ఎక్సైజ్‌ అధికారులమంటూ తనిఖీలు..!

ABN , First Publish Date - 2021-07-24T05:54:56+05:30 IST

ఎక్సైజ్‌ అధికారులమంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లలో సోదాలు చేశారు.

ఎక్సైజ్‌ అధికారులమంటూ తనిఖీలు..!

భోగాపురం, జూలై 23: ఎక్సైజ్‌ అధికారులమంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఇళ్లలో సోదాలు చేశారు. అయితే ఓ ఇంటిలో, మరో షాపులో 7 మద్యం సీసాలు లభ్యం కావడంతో ఇద్దరి వద్ద నుంచి మొత్తం రూ.9వేలు తీసుకొని పరార య్యారు. ఈ సంఘటన తూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. దీనిపై సదరు బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. తూడెం గ్రామానికి చెందిన చిలుకోటి త్రినాద్‌ ఇంటికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు రెండు బైకులపై వెళ్లి తాము ఎక్సైజ్‌ డిపార్టుమెంట్‌ అని, ఇక్కడ మద్యం ఉన్నట్టు సమాచారం ఉందని, ఇంట్లో తనిఖీలు నిర్వహించారు. ఇంట్లో 4 మద్యం సీసాలు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేస్తామని, లేదంటే నగదు ఇవ్వాలని బెదిరించడంతో బాధితుడు రూ.4వేలు ఇచ్చాడు. అనంతరం అదే వ్యక్తులు సమీపంలో ఉన్న పాన్‌షాపునకు వెళ్లి తనిఖీలు నిర్వహించి, 3 మద్యం సీసాలు స్వాధీనం చేసుకొన్నారు. అతని నుంచి రూ.5వేలు తీసుకొన్నారు. వీరిపై అనుమా నం వచ్చిన స్థానికులు వారి వెనుక వెళ్లగా వీరు ముగ్గురు తూడెం గ్రామ సమీపం లో ఆ నగదును పంచుకోవడాన్ని గమనించారు. వెంటనే వారిని పట్టుకొని వారి గుర్తింపుకార్డులు చూపాలని అడగ్గా, బైకు సీబుక్‌ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై బాధితుడు త్రినాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ యు.మహేష్‌ తెలిపారు.

Updated Date - 2021-07-24T05:54:56+05:30 IST