హామీలే తప్ప.. ఏమీ లే..!

ABN , First Publish Date - 2022-04-25T04:57:19+05:30 IST

అన్నమయ్య జిల్లాలో ప్రధానమైన పడమటి ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలే కాదు..ఎన్నికల హామీలు, పాలకుల వాగ్ధానాలు, పార్టీల మేనిఫెస్టోలు ఏళ్ల తరబడి అమలు కావడం లేదు.

హామీలే తప్ప.. ఏమీ లే..!
మదనపల్లెలో మార్కెట్‌కు వచ్చిన టమోటా

పరిశ్రమ లేదు..ఉపాధీ లేదు..

పడమట ప్రధాన సమస్యలు గాలికి..

టమోటా, చేనేత హామీలపై నీలినీడలు


పాలకులు  వస్తున్నారు..పోతున్నారు. అయిదేళ్లకోసారి ప్రభుత్వాలూ మారుతున్నాయి. కానీ పడమట నెలకొన్న ప్రధాన సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదు. ఎన్నికల్లో వారిచ్చిన హామీలు కూడా ఎండమావిగానే మారుతున్నాయి. కార్మికుల నుంచి నిరుద్యోగుల వరకూ, రైతుల నుంచి చేనేతల వరకూ ఆదుకుంటామని నేతలు ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఈ క్రమంలో కార్మిక, నిరుద్యోగులు చేసేందుకు పనిలేక పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుండగా, ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు లేక రైతులు, తాము పోగుపోగు కలిపి నేచిన పట్టుచీరలకు గుర్తింపు లేక నేతన్నలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఏ వర్గానికీ సరైన న్యాయం జరగడం లేదనే ఆవేదన, ఆక్రోశం పడమటి ప్రజల్లో కనిపిస్తోంది.


మదనపల్లె, ఏప్రిల్‌ 24: అన్నమయ్య జిల్లాలో ప్రధానమైన పడమటి ప్రాంతంలో దీర్ఘకాలిక సమస్యలే కాదు..ఎన్నికల హామీలు, పాలకుల వాగ్ధానాలు, పార్టీల మేనిఫెస్టోలు ఏళ్ల తరబడి అమలు కావడం లేదు. అటు కర్ణాటక, ఇటు తమిళనాడు రాష్ట్రాల సంస్కృతులతో మిళితమైన పడమటి ప్రాంతాలు మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల ప్రజలు ప్రధానంగా పాడి, పంటలపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కార్మిక, కర్షక, చేనేతల జీవనం సాంతం ఉపాధి అన్వేషణతో ముడిపడి ఉంది. భౌగోళికంగా వర్షాధారంపై ఆధారపడిన రైతులు ఎక్కువగా టమోటా పంటను సాగు చేస్తున్నారు. సీజన్‌తో ప్రమేయం లేకుండా, లాభనష్టాలతో నిమిత్తం లేకుండా పేకాట పంటగా పిలిచే ఎర్రపండు పంటను పోటాపోటీగా వేస్తుంటారు. ముఖ్యంగా వేసవిలోనూ వాతావరణం అనుకూలించడంతో రైతులు ఎక్కువ మక్కువ చూపుతారు. ఈ క్రమంలో అంచనాకు మించి పంట సాగు కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. టమోటా రైతుకు గిట్టుబాటు కల్పించేందుకు వీలుగా కోల్డ్‌స్టోరేజీలు, టమోటా ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్న పాలకుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోయాయి. ధరలు పతనమైనప్పుడు టమోటాను కనీసం వారం రోజుల పాటు శీతల గిడ్డంగిలో ఉంచి తర్వాత అమ్ముకునే అవకాశం కల్పిస్తామని నాటి పాలకులు హామీ ఇచ్చారు. దీంతో పాటు టమోటా గుజ్జు, టమోటా సాస్‌, టమోటా పచ్చళ్లు, ఊరగాయలు, తదితర అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు 2005లో  దివంగత సీఎం రాజశేఖరరెడ్డి ప్రకటించారు. ఫలితంగా రైతులకు గిట్టుబాటు ధర, కూలీలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడే అవకాశాన్ని పరిగణలోకి తీసుకున్నారు. కొన్నేళ్లయినా పడమట పదిమందికి పనికొచ్చే పరిశ్రమ నెలకొల్పలేదు. మరోవైపు వ్యవసాయం కూడా ఆశించిన స్థాయిలో ఆదుకోవడం లేదు. పంట సాగుకు పెట్టుబడులు విపరీతంగా పెరగడం, పంటలకు తెగుళ్లు, కీటకాల బెడద ఎక్కువ కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కనీసం పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేకపోవడంతో సేద్యానికి స్వస్తి చెబుతూ..ఏటికేడు రైతులే కూలీలుగా మారుతున్నారు. మరికొందరు ఉపాధి కోసం పొట్టకూటి కోసం సమీపంలోని బెంగళూరు, చెన్నై, తదితర ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వీటిని అరికట్టేందుకు స్థానికంగా పనులు కల్పించాలన్న సంకల్పంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం 2005లో చేపట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం కూడా ఆశించిన స్థాయిలో ఆదుకోలేకపోతోంది. ఈ క్రమంలో తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లోని చాలా పల్లెల్లో కుటుంబాలు వలసదారి పట్టాయి. కొందరు రైతులు పాడి పరిశ్రమను ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు.

పడమట ఎక్కువమంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్న రెండో పరిశ్రమ చేనేతరంగం. మదనపల్లెలో టమోటా మార్కెట్‌ను స్పృశిస్తూ ఉన్న నీరుగట్టువారిపల్లె పట్టుచీరలకు కూడా ప్రసిద్ధి. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ ప్రస్తుతం ప్రాభవం కోల్పోతోందనే చెప్పాలి. పట్టు సాగు, పట్టుతప్పం, ముడిసరుకు ధరలు అమాంతం పెరగడం, చేనేత స్థానంలో మరమగ్గాలు ఇబ్బడిముబ్బడిగా ప్రవేశించడం, కార్మికులకు వృత్తి నైపుణ్య శిక్షణ లేకపోవడం, మరమగ్గాల డిజైన్లను దీటుగా ఎదుర్కోలేకపోవడం తదితర కారణాలుగా చెప్పవచ్చు. మదనపల్లె నీరుగట్టువారిపల్లెలో 10 వేల చేనేత మగ్గాలు, ప్రత్యక్షంగా, పరోక్షంగా 20 వేల మందికి చేనేత రంగం ఉపాధి కల్పిస్తోంది. కంచి, ధర్మవరం పట్టుచీరల తరహాలో పట్టుచీరలను తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే చీరలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో పాటు కేరళకు సరఫరా చేస్తున్నారు. కానీ ఇక్కడ తయారైన చీరలకు అక్కడి బ్రాండ్లతో పేర్లు పెట్టి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. దీంతో మదనపల్లె చేనేతలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ క్రమంలో మదనపల్లె పట్టు చీరలకు బ్రాండ్‌ ఇమేజ్‌ కల్పిస్తామని పాలకులు పలుమార్లు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. అలాగే కార్మికుల నుంచి మాస్టర్‌ వీవర్స్‌ వరకూ వృత్తి నైపుణ్య శిక్షణ, సిల్కుకు రంగుల అద్దకం నుంచి పట్టుచీరల తయారీ, అమ్మకం వరకూ అన్ని సౌకర్యాలు, వసతులు ఒనగూరే  మెగా క్లస్టర్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే మెగా క్లస్టర్‌తో చేనేత రంగం అన్ని రంగాలు, అవకాశాల్లోనూ ముందుంటుంది. కార్మికుల సంక్షేమంతో పాటు మదనపల్లె చేనేతకు బ్రాండ్‌ ఇమేజ్‌ హోదా వస్తుంది. అయితే వీటన్నింటినీ పక్కనపెట్టిన ప్రభుత్వం నేతన్ననేస్తం పేరుతో కార్మికులకు రూ.24 వేలు ఇస్తోంది. అది కూడా అందరికీ కాకుండా కొందరికే పరిమితమైందనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఈ పథకంతో గతంలో వస్తున్న చేనేత సంక్షేమ పథకాలు, సిల్క్‌ సబ్సిడీలకు బ్రేక్‌ పడింది.



Updated Date - 2022-04-25T04:57:19+05:30 IST