ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ కబ్జా

ABN , First Publish Date - 2022-06-29T09:50:14+05:30 IST

మామూలు స్థలాన్ని కబ్జా చేస్తే మజా ఏముంది అనుకున్నాడో ఏమో.. ఓ అక్రమార్కుడు ఏకంగా ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ను కబ్జా చేశాడు.

ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ కబ్జా

మధిర నడిబొడ్డున ఉన్న రూ.4 కోట్ల స్థలానికి ఎసరు

సబ్‌ రిజిస్ట్రార్‌కు లంచం ఇచ్చి అక్రమార్కుడి రిజిస్ట్రేషన్‌ 

స్థలం ఇచ్చేయాలని సీఎం, సీఎస్‌, కలెక్టర్‌కు నోటీసులు

ప్రభుత్వానికి వదిలేయాలంటే రూ.10 లక్షలు డిమాండ్‌


మధిరటౌన్‌, జూన్‌ 28 : మామూలు స్థలాన్ని కబ్జా చేస్తే మజా ఏముంది అనుకున్నాడో ఏమో.. ఓ అక్రమార్కుడు ఏకంగా ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ను కబ్జా చేశాడు. సబ్‌ రిజిస్ట్రార్‌కు లంచం ఇచ్చి దర్జాగా భూమిని తన పేర రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. ఆపై స్థలాన్ని అప్పగించాలని సీఎం కేసీఆర్‌, సీఎస్‌, కలెక్టర్‌, తహసీల్దార్‌.. తదితరులకు లీగల్‌ నోటీసులు పంపాడు. మధిర నడిబొడ్డున ఉన్న ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌ స్వాహా పర్వమిది. ఆ స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న స్థలం విలువ అక్షరాలా రూ.4 కోట్లు. ఖమ్మం జిల్లా మధిరలో నిజాం ప్రభుత్వం నిర్మించిన ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్‌కు చెందిన 278 గజాల స్థలం ఉంది. పాత భవనం శిథిలం కావడంతో ప్రభుత్వం రూ.40 లక్షలతో అక్కడే నూతన భవనాన్ని నిర్మిస్తోంది. అయితే, ఆ స్థలాన్ని పట్టణానికి చెందిన పూసపాటి ఉమామహేశ్వరరావు ఏడాది క్రితం నాటి ఇన్‌చార్జ్‌ సబ్‌ రిజిస్ట్రార్‌కు రూ.50 వేలు లంచం ఇచ్చి, తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. గత నెల 11న ఆ భూమిని తన భార్యకు గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ చేశాడు. 


ఆ పత్రాలతో సదరు స్థలాన్ని క్రమబద్ధీకరించాలని తహసీల్దార్‌కు దరఖాస్తు చేశాడు. ఆ తర్వాత ఎక్సైజ్‌ శాఖ ఆధీనంలో ఉన్న తన స్థలాన్ని అప్పగించాలంటూ ఈ నెల 7న సీఎం కేసీఆర్‌, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, సీఎంవో ఓఎస్డీ స్మితా సబర్వాల్‌, ఖమ్మం కలెక్టర్‌, మధిర ఎక్సైజ్‌ సీఐ, తహసీల్దార్‌తో పాటు ఇతర అధికారులకు లీగల్‌ నోటీసులు పంపాడు. ఎక్సైజ్‌ సీఐ, తహసీల్దార్‌.. మధిర సబ్‌ రిజిస్ట్రార్‌ను సంప్రదించగా ఇది తన హయంలో జరగలేదని రికార్డులను పరిశీలిస్తానని ఆయన తెలిపారు. విషయం వెలుగులోకి వచ్చి 20 రోజులు కావస్తుండగా.. అధికారులు గుట్టు చప్పుడు కాకుండా దీనిని పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నారు. అప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌, ఇప్పటి సబ్‌ రిజిస్ట్రార్‌లు.. ఉమామహేశ్వరరావును పిలిచి డాక్యుమెంట్‌ రద్దు చేసుకోవాలని కోరగా.. రూ.10 లక్షలు కోరాడు. దీనిపై మధిర ఎక్సైజ్‌ సీఐని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. లీగల్‌ నోటీసులు అందుకునే వరకు విషయం తెలియలేదని, ఆ వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పారు. 

Updated Date - 2022-06-29T09:50:14+05:30 IST