అంగన్‌వాడీ.. తప్పిన గాడి!

ABN , First Publish Date - 2020-02-20T10:05:07+05:30 IST

అంగన్‌వాడీ వ్యవస్థ గాడి తప్పుతోంది. సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రధానంగా ఐసీడీఎస్‌ను సూపర్‌వైజర్ల కొరత

అంగన్‌వాడీ.. తప్పిన గాడి!

వేధిస్తున్న సూపర్‌ వైజర్ల కొరత

జిల్లాలో 75 పోస్టులు ఖాళీ

ఉన్న సిబ్బందిపై అదనపు భారం

కేంద్రాల్లో కొరవడుతున్న పర్యవేక్షణ

సక్రమంగా అమలుకాని నిర్వహణ


(ఇచ్ఛాపురం రూరల్‌/రామలక్ష్మణ జంక్షన్‌) 

అంగన్‌వాడీ వ్యవస్థ గాడి తప్పుతోంది. సిబ్బంది కొరత కారణంగా పర్యవేక్షణ కొరవడుతోంది. ప్రధానంగా ఐసీడీఎస్‌ను సూపర్‌వైజర్ల కొరత వేధిస్తోంది. జిల్లాలో మొత్తంగా 75 సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉండడంతో ఆశించిన స్థాయిలో కార్యక్రమాలు అమలుకావడం లేదు. ఉన్న సిబ్బందిపై అదనపు భారం తప్పడం లేదు. 


జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా మారాయి. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణలో కీలకపాత్ర పోషించాల్సిన సూపర్‌వైజర్ల పోస్టులు కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలలో చాలా కేంద్రాలు సక్రమంగా పనిచేయడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో 18 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో మినీ కేంద్రాలు 789, ప్రధాన కేంద్రాలు 3403 మొత్తంగా 4,192 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 63,379 మంది పిల్లలు, 3 నుంచి 6ఏళ్ల లోపు పిల్లలు 62161 మంది, మొత్తం 1,65004 మంది చదువుతున్నారు.


గర్భిణులు 16,112 మంది, బాలింతలు 19,649 మంది మొత్తం 35,760 మంది లబ్ధి పొందుతున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రతిరోజూ సూపర్‌వైజర్లు తనిఖీ చేసి.. వాటి నిర్వహణ చక్కబెట్టాలి. కానీ, సూపర్‌వైజర్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో అంగన్వాడీ కేంద్రాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షించలేకపోతున్నారు. జిల్లాలో గ్రేడ్‌-1 సూపర్‌వైజర్లు 91 మంజూరు కాగా, 31 మంది మాత్రమే పని చేస్తున్నారు. 60 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గ్రేడ్‌ -2, కాంట్రాక్ట్‌ బేసిక్‌పై 72 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 57 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తంగా 75 సూపర్‌వైజర్‌ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. 


అరకొర ‘శుభ్రత’

అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ‘చేతుల శుభ్రత’ కార్యక్రమాన్ని నిర్వహించాలని  ఐసీడీఎస్‌ ఉన్నతాధికారులు గతంలో చాలాసార్లు కింది స్థాయి సిబ్బందికి ఆదేశించారు. కానీ చాలా కేంద్రాల్లో ఈ ప్రక్రియ అమలుకావడం లేదు. చేతులు శుభ్రంగా లేకపోతే చాలా అనర్థాలు కలుగుతాయి. ముఖ్యంగా డయేరియా, స్వైన్‌ ఫ్లూ, నులి పురుగులు, రక్తహీనత, జలుబు, దగ్గు, క్షయ తదితర వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ భోజనాలకు ముందు కాళ్లు, చేతులు సబ్బుతో కడుగుకుంటే మేలు జరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. కానీ, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ప్రక్రియ అమలుకావడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


పర్యవేక్షణ కరువు

ఇటీవల ప్రభుత్వం ప్రతి సూపర్‌వైజరు నెలకు 30 అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని ఆదేశించింది. సీడీపీవో కూడా 30 కేంద్రాలు చొప్పున తనిఖీ చేయాలి. కానీ, సూపర్‌వైజర్ల కొరతతో ప్రభుత్వం నిర్థేశించిన కేంద్రాలను తనిఖీ చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ప్రభుత్వం ట్రాకింగ్‌ కార్యక్రమాన్ని కూడా ఐసీడీఎస్‌కు అప్పగించింది. ఇందులో భాగంగా అంగన్‌వాడీ కార్యకర్తలు గ్రామస్థాయిలో గర్భవతులు, బాలింతలు, పిల్లల వివరాలను నమోదు చేయాల్సి ఉంది. అలాగే ఎంత మంది పిల్లలు ఉన్నారు.


వారి బరువు, ఎత్తు వివరాలు కూడా నమోదు చేయాలి. ఎంత మందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. తదితర వివరాలను సూపర్‌వైజర్లు సేకరించాల్సి ఉంటుంది. 2-6 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి నమోదు చేయాలి. ఇవన్నీ సక్రమంగా అమలు కావాలంటే సిబ్బంది పూర్తిస్థాయిలో ఉంటేనే సాధ్యమవుతుంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సూపర్‌వైజర్ల పోస్టులు భర్తీ చేసి.. అంగన్‌వాడీలను పటిష్టం చేయాల్సిన అవసరం ఉంది.


ప్రభుత్వానికి నివేదించాం : 

జిల్లాలో ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో సిబ్బంది కొరత వాస్తవమే. ముఖ్యంగా సూపర్‌వైజర్లు చాలా తక్కువగా ఉన్నారు. దీంతో కార్యక్రమాల అమలులో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సూపర్‌వైజర్లతో పూర్తి స్థాయిలో సేవలందిస్తున్నాం. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదించాం. అలాగే అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు క్రమం తప్పకుండా సబ్బుతో చేతులు కడుక్కునేలా చూడాలని సిబ్బందికి ఆదేశాలిచ్చాం. 

- జి.జయదేవి, ప్రాజెక్టు డైరెక్టర్‌, శ్రీకాకుళం.


కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.. : 

పిల్లలకు చేతుల శుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం. సిబ్బంది కూడా వారంలో ప్రతి బుధ, శనివారాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బుధవారం వీహెచ్‌ఎస్‌ఎన్‌డీ (విలేజ్‌ హెల్త్‌, శానిటేషన్‌ అండ్‌ న్యూట్రిషన్‌ డే)ను నిర్వహిస్తున్నారు. ఆ రోజు పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యంగా చేతుల శుభ్రతపై ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ప్రతి శనివారం సీబీఈ (కమ్యూనిటీ బేస్‌డ్‌ ఈవెంట్స్‌ డే)ను నిర్వహిస్తున్నాం. ఆ రోజు పిల్లల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలకు కూడా పలు సూచనలు చేస్తున్నాం.

- జి.శోభారాణి, సీడీపీఓ, శ్రీకాకుళం.

Updated Date - 2020-02-20T10:05:07+05:30 IST