రైతును చితకబాదిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌

ABN , First Publish Date - 2021-07-28T06:06:27+05:30 IST

హొళగుంద మండలం నెరణికి తండాకు చెందిన రైతు ధనుంజయ్‌ నాయక్‌ను సారా విక్రయిస్తున్నాడనే అనుమానంతో ఆలూరు సెబ్‌ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ నాగరాజు సోమవారం రాత్రి చితకబాదాడు.

రైతును చితకబాదిన ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌
ఫిర్యాదు చేసేందుకు వచ్చిన రైతు ధనుంజయ్‌నాయక్‌

ఆలూరు, జూలై 27: హొళగుంద మండలం నెరణికి తండాకు చెందిన రైతు ధనుంజయ్‌ నాయక్‌ను సారా విక్రయిస్తున్నాడనే అనుమానంతో ఆలూరు సెబ్‌ స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్‌ నాగరాజు సోమవారం రాత్రి చితకబాదాడు. దీంతో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడు ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నాడు. ఈ ఘటనపై గ్రామస్థులు, బంధువులు ఆలూరు సీఐ ఈశ్వరయ్యకు మంగళవారం ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన సెబ్‌ సీఐ సునందను స్టేషన్‌కు పిలిపించి పంచాయితీ నిర్వహించారు. సారా విక్రయిస్తున్నవారిని పట్టుకోవాలని, ఎవరి మాటలో విని రైతును ఎలా కొడతారని తండా ప్రజలు నిలదీశారు. కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేయాలని పట్టుబట్టారు. పొరపాటు జరిగిందని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని సీఐ సునంద వారిని కోరారు. కానీ బాధితుడి బంధువులు ఇందుకు అంగీకరించలేదు. అధికారుల సూచనల మేరకు బాధితులు లిఖితపూర్వక ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయారు. సెబ్‌ సిబ్బంది ఇటీవల అనవసరంగా వేధిస్తున్నారని, సారా విక్రయిస్తున్నారని, మద్యం నిల్వలు ఉన్నాయని దాడి చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 


కానిస్టేబుల్‌ను హెచ్చరించాం


నెరణికి తండాలో ధనుంజయ్‌ అనే వ్యక్తిని మా సిబ్బంది కొట్టడం పొరపాటే. ఇలాంటివి పునరావృతం కాకుండా చూస్తాం. కొట్టడం తప్పు అని బాధితుడికి, వారి తరపు పెద్దలకు నచ్చజెప్పాం. ఇలాంటివి పునరావృతం అయితే చెక్‌పోస్టుకు బదిలీ చేస్తామని కానిస్టేబుల్‌ను హెచ్చరించాం.

- సునంద, సెబ్‌ సీఐ, ఆలూరు

Updated Date - 2021-07-28T06:06:27+05:30 IST