Abn logo
Feb 20 2020 @ 03:22AM

స్థలాల సాకు.. పేదలకు ‘షాకు’

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి-కాకినాడ)

ఇంటి స్థలం లేని పేదలకు ఉగాదికి స్థలాలు ఉచితంగా కేటాయింపు పట్టా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇంటిస్థలం లేని పేదలు జిల్లాలో పట్టణాల పరిధిలో 1,05,460   మంది, గ్రామాల్లో 2,07,853 మంది అర్హులుగా తేలారు. వీరందరికి వ్యక్తిగత, జీప్లస్‌ తరహా ఇళ్లు   కట్టించి ఇవ్వడానికి 4,794 ఎకరాలు అవసరమని గుర్తించారు. కానీ 1390 ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇంకా 3,404 ఎకరాల ప్రైవేటు భూముల అవసరం ఏర్పడింది. వీటిని కొనుగోలు  చేయడానికి ఎంత డబ్బు  అయినా  ఇస్తామని సీఎం జగన్‌ బయటకు ప్రకటిస్తున్నా తెరవెనుక మాత్రం నిధులు విదల్చడం లేదు. దీంతో అధికారులు ప్రైవేటు భూములకు బదులుగా గతంలో పేదలకు కేటాయించిన ప్రభుత్వ అసైన్డ్‌ భూములు, ప్రభుత్వ శాఖల భూములు, చెరువులు డబ్బులు ఖర్చవకుండా సేకరించి మమ అనిపిస్తు న్నారు.


అందులోభాగంగా పెద్దఎత్తున అసైన్డ్‌ భూములు తీసుకునేందుకు ఇప్పటికే రెవెన్యూశాఖ నోటీసులు జారీచేసింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో 25.26 ఎకరాల పేదల అసైన్డ్‌ భూములపై కన్నేసి నోటీసులు ఇచ్చింది. ఇందులో బడుగు రైతులు సాగుచేసుకుంటున్నారు. ఇప్పుడు వీటిని పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో కేటాయించబోతున్నారు. కానీ వీటిని సాగుచేస్తోన్న రైతులు తమ బతుకులు రోడ్డున పడేయవద్దని మొత్తుకుంటున్నారు. ఇటీవల ఈప్రాంతానికి చెందిన బాలరాజు అనే రైతు ఏకంగా మనోవేదనతో గుండెపోటుతో మృతిచెందారు.


అలాగే సామర్లకోట మండలం బ్రహ్మనందపురం, గొంచాల గ్రామాలకు చెందిన రైతులు 1963 నుంచీ అసైన్డ్‌ భూములను సాగుచేసుకుంటున్నారు. ఇప్పుడు వీటినీ ఇళ్లస్థలాల కోసం లాక్కోవడానికి నోటీసులు ఇచ్చారు. వీరంతా ఇప్పుడు లబోదిబో మంటున్నారు. అలాగే భూముల కొరత సాకుతో జిల్లావ్యాప్తంగా పంచాయతీలు, మున్సిపాల్టీల పరిధిలో చెరువులను కూడా ఇప్పటికే చెరబట్టారు.


ఇవి పాడైపోయాయనే సాకుతో వాటిని పూడ్చి ఇళ్ల స్థలాల కింద ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. సామర్లకోట పట్టణం పరిధిలో 30 ఎకరాల కొండచెరువు, ఆత్రేయపురంలో 10 చెరువులు, శంఖవరంలో రెండెకరాల ఎరకాపురం చెరువు, పెద్దాపురంలో 70 ఎకరాల రామేశ్వరం మెట్ట భూములు  స్థలాల పేరుతో సేకరిస్తున్నారు. 


సెజ్‌లు, పోర్టు, విశ్వవిద్యాలయాలు, ఉప్పు భూములు...

కోట్టు ఖర్చుపెట్టి ప్రైవేటు భూములు సేకరించలేక ఇతర ప్రభుత్వశాఖల భూములూ రెవెన్యూ అధికారులు తీసేసు కుంటున్నారు. రాజమహేంద్రవరంలో పశుసంవర్థక శాఖకు చెందిన 11 ఎకరాలు, ఆర్టీసీవి 5.93ఎకరాలు, జిల్లా పరిషత్‌వి 9.74 ఎకరాలు, మత్స్యశాఖది 1.98ఎకరాలు, ఓన్జీసీది ఆరు ఎకరాలు, సాంఘీక సంక్షేమశాఖవి 3ఎకరాలు, ఆర్‌అండ్‌బీవి 87 సెంట్లు, వైద్య ఆరోగ్యశాఖవి 1.30ఎకరాలు, ట్రాన్స్‌కోకు చెందిన 84 సెంట్లు, సాంకేతిక విద్యాశాఖకు చెందిన 4.80 ఎకరాలు, బీసీ సంక్షేమశాఖవి 3.20 ఎకరాలు, ఉపాధికల్పన విభాగానికి సంబంధించి 3.63 ఎకరాలు, పోలీసుశాఖది 5.24 ఎకరాలు, ఉద్యానశాఖవి 20ఎకరాలు, అటవీశాఖవి 20.24 ఎకరాలు, ఏపీఐఐసీ 14 ఎకరాలు తీసుకుంటున్నారు. తమ శాఖల భవిష్యత్తు అవసరాలకు ఇవి కావాలని చెప్పినా ప్రభుత్వం వదల్లేదు. 


వెయ్యి ఎకరాలకు పైగా పోర్టు, సెజ్‌ భూములు, ఉప్పు భూములు

కాకినాడ పోర్టుకు 116 ఎకరాలున్నాయి. ఇవి తమ కార్గో అవసరాలకు కావాలని చెప్పినా బలవంతంగా ఒప్పించి లాక్కున్నారు. కాకినాడ సెజ్‌లో 46 ఎకరాలను గుర్తించి వాటానీ తీసేసుకున్నారు. అలాగే చొల్లంగిలో ఉప్పుభూములు 816 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నాలు భారీగా జరుగుతు న్నాయి. కేంద్ర సాల్ట్‌కమిషనర్‌ పరిధిలోని ఈభూములు తమకు ఇవ్వాలని ఇప్పటికే లేఖ కూడా రాష్ట్రప్రభుత్వం తరఫున వెళ్లింది. వాస్తవానికి ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు జీప్లస్‌ వన్‌ విధానంలో చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


అటు వ్యక్తిగత ఇళ్లకు కూడా పెద్దగా ఈభూములు పనికిరావనే వాదన ఉంది. కానీ స్థలాల కొరత పేరుతో ఎక్కడోదగ్గర పట్టాలు ఇచ్చేసి చేతులు దులిపేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు లబ్ధిదారులు ఏమో జన సంచారం లేని ప్రాంతాల్లో ఇళ్లస్థలాలు, అందులో ఇళ్లు కట్టిస్తే ఏంచేసుకోవాలి? ఎలా ఉండాలి? అని మథనపడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇదేం పట్టించుకోవడం లేదు.

Advertisement
Advertisement
Advertisement