మీ అనుకూలవాదిని తీసుకుని.. మా వాళ్లని అప్పగించండి

ABN , First Publish Date - 2022-04-13T22:49:28+05:30 IST

ఉక్రెయిన్‌లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్న క్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ విపక్ష కూటమి నాయకుడు, 2019లో ఉక్రెయిన్ పీపుల్స్ డిప్యూటీగా ఎన్నికైన రాజకీయవేత్త, న్యాయవాది, వ్యాపారవేత్త విక్టర్ మెద్వెద్‌చక్‌ను ఉక్రెయిన్ నిర్భంధంలోకి తీసుకుంది.

మీ అనుకూలవాదిని తీసుకుని.. మా వాళ్లని అప్పగించండి

కీవ్ : ఉక్రెయిన్‌లో రష్యా బలగాల భీకర దాడులు కొనసాగుతున్న క్రమంలో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఉక్రెయిన్ విపక్ష కూటమి నాయకుడు, 2019లో ఉక్రెయిన్ పీపుల్స్ డిప్యూటీగా ఎన్నికైన రాజకీయవేత్త, న్యాయవాది, వ్యాపారవేత్త విక్టర్ మెద్వెద్‌చక్‌ను ఉక్రెయిన్ నిర్భంధంలోకి తీసుకుంది. రష్యా అనుకూల వైఖరి ప్రదర్శించే  విక్టర్ మెద్వెద్‌చక్‌ను రష్యాకు అప్పగిస్తామని అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆఫర్ ఇచ్చారు. ఇందుకు ప్రతిగా రష్యా నిర్భంధంలో ఉన్న ఉక్రెయిన్‌కు చెందిన మగ, ఆడవాళ్లను అప్పగించాలని విన్నవించారు. ఈ మేరకు తాను ప్రతిపాదన చేస్తున్నట్టు బుధవారం ఉదయం ఒక ప్రకటన విడుదల చేశారు. మెద్వెద్‌చక్‌పై రాజద్రోహం కేసు తెరిచాక హౌస్ అరెస్ట్ నుంచి ఫిబ్రవరిలో  తప్పించుకుని పారిపోయాడని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. ప్రత్యేక ఆపరేషన్ ద్వారా పట్టుకున్నామన వివరించారు. 


ఉక్రెయిన్ విడుదల చేసిన ఫొటోలో మెద్వెద్‌చక్‌ చేతికి బేడీలు వేసివున్నాయి. మెద్వెద్‌చక్‌ను అరెస్ట్ చేసేందుకు మెరుపువేగంతో  ప్రమాదకరమైన బహుళ స్థాయిలో ప్రత్యేక ఆరేషన్ చేపట్టాల్సి వచ్చిందని ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ హెడ్ ఇవాన్ బకనోవ్ ఫేస్‌బుక్ వేదికగా వెల్లడించారు. రష్యాకు అనుకూలంగా వ్యవహరించే మెద్వెద్‌చక్‌ స్పందిస్తూ.. తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని అన్నాడు. తన కూతురికి అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తండ్రిలాంటి వారని వ్యాఖ్యానించాడు. ఈ వ్యవహారంపై రష్యా అధ్యక్ష భవనానికి చెందిన ఓ ప్రతినిధి స్పందిస్తూ.. ఈ ఫొటో నిజమైనదో కాదో అని సందేహం వ్యక్తం చేశారు. ఫొటోను నమ్మలేమన్నారు.  

Updated Date - 2022-04-13T22:49:28+05:30 IST