తప్పంతా పాఠకుడి పైకి నెట్టేద్దామా!

ABN , First Publish Date - 2021-11-22T08:06:43+05:30 IST

ప్రస్తుతం పుస్తక ప్రచురణపై జరిగే చర్చలన్నీ తగ్గుతున్న పాఠకుల ఆదరణ చూట్టూనే నడుస్తున్నాయి. ఈ విషయంగా సాహిత్యంలో స్టేక్‌హోల్డర్స్‌ చాలామంది తెలిసీ తెలియక అపోహలకు గురవుతున్నారు. వాటిని ఛేదించటానికి ఈ వ్యాసం...

తప్పంతా పాఠకుడి పైకి నెట్టేద్దామా!

ప్రస్తుతం పుస్తక ప్రచురణపై జరిగే చర్చలన్నీ తగ్గుతున్న పాఠకుల ఆదరణ చూట్టూనే నడుస్తున్నాయి. ఈ విషయంగా సాహిత్యంలో స్టేక్‌హోల్డర్స్‌ చాలామంది తెలిసీ తెలియక అపోహలకు గురవుతున్నారు. వాటిని ఛేదించటానికి ఈ వ్యాసం పని కొస్తుందనుకుంటున్నాను.  


పూర్వం తెలుగులో పత్రికల వరకు చందా, సభ్యత్వాలు, దాతల విరాళాలు మీదే ఆదారపడి నడిచేవి. తరువాతి రోజులలో ప్రకటనలు ఆర్థిక వనరుగా మారాయి. ఈనాటికీ అదే పరిస్థితి. పుస్తకం ఏ ప్రక్రియకు చెందినది అన్నదాన్ని బట్టి, అలాగే పత్రికల్లో విషయాన్ని  బట్టి వాటి ప్రచారం, అమ్మకాలు సాగేవి. ఇటీవలి కాలంలో (నాలుగైదు దశాబ్దాల క్రితం వరకు) ఉత్తమ సాహిత్యం కోసం ఆంధ్ర పత్రికవారి ‘భారతి’ మాస పత్రికను పాఠకులు ఆదరించారు. ప్రతులు, చందా దారుల సంఖ్య తక్కువే అయినా అందులో విషయం ఉత్తమ ప్రమా ణాలతో కూడినదని పాఠకులు భావించారు. ప్రస్తుతం వెలువడుతున్న ‘మిసిమి’ మాస పత్రిక కొంతమేరకు ‘భారతి’లేని లోపాన్ని పూరిస్తు న్నది. పాఠకుల నాడి పట్టుకున్న ‘స్వాతి’ వారపత్రిక ఒకానొక సంద ర్భంలో ప్రతి వారం లక్షల్లో అమ్ముడుపోయింది. అలాగే మాస పత్రికల్లో ‘యువ’, ‘జ్యోతి’, ‘విపుల’, ‘చతుర’ వంటివాటికి లక్షల్లో కాకపోయినా వేలల్లో ఆదరణ ఉండేది. కాలక్రమేణా పాఠ కుల అభిరుచుల్లో మార్పులు, పత్రికల యాజమాన్యాల వాణిజ్య, వ్యాపార ధోరణుల మూలంగా ఒక్క ‘స్వాతి’ పత్రిక తప్ప దాదాపు అన్నీ మూత పడినవి. వీటన్నిం టిలో క్రమం తప్పకుండా ‘సీరియల్‌’ నవలలు వచ్చేవి. పాఠకుల ఆదరణని బట్టి అవి విడిగా పుస్తకాలుగా వచ్చేవి. 


కరోనాకు పూర్వం తెలుగు పుస్తక ప్రచురణ రంగం ఒక ఆర్థిక సంవత్సరంలో సుమారు 10-15 కోట్ల రూపాయల వ్యాపారం చేసేదని అంచనా. అందులో పాఠ్య పుస్తకాలు, వ్యక్తిత్వ వికాసం, పురాణాలు, నిఘంటువులు తదితర పుస్తకాలే సింహభాగం ఆక్రమించుకున్నాయి. ఇక సాధారణ ప్రచురణలు (జెనరల్‌ పబ్లికేషన్స్‌) నవలలు, కథలు, కవితలు, నాటకాలు, యాత్ర చరిత్రలు, పూజా గ్రంథాలు, వైదిక గ్రంథాలు, వంటలు-వార్పులు, బాలసాహిత్యం తదితర వర్గాలు అన్నీ కలిపి సుమారు 3 కోట్ల రూపాయల వ్యాపారం చేసేది. ఈ పుస్తకాల ధరలు పది రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉన్నాయి. 


మొదట్లో పత్రికలలో పాఠకుల ఆదరణ పొందిన సీరియల్స్‌ని, కథ లను, కవిత్వాన్ని ప్రచురించడానికి ప్రచురణకర్తలు ముందుకు వచ్చే వారు. ఖర్చులు భరించి పుస్తకం ప్రచురించినందుకు రచయితకు ఎంతో కొంత పారితోషికం అందించేవారు. పూర్వం అది కప్పు కాఫీ కావచ్చు, ఒక సిగరెట్టు పేకెట్‌ కావచ్చు, ఒక బ్రాందీ బుడ్డి కావచ్చు లేదా రొక్కంగా రూపాయో, పదో కూడా కావచ్చు. కానీ హక్కులు మాత్రం పూర్తిగా ప్రచురణకర్తకే ఉండేవి. అదొక పద్ధతి. 


తర్వాతి రోజుల్లో ప్రచురణకర్తలు పుస్తకం రాకముందే రచయితలతో ఒక ఒప్పందానికి వచ్చి అమ్మకాల్లో వచ్చిన లాభంలో కొంత శాతాన్ని రాయల్టీగా ఇచ్చేవారు. ఒక రచన కోసమైతే పోటీ ఎంత దూరం వెళ్ళిదంటే ప్రచురణ కర్త ఆ రచయితకి ‘బ్లాంక్‌ చెక్‌’ ఇచ్చేంత! 


ఆ తర్వాత- అంటే లెండింగ్‌ లైబ్రరీలు, టీవీలు, వీడియోలు, వీడియో పార్లర్లు వచ్చేనాటికి- పుస్తకాల ప్రాభవం తగ్గిపోయింది. ప్రచురణ కర్తలు తగ్గిపొయ్యారు. ఉన్న ఒకటి రెండు పెద్ద ప్రచురణ సంస్థలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పుస్తకాల పంపిణీలోకి దిగాయి. కొంత నిర్వహణ లోపాలవల్ల, ఆర్థిక అనిర్వాకం వల్ల, తెలుగు రాష్ట్రాలలోని రాజకీయ వాతావరణంవల్ల, అంతేగాక మారుతున్న పాఠకుడి అభిరు చులని గుర్తించి తదనుగుణంగా మారకపోవటంవల్ల ప్రచురణకర్తలు చతికిలపడ్డారు. పంపిణీదారులుగా ఉన్నా ఆర్థిక క్రమశిక్షణ లేకపో వడంతో అమ్మకాలకోసం తీసుకున్న పుస్తకాల ధరల మీద 40 శాతం నుంచి పెంచుకుంటూ 60-70 శాతం వరకు తగ్గింపు (డిస్కౌంట్‌) కోరుకోవడం మొదలయ్యింది. అంటే పుస్తకం ధర వంద రూపాయ లైతే దానిని అమ్మి పెట్టినందుకు ఏకంగా ప్రతి వందకి నలభై నుంచి అరవై రూపాయలు కోరుకుంటున్నారు. ఇందులో గమనించాల్సింది ఏమిటంటే ఈ మిగిలిన సొమ్ము కూడా సకాలంలో అందడం లేదని చాలామంది రచయితలు ఈ వ్యాసకర్తతో చెప్పుకున్నారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది మరొకటి ఉంది. ఒక పుస్తకాన్ని ఎన్నుకుని, దానికి తగిన ముస్తాబు చేసి, అచ్చు వేయడానికి కావలసిన ఖర్చుని ఆయా ప్రచురణ సంస్థలు భరించాలి. కానీ ఇక్కడ రచయిత తన ఖర్చుతో వేసుకున్న పుస్తకానికి ఆయా సంస్థలు పంపిణీ/ అమ్మకం మాత్రమే కోరుకుంటున్నాయి. అలాగని అవి ప్రచురణ మానుకోలేదు. దశాబ్దాలుగా ఉన్నవి కాబట్టి తమ దగ్గిర ఉన్న రాయల్టీల ప్రసక్తి లేని, కాలం చెల్లిన కాపీరైటు హక్కులు లేని పుస్తకాలు వేసుకుంటున్నాయి.


పి. వి. నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన సరళీకృత ఆర్థిక విధానాల మూలంగా ‘సర్వీసెస్‌’ రంగంలో విప్లవాత్మక మైన మార్పులు వచ్చాయి. యువతకి (‘మిలీనీయల్స్‌’) ప్రధానంగా ఉద్యోగావకాశాలు మెరుగయ్యాయి. ఆదాయం పెరిగింది. దాదాపుగా ఇదే సమయంలో వీరి తల్లితండ్రులతరం ఉద్యోగానంతర జీవితంలోకి వెళ్లింది. అందరి విషయంలోనూ కాదు కానీ చాలా మట్టుకు ఇదే జరి గింది. ఇది రెండు విధాలుగా రచయిత మీద ప్రభావం చూపించింది. 


ఒకటి: ఇంతకు ముందు చెప్పినట్టు అచ్చు పత్రికలు మూతపడిన నేపథ్యంలో కాస్త సాహిత్యం ఆసక్తి ఉన్నవారు ఇంటర్నెట్‌ అందు బాటులోకి వచ్చేటప్పటికి సాంఘిక మాధ్యమాలలో (ప్రధానంగా బ్లాగులు, ఫేస్‌బుక్‌), ఇంకా వెబ్‌ మేగజైన్స్‌ వంటి వాటిల్లో తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం మొదలుపెట్టారు. తమ రాత కోతలకి వాటినే ప్రధానంగా ఎన్నుకున్నారు. అచ్చు పత్రికలో యాజమాన్యాలకు గాని, సంపాదక వర్గాలకుగాని ఉండే పరిమితులు ఈ వెబ్‌ మేగజైన్స్‌కి లేకపోవడంతో రచయితల పంట పండింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఈ పత్రికల్లో చాలావరకు లాభాపేక్షతో నడుస్తున్నవి కాదు. ఈ వెబ్‌ మేగజైన్లలో రచనకి కావాల్సిన నిడివిపై ఎటువంటి నిబంధనలు ఉండవు. దాదాపుగా అచ్చులో వచ్చే వార పత్రికలన్నీ కూడా కథలకు మూడు నాలుగు పుటలకంటే, సీరియల్స్‌కి ఐదారు పుటలకంటే ఎక్కువ కేటాయించలేని నేపథ్యంలో వెబ్‌ మేగజైన్స్‌కి మాత్రం ఈ సమస్య లేదు.


రెండు: ఆర్థిక వెసులుబాటు పెరగడం వల్ల ‘స్వీయ ప్రచురణ’ (సెల్ఫ్‌-పబ్లిషింగ్‌) పెరిగింది. సాంకేతిక పరిజ్ఞానం పెరగడంతో పుస్తకాలు అచ్చు వేసుకోవడం అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఎవరికి తోచిన పద్ధతిలో వారు ‘అందంగా, ఆకర్షణీయం’గా ఖర్చుకు వెరవకుండా పుస్తకాలు వేసుకోవడం మొదలయ్యింది. 


మూడు: సాంఘిక మాధ్యమాలలో తాము రాసుకున్న రచనలకి వస్తున్న లైకులు, లవ్వులు, వ్యాఖ్యలను చూసి మురుసుకుంటూ అదే గొప్పదని భ్రమపడి రచనలు వెలువరిస్తున్నవారు ఎక్కువయ్యారు. ఒకవేళ డొక్కశుద్ధి ఉన్నవారు ఎవరైనా సలహాలిచ్చినా ఆలోచించడం గాని, స్వీకరించడంగాని మానేసి వారి మీదే ప్రతిదాడి చేయడం సర్వ సాధారణమైపోయింది. అధిక శాతం ఇక్కడ ఆ ‘రచయిత’కిగాని ఆ రచనని పొగుడుతున్నవారికిగాని తెలుగు భాష మీద, వ్యాకరణం మీద పెద్ద పట్టు ఉండదు. తెలుగు సాహిత్యం గురించి తెలిసింది కూడా నామ మాత్రమే. మరొక విషయం ఏమిటంటే ఈ ‘రచయిత’ తన ‘రచనలు’ మాత్రమే చదువుకుంటాడు. ఇతరులవి చదవడు. ఒకవేళ చదివినా ‘‘నేను నీ రచనకి లైక్‌ కొడతాను, నువ్వు నా రచనకి లైక్‌ కొట్టాలి’’ అనే అప్రకటిత నిబంధానికి లోబడే స్పందన ఉంటుంది. ప్రామిస్‌ ఉన్న రచయితలు కూడా ఈ సుడిగుండంలో చిక్కుకుని తమకు తాము ద్రోహం చేసుకోవడమే కాదు, తెలుగు సాహిత్యానికి, తెలుగు పాఠకుడికి కూడా ద్రోహం చేసినవారవుతున్నారు. 


అచ్చు పత్రికల్లో వచ్చే రచనలు సంపాదకుల అభిరుచిని బట్టి వచ్చినా, అవి కొంత వడపోత తర్వాతే వెలువడుతాయి. అందుచేత పాఠకుడికి మెరుగైన రచన అందే అవకాశం పెరుగుతుంది. స్వీయ ప్రచురణలో ఆ అవకాశం లేదు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, దగ్గరివారి సలహాలు సంప్ర దింపులే ఈ రచయితకి శిరోధార్యం అవుతున్నాయి. దానివల్ల మేలు కన్నా కీడు జరగడమే ఎక్కువ. 


అదే మనం ప్రస్తుతం చూస్తున్నాము. అత్య ధిక శాతం ఈ సెల్ఫ్‌పబ్లిష్డ్‌ పుస్తకాలలో డబ్బు కనబడుతుంది. ముఖపత్రాలు ఆకర్షణీయంగా, రచయిత అభిరుచి మేరకు ఉంటాయి. ముందుమాటలు కూడా రచనని ఆకాశానికి ఎత్తేస్తూంటాయి. లోపలికెళ్ళి రెండు పేజీల కంటే ఎక్కువ చదవలేము. మరి ఇక ఆ పుస్తకాన్ని చదివేవారెవ్వరు?


ఇక పంపిణీదారుల గురించి చెప్పుకుందాం. పాఠకుడు ఆదరించని సాహిత్యాన్ని వాళ్ళు ఎందుకని తమ పుస్తకాల అరల్లో ఉంచాలి? ఎన్ని పుస్తకాలని వాళ్ళు ఉంచుకోగలరు? ఎన్నాళ్ళని దాయగలరు? అందుకనే ఇటీవల కాలంలో ఈ ‘స్వీయ ప్రచురణ’ల పుస్తకాలని పంపిణీ కోసం తీసుకోవడమే మానేశారు. తీసుకున్నా 60/70 శాతం తగ్గింపుకు తీసుకుంటున్నారు. అమ్మిన తరువాతే రచయితకి వాటా ఇస్తున్నారు. కరోనా ప్రభావం వల్ల మూతపడిన వాటిలో పుస్తక దుకాణాలూ ఉన్నాయి. పెద్ద ప్రచురణ -పంపిణీ సంస్థలు కూడా దుకాణాలను తగ్గించుకు న్నాయి. ఆ మేరకు వాటి నిర్వహణ వ్యయం తగ్గింది. 


మరోవైపు ఇదివరలో వెయ్యి, రెండువేల ప్రతులు ముద్రించిన ప్రచురణ సంస్థల్లో కొన్ని పి.ఓ.డి (PoD - Print on demand/ డిమాండ్‌ మేరకు అచ్చువేయటం) పుణ్యమా అని 200 నుంచి గరిష్ఠంగా 500 ప్రతులు వరకు ముద్రిస్తున్నాయి. ‘స్వీయ ప్రచురణ’ చేసుకుంటున్న రచయితల్లో పాతిక/ యాభై ప్రతులు వేసినవారు కూడా ఉన్నారు. 


ఆటా, తానా వంటి సంస్థలు పోటీలను నిర్వహించి లక్షల్లో బహుమతి ఇచ్చి ప్రోత్సహించిన నవలలకు ఆదరణ బాగానే ఉంది. ఇటీవల వెలువడ్డ ‘కొండపొలం’ నవల నాలుగు వేల ప్రతులు, ‘శప్తభూమి’ నవల ఆరువేల ప్రతులు ముద్రణకు వెళ్లాయి. ఆటా (అమెరికా) వారి బహుమతులు పొందిన నవలలు ‘మనోధర్మపరాగం’, ‘యారాడకొండ’ కూడా పునర్ముద్రణకి వెళ్లాయి. 


గోపీచంద్‌ ‘అసమర్థుని జీవయాత్ర’ వెలువడి ఈ నెలకి 75 సంవ త్సరాలయింది. కనీసం ఈనాటికి లక్షన్నర ప్రతులు ముద్రణకి నోచు కునుంటుందని ఒక అంచనా. శ్రీశ్రీ మహాప్రస్థానం తొలి ప్రతి జూన్‌ 1950లో రెండు వేల ప్రతులతో వెలువడింది. ఇప్పటిదాకా కనీసం లక్షన్నర ప్రతులు అచ్చయ్యాయని ఒక అంచనా. విశ్వనాథ, చలం, పానుగంటి, కొడవటిగంటి, రంగనాయకమ్మ, లత, రామలక్ష్మి వంటి వారి సాహిత్యాన్ని ఈనాడు కూడా చర్చించుకునే వారున్నారు. 


దీన్నిబట్టి- పుస్తకంలో ‘వస్తువు’ (కంటెంట్‌) ముఖ్యం. అది బాగుంటే పుస్తకాన్ని పాఠకులు ఆదరిస్తారు. వస్తువు బాగున్న పుస్తకాలు అమ్ముడు కాకపోవడం అంటూ ఉండదు. ఆలస్యం కావచ్చు. మరో కారణం ‘ఫలానా’ పుస్తకం ఉందని పాఠకులకి తెలియకపోవడం. కాబట్టి రచయితలు పాఠకుడిని దృష్టిలో పెట్టుకుని రాసి, సంపాదకుడు కాకపోయినా కొంత సాహిత్యం తెలిసిన వారితో చదివించుకుని అవసరమైతే మార్పులు చేర్పులు చేసుకుని పుస్తకాన్ని వెలువరించి, పాఠకులకి తెలిసేలాగా చేస్తే ఆ సాహిత్యం పదికాలాలపాటు పాఠకుల చేతుల్లోకి వెళ్తూ ఉంటుంది. అలాగని పాఠకుడికి అన్నీ తెలుసనడమూ సరికాదు. పాఠకులు కూడా ‘చదవడం’ నేర్వాలి. అప్పుడే రాసిన రచయిత, ప్రచురణకర్త, విక్రేత, పాఠకుడు, సమాజం లాభిస్తాయి. 

 అనిల్‌ అట్లూరి

Updated Date - 2021-11-22T08:06:43+05:30 IST