అధికార మదంతో బరితెగింపు

ABN , First Publish Date - 2022-06-26T08:20:19+05:30 IST

అధికార మదంతో బరితెగింపు

అధికార మదంతో బరితెగింపు

గ్రామ సచివాలయంలో దివ్యాంగ ఉద్యోగిపై దాష్టీకం 

మద్యం మత్తులో వైసీపీ సర్పంచ్‌ భర్త వీరంగం

ఉద్యోగులు అడ్డుకోగా వెంబడించి మరోసారి దాడి

ఉన్న కాలు కూడా విరిచేస్తానంటూ బెదిరింపు 

శ్రీకాకుళంలో ఘటన.. సోషల్‌ మీడియాలో వైరల్‌


నందిగాం, జూన్‌ 25: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నాయకుడు అధికార మదంతో బరితెగించాడు. మద్యం సేవించి వచ్చి గ్రామ సచివాలయంలో వీరంగం సృష్టించాడు. దివ్యాంగుడైన ఓ డిజిటల్‌ అసిస్టెంట్‌ను దుర్భాషలాడుతూ దాడికి పాల్పడ్డాడు. ఉన్న కాలు కూడా విరిచేస్తానంటూ హెచ్చరించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా నందిగాం మండలం కవిటి అగ్రహారం గ్రామంలో ఇటీవల వైఎ్‌సఆర్‌ పింఛన్‌ కానుక కింద లబ్ధిదారులను గుర్తించారు. అయితే తమ వారికి పింఛన్లు రాలేదని, మంజూరు చేసిన వాటిని నిలిపివేయాలని సర్పంచ్‌ వరలక్ష్మి భర్త, వైసీపీ నాయకుడు బొమ్మాళి గున్నయ్య ఉద్యోగులను బెదిరించాడు. శనివారం మద్యం సేవించి సచివాలయానికి వచ్చి.. అక్కడ విధులు నిర్వహిస్తున్న డిజిటల్‌ అసిస్టెంట్‌ వాసుదేవరావును దుర్భాషలాడుతూ ఒక్కసారిగా దాడి చేశారు. వాసుదేవరావు దివ్యాంగుడు. ఒక కాలు పనిచేయదు. ఇతర ఉద్యోగులు వాసుదేవరావును కాపాడే ప్రయత్నం చేశారు. అయితే గున్నయ్య  రైల్వేగేటు వరకు ఆయనను వెంబడించి మరోసారి దాడి చేశారు. ఉన్న కాలు కూడా విరిచేస్తానంటూ అసభ్య పదజాలంతో దూషించారు. ఈ ఘటనను వీడియో తీసిన మరో సచివాలయ ఉద్యోగిపై కూడా సర్పంచ్‌ భర్త బెదిరింపులకు పాల్పడ్డారు. దాడి విషయం తెలుసుకున్న సచివాలయ ఉద్యోగులంతా నందిగాం మం డల పరిషత్‌ కార్యాలయం వద్ద కు చేరుకుని ఆందోళనకు దిగారు. సచివాలయ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. దాడికి గురైన వాసుదేవరావు మాట్లాడుతూ.. గున్నయ్య మూడు నెలలుగా తనను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఈ విషయాన్ని నాయకులు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. తాను విధుల్లో ఉండగా దాడి చేసి దుస్తులు చింపేసి మరో కాలు విరిచేస్తానంటూ బెదిరించారన్నారు. ఎంపీడీవో కె.ఫణీంద్రకుమార్‌కు సచివాలయ ఉద్యోగులు వినతిపత్రం అందించారు. దాడి విషయాన్ని ఎంపీపీ నడుపూరి శ్రీరామ్మూర్తి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నాయకుడు బొమ్మాళి గున్నయ్యపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మహమ్మద్‌ యాసిన్‌ తెలిపారు. 

Updated Date - 2022-06-26T08:20:19+05:30 IST