రెచ్చిపోతున్న ఇసుక తోడేళ్లు

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

హల్దీవాగు నుంచి ఇసుక తీయొద్దంటూ గతంలో హైకోర్టు జారీ చేసిన స్టేను ధిక్కరించి ఇసుక రవాణా చేస్తున్నారు.

రెచ్చిపోతున్న ఇసుక తోడేళ్లు
హల్దీవాగు నుంచి ఇసుక తోడేస్తున్న దృశ్యం (ఫైల్‌)

 హైకోర్టు స్టేను ధిక్కరిస్తూ యథేచ్ఛగా దందా

 టార్పాలిన్లను కప్పి ధాన్యమంటూ రవాణా


తూప్రాన్‌, మే 20: హల్దీవాగు నుంచి ఇసుక తీయొద్దంటూ గతంలో హైకోర్టు జారీ చేసిన స్టేను ధిక్కరించి ఇసుక రవాణా చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం ఖాన్‌చెరువు నుంచి మొదలవుతున్న హల్దీవాగు మెదక్‌ జిల్లాలో 47 కిలోమీటర్లు ప్రవహిస్తున్నది. వెల్దుర్తి మండలంలో 16 కిలోమీటర్ల మేర ఉన్నది. ఈ హల్దీవాగులో లభించే ఇసుకకు భవన నిర్మాణంలో మంచి డిమాండ్‌ ఉంది. హల్దీ పరీవాహక ప్రాంతం రైతుల విజ్ఞప్తితో ఇసుక తవ్వడంపై 1991లో హైకోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు. 2018లో ప్రజావసరాల పేరిట తోడడం మొదలెట్టడంతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేచింది. ఇసుక తీయడాన్ని వ్యతిరేకించి రైతులతో కలిసి కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు హైకోర్టు మెట్లు ఎక్కారు. 2018లోనే హల్దీవాగు నుంచి ఇసుకను తీయొద్దంటూ హైకోర్టు మళ్లీ స్టే విధించింది. దాంతో కొంత కాలంగా ఇసుక రవాణా ఆగిపోయింది. ఇటీవల కొందరు హైకోర్టు స్టేను ధిక్కరిస్తూ యథేచ్ఛగా ఇసుక వ్యాపారం కొనసాగిస్తున్నారు.


ధాన్యం పేరిట రవాణా

హల్దీవాగులోకి కాళేశ్వరం జలాలు వదలడంతో చెక్‌డ్యాంలు నీటితో కళకళలాడుతున్నాయి. చెక్‌డ్యాంల వద్ద కిలోమీటర్ల మేర నీటి నిల్వలు ఉండగా, నీరు లేనిచోట ఇదే అదునుగా భావించి ఇసుకను తీస్తూ అక్రమార్కులు యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు. పంట పొలాలకు హల్దీవాగు నుంచి వేసుకున్న తాత్కాళిక మార్గాల గుండా ఇసుక దందా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ధాన్యం రవాణా చేస్తున్నట్లుగా ట్రాక్టర్లలో ఇసుకను నింపి మీదనుంచి టార్పాలిన్‌ కవర్లు కప్పి గుట్టుగా ఇసుకను తరలిస్తున్నారు. 


ట్రాక్టర్‌ ఇసుక రూ.4 నుంచి రూ.5వేలకు

వెల్దుర్తి మండలంలో రామాయపల్లి నుంచి మెదక్‌ వరకు, కుకునూర్‌ నుంచి నర్సాపూర్‌, కౌడిపల్లిలకు రాత్రి వేళల్లో ఇసుకను రవాణా చేస్తున్నారు. ఈ ఇసుకకు డిమాండ్‌ భారీగా ఉండటంతో ట్రాక్టర్‌ ట్రిప్పునకు రూ.4 నుంచి రూ.5వేలకు అమ్ముతున్నారు. కొద్దినెలల క్రితం వెల్దుర్తి మండలంలో ఇసుక రవాణా విషయంలోనే ఓ ఎస్‌ఐని బదిలీ చేశారు. దీంతో ఇసుక రవాణాకు తెరపడినట్లు ప్రచారం జరుగుతున్నా రాత్రి వేళ్లలో గుట్టుగా తరలిస్తూనే ఉన్నారు. హైకోర్టు స్టేను ధిక్కరించి ఇసుక రవాణ చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు.

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST