భారత సైన్యం యాప్ క్లోన్‌డ్ వెర్షన్‌తో సైనికుల డేటా చోరీ?

ABN , First Publish Date - 2022-02-03T00:04:23+05:30 IST

భారతీయ సైనికుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌నకు

భారత సైన్యం యాప్ క్లోన్‌డ్ వెర్షన్‌తో సైనికుల డేటా చోరీ?

న్యూఢిల్లీ : భారతీయ సైనికుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన యాప్‌నకు నకిలీ యాప్ చలామణి అవుతున్నట్లు మాల్‌వేర్ హంటర్ టీమ్ వెల్లడించింది. ఆర్మీ మొబైల్ ఆధార్ యాప్ నెట్‌వర్క్ (ARMAAN)ను పోలి ఉండేలా దీనిని రూపొందించినట్లు తెలిపింది. ఈ నకిలీ యాప్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లపై రిమోట్ యాక్సెస్ ట్రోజన్ (RAT) దాడులు చేస్తున్నట్లు తెలిపింది. 


మాల్‌వేర్ హంటర్ టీమ్ మాయదారి సాఫ్ట్‌వేర్‌లను గుర్తిస్తూ ఉంటుంది. ఈ బృందం ఈ నకిలీ యాప్‌ను గుర్తించినట్లు ట్విటర్ వేదికగా వెల్లడించింది. సమాచారాన్ని అందజేయడం, మిలిటరీ ఇంజినీరింగ్ సేవలకు సంబంధించిన ఫిర్యాదులు, సైనిక విశ్రాంతి గృహాలకు సంబంధించిన సమాచారం తదితర అవసరాల కోసం ఒరిజినల్ ARMAAN యాప్‌ను భారత సైన్యం వినియోగిస్తోంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు సందేశాలు పంపించే సదుపాయం కూడా ఈ ఒరిజినల్ యాప్‌లో ఉంది. దీనిని వాడుకోవడం కోసం సైనికులు, అధికారులు తమ ఆధార్ సంఖ్యలను, ఆధార్ అనుసంధానంగల మొబైల్ ఫోన్లను ఉపయోగిస్తున్నారు. 


క్లోన్ చేసిన యాప్  తాలూకు ఆండ్రాయిడ్ ప్యాకేజి (ఏపీకే) అధికారిక యాప్ తాలూకు అపియరెన్స్, ఫంక్షనాలిటీని అనుకరిస్తూ ఉంది. డివైసెస్ నుంచి డేటాను దొంగిలించే సామర్థ్యం ఈ నకిలీ యాప్‌నకు ఉంది. 


ఈ మాల్‌వేర్‌పై Cyble అనే సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ సంస్థ కూడా విశ్లేషించింది. భారతీయ సాయుధ దళాలకు ఈ మాలిషియస్ ARMAAN యాప్ తీవ్రమైన సవాలును విసురుతోందని తెలిపింది. భారత సైనికుల కాంటాక్ట్స్, కాల్ లాగ్స్, ఎస్ఎంఎస్‌లు, లొకేషన్, ఎక్స్‌టర్నల్ స్టోరేజ్‌లోని ఫైళ్ళు మొదలైనవాటిని దొంగిలించగల సామర్థ్యం దీనికి ఉందని తెలిపింది. సెన్సిటివ్ ఆడియోను కూడా రికార్డు చేయగలిగే సామర్థ్యం దీనికి ఉన్నట్లు తెలిపింది. 




Updated Date - 2022-02-03T00:04:23+05:30 IST