Abn logo
Sep 24 2021 @ 00:15AM

ఎక్జైజ్‌.. ఎక్సర్‌సైజ్‌

కొన్ని సడలింపులతో మద్యం నూతన విధానం

భూపాలపల్లి, ములుగు జిల్లాల వ్యాపారులకు ఊరట

వైన్‌ షాపుల గడువు నవంబరు 30 వరకు పెంపు

బార్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ ఫీజులో నెల డిస్కౌంట్‌

ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్థులకు వైన్‌ షాపుల టెండర్లలో రిజర్వేషన్లు

రెండు జిల్లాల్లో 48 వైన్‌ షాపులు, మూడు బార్లు

మద్యం దుకాణాలతో ప్రభుత్వానికి రూ.825 కోట్లకుపైగా ఆదాయం

(ఆంధ్రజ్యోతి, భూపాలపల్లి)

కొత్త పాలసీపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేయడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మద్యం షాపుల నిర్వహణ కాలపరిమితి పెంచడంతోపాటు బార్ల రెన్యూవల్‌ ఫీజును ఒక నెల మాఫీ చేయాలని నిర్ణయించడంపై వ్యాపారులకు ఊరట కలిగిస్తోంది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గౌడ కులస్థులకు మద్యం షాపుల టెండర్లలో రిజర్వేషన్‌ అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేయడం, ఇప్పటికే ఉన్న మద్యం పాలసీకి సడలింపులు ఇస్తూ కొత్త పాలసీపై  కసరత్తు చేస్తుండటంతో ఔత్సహికుల్లో ఆసక్తి నెలకొంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 48 వైన్‌షాపులు, మూడు బార్లు ఉన్నాయి. వీటి ద్వారా ఇప్పటి వరకు సుమారు రూ.825 కోట్ల ఆదాయ ప్రభుత్వానికి చేకూరింది. 2021-23 సంవత్సరానికి మరింత ఆదాయం పెంచేందుకు ఎకై్ౖసజ్‌ శాఖ దృష్టి సారించింది.  

భూపాలపల్లి జిల్లాలో 26, ములుగు జిల్లాలో 22 మద్యం షాపులు ఉన్నాయి. భూపాలపల్లి పట్టణంలో మూడు బార్లు ఉన్నాయి. కరోనా కారణంగా సుమా రు 40 రోజుల పాటు మద్యం షాపులు, బార్లు మూతబడ్డాయి. దీంతో తాము ఆర్థికంగా నష్టపోయామని మద్యం షాపు యజమానులు చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. 2019-21 మద్యం టెండర్లు అక్టోబరు 31తో గడువు ముగిసిపోనుండగా  షాపుల యజమానుల విజ్ఞప్తితో మరో నెల రోజుల గడువు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వ్యులు జారీ చేసింది. దీంతో పాత షాపుల కాలపరిమితి నవంబరు 30 వరకు గడువు పెరిగింది.  

ఆదాయం రూ.825 కోట్లు

ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా భారీగా ఆదాయం లభిస్తోంది.  భూపాలపల్లి, ములుగు జిల్లాలకు సంబంధించి 2019-21 సంవత్సరానికి  టెండర్లు నిర్వహించారు. మద్యం షాపులను దక్కించుకునేందుకు 1,575 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కొక్క దరఖాస్తుకు రూ.2లక్షల డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. టెండర్‌ దక్కకుంటే ఈ మొత్తం డిపాజిట్‌ను ప్రభుత్వం తిరిగి చెల్లించదు. ఈ దరఖాస్తుల ద్వారానే రూ. 31.50 కోట్ల ఆదాయం ఎక్సైజ్‌ శాఖకు లభించింది. అలాగే రెండు జిల్లాలోని 48 షాపులకు టెండర్ల ద్వారా రూ.51.90 కోట్లు ఆదాయం సమకూరింది. ఇకమద్యం అమ్మకాలతో ఇప్పటి వరకు రూ.740 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. వీటితో పాటు జీఎస్టీ, సర్వీసు పన్నులతో కలిపి మొత్తంగా సుమారు రూ.825 కోట్లకు పైగా ఆదాయం ప్రభుత్వానికి చేకూరింది. నవంబరు 30 వరకు మద్యం షాపులకు గడు వు పెంచటంతో 2019-21 సంవత్సరంలో భూపాలపల్లి, ములుగు జిల్లాల నుంచి భారీగా మద్యం ఆదాయం ప్రభుత్వం ఖాతాలో జమ కానుంది. 

ఒక్కో బార్‌కు రూ. 3.50 లక్షల ఆదా 

బార్‌ షాపు నిర్వాహకులకు ప్రభుత్వం శుభవార్తే చెప్పింది. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో మూడు బార్‌ షాపులు ఉన్నాయి. వీటి రెన్యూవల్‌కు ప్రతి ఏటా రూ.42 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఈ మూడు షాపుల ద్వారా ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.1.26 కోట్ల ఆదాయం వస్తుంది. అయితే కరోనా నేపథ్యంలో బార్‌ షాపులు నెల రోజులకు పైగా మూసి వేయాల్సి వచ్చింది. దీంతో 2021-22  సంవత్సరానికి ప్రభుత్వం 11 నెలలకే బార్‌ లైసెన్స్‌ రెన్యూవల్‌ ఫీజు వసూలు చేయనుంది. దీంతో ఒక్కో బార్‌కు రూ.3.50 లక్షల చొప్పున మూడు బార్లకు రూ.10.50లక్షలు ఆదా కానుంది. కరోనాతో బార్‌ యజమానులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చివరకు షాపుల అద్దె కూడా చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని, ప్రభుత్వ నిర్ణయంతో కొంత ఊరట లభిస్తుందని పేర్కొంటున్నారు. 

 టెండర్లలో రిజర్వేషన్లు

కొత్త మద్యం పాలసీపై కసరత్తు చేస్తున్న నేపథ్యం లో  ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5 శాతం, గౌడ కులస్థులకు 15శాతం మద్యం టెండర్లలో రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయి తే ఈ రిజర్వేషన్లు జిల్లాల వారీగా చేయాలా..  జోన్ల వారీగానా.. లేక రాష్ర్టాన్ని యూనిట్‌గా తీసుకుని అమలు చేయాలా? అనే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాల వారీగా రిజర్వేషన్లు అమలు చేస్తేనే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే టెండర్‌ డిపాజిట్‌ ప్రస్తు తం రూ.2 లక్షలు ఉంది. రిజర్వేషన్లు అమలు చేస్తున్న షాపుల్లో ఈ డిపాజిట్‌ ఎంత ఉంటుందనేది చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ, ఎస్టీలతో పాటు గౌడ కులస్థులకు కేటాయించే షాపుల్లో డిపాజిట్‌ నామమాత్రంగా ఉంచాలనే డిమాండ్‌ వస్తోంది. తొలిసారి గా మద్యం షాపు టెండర్లలో రిజర్వేషన్లు అమలు చేస్తుండటంతో ప్రభు త్వ విధివిధానాలపై ఔత్సహికుల్లో ఆసిక్తి నెలకొంది. 

కొత్త పాలసీ.. కొత్త షాపులు

నూతన మద్యం పాలసీలో భాగంగా కొత్త  షాపులను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. దీంతో భూపాలపల్లి జిల్లా కేంద్రంలో గతంలో తొమ్మిది షాపులు ఉండగా, 2019-21లో రెండు షాపు లు తరలించి ఏడు షాపులకే టెండర్లు నిర్వహించా రు. పెరిగిన జనాభా దృష్ట్యా తిరిగి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తొమ్మిది షాపులను ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. అలాగే మహదేవపూ ర్‌ మండలంలోని మేడిగడ్డకు వెళ్లే మార్గంలో అంబట్‌పల్లి లేదా సూరారంలో మరో షాపునకు ఎక్సైజ్‌ శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వొచ్చని తెలిసింది. వీటితో పాటు ము లుగు జిల్లా కేంద్రంతో పాటు ఏటూరునాగారంలో ఒక్కోక్కటి చొప్పున మద్యం షాపుల సంఖ్య పెరగొచ్చని సమాచారం. అలాగే భూపాలపల్లి జిల్లా నుంచి ములుగు జిల్లా విడిపోవటంతో ములుగు ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న గణపురం మండలాన్ని భూపాలపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో విలీనం చేయనున్నారు. గణపురం మండల కేంద్రంలో రెండు వైన్‌షాపులు, చెల్పూరులో రెండు వైన్‌షాపులు ఉన్నాయి. మొత్తం నాలుగు వైన్‌షాపులను భూపాలపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌లో విలీనం కానున్నాయి. అలాగే చెల్పూరులో రెండు వైన్‌షాపులు ఉండగా, అందులో ఒక షాపును భూపాలపల్లి జిల్లా కేంద్రానికి తరలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది.