రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

ABN , First Publish Date - 2021-05-09T08:28:38+05:30 IST

రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి

రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు

సాయంత్రం 6 వరకు విత్తన కేంద్రాలు: సర్కారు మార్గదర్శకాలు


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ అనుబంధ రంగాలకూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. వ్యవసాయ అనుబంధపనుల కోసం వెళ్లే కూలీలకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య శనివారం ఆదేశాలు జారీచేశారు. అదే సమయంలో మాస్కులు, తగినంత భౌతికదూరం వంటి కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పనులు చేసుకోవాలని స్పష్టం చేసింది. ‘‘విత్తన అమ్మక కేంద్రాలు, పురుగు మందులు అమ్మే దుకాణాలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. రైతు బజార్లలో 4 నుంచి 6 ఆడుగులు దూరం తప్పని సరిగా పాటించాలి. అక్కడ నో మాస్క్‌.. నో ఎంట్రీ బోర్డులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తెలిపింది. 


మినహాయింపులివీ..

1)వ్యవసాయ కార్యక్రమాల్లో రైతులు, వ్యవసాయ కూలీలు సామాజిక దూరం పాటించడం,  శానిటైజేషన్‌, డబుల్‌ మాస్కులు పెట్టుకోవడం తప్పనిసరి. 2)వ్యవసాయ కూలీల రవాణా, వ్యవసాయ పనిముట్లు యంత్రాల తరలింపునకు స్థానిక వ్యవసాయ అధికారులు పాస్‌లు మంజూరు చేయాలి. 3) ఆహార ధాన్యాలు, ఇతర నిత్యావసర వస్తువులు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తీసుకెళ్లే రైతులను అడ్డుకోరాదు. సామాజిక దూరం పాటిస్తూ వీరు తమ కార్యకలాపాలు చేసుకోవచ్చు. 4) వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తుల రవాణాపై ఆంక్షలు పెట్టరాదు. వ్యవసాయ సీజన్‌, స్థానిక డిమాండ్‌ను బట్టి తమ ఉత్పత్తులను రైతులు రాష్ట్రంలో ఎక్కడికైనా తరలించుకోవచ్చు. 5) రాయితీ విత్తనాల పంపిణీకి, వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు, రవాణాకు కర్ఫ్యూ నిబంధనలు వర్తించవు. 6) వ్యవసాయ యంత్రాల అమ్మకం, మరమ్మతు సంబంధిత దుకాణాలు, విత్తనాలు, ఎరువులు పురుగుమందుల షాపులు, ఇతర వ్యవసాయ ఇన్‌పుట్లకు సంబంధించిన షాపులు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తీయవచ్చు. 7) వేసవి పంటలు, ముందస్తు ఖరీఫ్‌ వ్యవసాయ పనులకు కర్ఫ్యూ నుంచి మినహాయింపు 8) జిల్లాల్లో రైతులకు ఏవైనా శిక్షణ కార్యక్రమాలు ఉంటే అవి అన్నీ వర్చువల్‌ మోడ్‌లో నిర్వహించాలి 9) రాయలసీమ జిల్లాల్లో జరిగే రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీ కార్యక్రమానికి కర్ఫ్యూ నుంచి మినహాయింపు. 10) ఖరీఫ్‌ రాయితీ విత్తనాలను బయోమెట్రిక్‌ వేయకుండానే రైతు భరోసా కేంద్రాల్లో తీసుకొనే వీలు. 11) విత్తన ప్యాకింగ్‌కీ కర్ఫూ నుంచి మినహాయింపు 12) ఈ నెల 13 తేదీన జరిగే రైతు భరోసా పంపిణీలో కొవిడ్‌ రూల్స్‌ పాటిస్తూ రైతులు పాల్గొనాలి. 

Updated Date - 2021-05-09T08:28:38+05:30 IST