లోతుగా ఆరా!

ABN , First Publish Date - 2020-02-20T10:31:46+05:30 IST

విజయనగరం కార్పొరేషన్‌ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న పనులపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీశారు. పలు అక్రమాలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.

లోతుగా ఆరా!

ఏసీబీ తనిఖీల్లో బహిర్గతమైన అక్రమాలు

అనుమతులు లేని ఫంక్షన్‌హాల్స్‌, భవనాల గుర్తింపు

రెండోరోజూ కొనసాగిన సోదాలు

హడలెత్తిన ప్రణాళిక విభాగం సిబ్బంది


విజయనగరం క్రైం, ఫిబ్రవరి19: విజయనగరం కార్పొరేషన్‌ ప్రణాళిక విభాగంలో జరుగుతున్న పనులపై ఏసీబీ అధికారులు లోతుగా ఆరా తీశారు. పలు అక్రమాలు జరుగుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని కార్పొరేషన్లలో ప్లానింగ్‌ విభాగంలో మంగళవారం నుంచి ఏసీబీ సోదాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు అర్ధరాత్రి వరకూ రికార్డులు పరిశీలించిన అధికారులు బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లారు. అక్కడ అనేక లోపాలు గుర్తించారు. సర్వేయర్లను తోడ్కొని వెళ్లి కొన్ని భవనాలకు కొలతలు తీయించారు. అనుమతికి మించి విస్తీర్ణంలో కట్టడాలు ఉన్నట్లు గుర్తించి ప్లానింగ్‌ అధికారులను ప్రశ్నించారు. దేవదాయ, రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారుల సమన్వయంతో ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు.


ఉదయం తొలుత నగరంలోని రింగురోడ్డు ప్రాంతంలో ఉన్న లియోపారడైజ్‌ ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం వరకూ అక్కడే తనిఖీలు చేశారు. అన్ని గదులను కలియతిరుగుతూ సర్వేయర్లతో కొలతలు తీయించారు. రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఫంక్షన్‌హాల్‌కు కనీస అనుమతులు లేవని తేల్చారు. 2016లో నిర్మాణం జరిగితే పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు ఎందుకు  ఇప్పటివరకూ  ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదో ఆరా తీశారు.  నగరంలోని మరికొన్ని భవనాలు కనీస అనుమతులు లేకుండా నిర్మించినట్లు తమ దృష్టికి వచ్చిందని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. అలాగే శంకరమఠం రోడ్డులో ఒక భవనానికి జీప్లస్‌ 2 అనుమతులు తీసుకుని జీప్లస్‌3తో పాటు కింద సెల్లార్‌లో కూడా గదులు నిర్మించినట్లు గుర్తించారు.


ఇదిలా ఉండగా గతేడాది ప్రభుత్వం ప్రకటించిన బీపీఎస్‌ (అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణ) పథకం కోసం విజయనగరం కార్పొరేషన్‌లో 1160 దరఖాస్తులు రాగా కేవలం 960కి మాత్రమే అనుమతులు ఇచ్చారు. మిగతా వాటిని తిరస్కరించారు. అయితే ఆయా వ్యక్తులతో టౌన్‌ప్లానింగ్‌లో ఉన్న కొంతమంది సిబ్బంది మాట్లాడి మామూలు తీసుకున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి. వీటి ఆధారంగానే ఏసీబీ సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు టౌన్‌ప్లానింగ్‌లో కిందస్థాయి నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగి వరకూ కొందరిపై ఆరోపణలు ఉన్నాయి.


ఆయా వ్యక్తులను ఏసీబీ సిబ్బంది గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. అవినీతికి తావివ్వకుండా ఉద్యోగులు విధులు నిర్వహించాలని ప్రతీ సమావేశంలో ప్రభుత్వ పెద్దలు చెబుతున్నా మార్పు రావడం లేదన్న కారణంతో ఏసీబీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఏసీబీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్లు సతీష్‌, మహేష్‌ తెలిపారు.

Updated Date - 2020-02-20T10:31:46+05:30 IST