నస్టిక్‌ ల్యాబ్‌, మెడికల్‌ షాప్‌, ఎలక్ట్రికల్‌ షాపు, మోటర్‌ వైండింగ్‌, బ్యాటరీ సేవలు, టెంట్‌ హౌస్‌, డెకరేషన్‌, లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌+ఆటో ట్రాలీ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. ఒక్కరే కాకుండా ఇద్దరు, ముగ్గురు లబ్ధిదారులు కలిసి రూ.30, రూ.40 లక్షలతో పెద్ద వ్యాపారం చేసుకునే అవకాశం కల్పించారు.


రూ.10 వేలతో రక్షణ నిధి 

దళితబంధు పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు రూ.9 లక్షల90 వేలతో యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే విధంగా నిధులను మంజూరు చేస్తారు. మిగతా రూ.10వేలతో ప్రభుత్వమే రక్షణ నిధిని ఏర్పాటు చేస్తుంది. ఏదైనా ఆపద సమయంలో లబ్ధిదారులను ఆదుకునేందుకు ఈ నిధి ద్వారా సహాయం పొందే  అవకాశం ఉంటుంది. 


మార్చి 7లోగా గ్రౌండింగ్‌

ఫిబ్రవరి 5వ తేదీ వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేసి మార్చి 7లోగా యూనిట్లను గ్రౌండింగ్‌ చేయాలని ప్రభుత్వం జిల్లా అధికారులను ఆదేశించింది. లబ్ధిదారులకు  పథకం అమలుపై అవగాహన కల్పించాలని సూచించింది. ఇందులో ట్రాక్టర్స్‌, ఆటోరిక్షాలు, హార్వెస్టర్స్‌, డెయిరీఫాం, కోళ్లఫాం, మేకల యూనిట్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. లాభసాటి అయ్యే యూనిట్లను మాత్రమే ఎంపిక చేసుకునేలా అధికారులు సలహాలు, సూచనలు అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. 


ఎంపిక ప్రక్రియ షురూ

దళితబంధు పథకం అమలులో భాగంగా జిల్లాలో లబ్ధిదారుల ఎంపిక ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి ప్రతి నియోజక వర్గానికి ఒక ప్రత్యేక అధికారిని నియమిం చడం జరిగింది. ప్రత్యేకాధికారి సమన్వ యంతో ఎమ్మెల్యే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. లబ్ధిదారుల ఎంపిక అనంతరం కలెక్టర్‌ ప్రతి మండలంలో అనువైన బ్యాంకును ఎంపిక చేసి కుటుంబ పెద్ద పేరిట ప్రత్యేకంగా దళితబంధు ఖాతాను తెరిపిస్తారు. యూనిట్ల ఏర్పాటుకు సంబం ధించి కలెక్టర్‌ను సంప్రదించి ఆమోదం తీసు కున్న తర్వాతే చెల్లింపులు జరుగుతాయి. నిధులు ఒకేసారి కాకుండా ప్రాజెక్టు నిర్వహిస్తున్నా కొద్ది విడుదలవుతాయు. మార్చి 7లోగా యూనిట్ల గ్రౌండింగ్‌ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.

- ప్రవీణ్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ 


జిల్లాలో దళిత కుటుంబాల వివరాలు

నియోజకవర్గం కుటుంబాలు జనాభా పురుషులు మహిళలు ఇతరులు

చేవెళ్ల 17,019 61,640 31,110 30,442 88

ఇబ్రహీంపట్నం 22,060 80,383 40,550 39,695 138

ఎల్బీనగర్‌ 15,656 58,187 28,940 29,120 127

మహేశ్వరం 12,820 47,845 24,094 23,680 71

రాజేంద్రనగర్‌ 17,820 67,986 34,076 33,799 111

శేరిలింగంపల్లి 11,442 43,084 21,847 21,139 98

షాద్‌నగర్‌ 13,114 53,935 27,133 26,744 58

కల్వకుర్తి 8,583 34,828 17,567 17,215 46

మొత్తం 1,18,541 4,47,888 2,25,317 2,21,834 737

Updated Date - 2022-01-28T04:01:33+05:30 IST