కరోనా బ్యాచ్‌.. భేష్‌! రెండేళ్లు తరగతుల్లేకపోయినా అద్భుత ఫలితాలు

ABN , First Publish Date - 2022-07-01T16:49:38+05:30 IST

కరోనా కారణంగా రెండేళ్లు (2020, 2021 విద్యా సంవత్సరాల్లో) పరీక్షలు నిర్వహించలేదు! ఫీజు కట్టిన వారందరినీ పాస్‌ చేశారు! గత ఏడాది ప్రత్యక్ష తరగతులను కూడా కొంత ఆలస్యంగా నిర్వహించారు! అయినా, పదో తరగతి విద్యార్థులు భేష్‌

కరోనా బ్యాచ్‌.. భేష్‌! రెండేళ్లు తరగతుల్లేకపోయినా అద్భుత ఫలితాలు

పదో తరగతి వార్షిక పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత

బాలికలదే పైచేయి.. 92.45% పాస్‌.. బాలురు 88%

15 స్కూళ్లలో ‘0’ ఉత్తీర్ణత.. 100% సాధించిన 

3007 స్కూళ్లు.. ఫలితాలను ప్రకటించిన సబిత

ఫలితాల్లో సిద్దిపేట టాప్‌.. హైదరాబాద్‌ లాస్ట్‌

ఆగస్టు 1 నుంచి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ


హైదరాబాద్‌, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): కరోనా కారణంగా రెండేళ్లు (2020, 2021 విద్యా సంవత్సరాల్లో) పరీక్షలు నిర్వహించలేదు! ఫీజు కట్టిన వారందరినీ పాస్‌ చేశారు! గత ఏడాది ప్రత్యక్ష తరగతులను కూడా కొంత ఆలస్యంగా నిర్వహించారు! అయినా, పదో తరగతి విద్యార్థులు భేష్‌ అనిపించారు! వార్షిక పరీక్షల్లో 90 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు! వీరిలోనూ బాలికలు ఎప్పట్లాగే పైచేయి సాధించారు. ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో బాలురు 87.61 శాతం ఉండగా, బాలికలు 92.45 శాతం మంది ఉండడం విశేషం. పదో తరగతి పరీక్షల ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,03,579 మంది విద్యార్థులు పరీక్షలను రాయగా, వారిలో 4,53,201 మంది ఉత్తీర్ణతను సాఽధించారు. నిజానికి, కరోనా కారణంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడం.. ప్రత్యక్ష తరగతులు కూడా సరిగ్గా జరగని విషయం తెలిసిందే. ఇప్పుడు పదో తరగతి పాసైన విద్యార్థులు అయితే గత రెండేళ్లుగా దాదాపు ఇళ్లకే పరిమితమయ్యారు. వారికి ఆన్‌లైన్‌ తరగతులూ అరకొరగానే సాగాయి. అందుకే, వార్షిక పరీక్షలకు సిలబ్‌సను 30 శాతం కుదించారు. 70 శాతం సిలబ్‌సతోనే పరీక్షలు జరిపారు. పరీక్ష పేపర్లను కూడా 11 నుంచి 6కు కుదించారు. వార్షిక పరీక్షల్లో చాయిస్‌ ప్రశ్నల సంఖ్యను కూడా పెంచారు. దాంతో, విద్యార్థులకు పరీక్షలను రాయడం కొంత సులువుగా మారింది. నిజానికి, 2019లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది. దానితో పోలిస్తే కొంత తగ్గినా.. కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే విద్యార్థులు ఈసారి అద్భుత ఫలితాలను సాధించినట్లే! విద్యార్థులు తమ మార్కుల రీ-కౌంటింగ్‌ కోసం రూ.500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. 


ఈనెల 30వ తేదీ నుంచి 15 రోజుల్లో ఇందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. రీ-వెరిఫికేషన్‌ కోసం ప్రతి సబ్జెక్టు కోసం రూ.1000 చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. సంబంధిత దరఖాస్తుపై స్కూల్‌ హెచ్‌ఎం సంతకం చేయించి, డీఈవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్‌లో దాఖలు చేయాల్సి ఉంది. ప్రస్తుత ఫలితాల్లో 11,343 మంది విద్యార్థులు 10/10 జీపీఏను సాధించారు. అలాగే.. రాష్ట్రంలోని 3,007 స్కూళ్లలో 100 శాతం ఫలితాలు నమోదు కాగా.. 15 స్కూళ్లల్లో జీరో ఉత్తీర్ణత నమోదైంది. వీటిలో ఒక ఎయిడెడ్‌, రెండు ప్రభుత్వ స్కూళ్లు, మరో మూడు జడ్పీ స్కూళ్లు ఉండగా.. తొమ్మిది ప్రైవేటు స్కూళ్లు కావడం గమనార్హం. ఇక, ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 1వ తేదీ నుంచి అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు. అప్పటి వరకూ వారికి వారానికి రెండుసార్లు ప్రత్యేక తరగతులను నిర్వహించాలని మంత్రి అధికారులకు సూచించారు.


ఫస్ట్‌ సిద్దిపేట.. లాస్ట్‌ హైదరాబాద్‌

జిల్లాలవారీగా ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే.. అత్యధికంగా 97.85 శాతం ఉత్తీర్ణతను సాధించి సిద్దపేట జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. దాని  తర్వాత వరుసగా నిర్మల్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు జిల్లాలు ఉన్నాయి. రాజధాని హైదరాబాద్‌  79.63 శాతంతో చివరి స్థానంలో నిలవడం విశేషం.


జీరో, ఒక్క మార్కులపై సుమోటోగా పరిశీలన: మంత్రి సబిత

ఇంటర్‌, టెన్త్‌ ఫలితాల్లో జీరో, ఒక్క మార్కు వచ్చిన విద్యార్థుల పరీక్ష పేపర్లను సుమోటోగా పరిశీలించాలని మంత్రి సబిత అధికారులను ఆదేశించారు. టెన్త్‌ ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఫెయిలైన విద్యార్థులు బాధ పడవద్దని, భవిష్యత్తు ఇంకా ఉందని చెప్పారు. ఇంటర్‌, టెన్త్‌లో జీరో, ఒక్క మార్కు వచ్చిన విద్యార్థులకు సంబంధించిన ప్రతి పేపర్‌ను వెరిఫై చేయాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందవద్దని కోరారు.


ఇంగ్లిషు మీడియం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువ

టెన్త్‌ ఫలితాల్లో ఇంగ్లీషు మీడియం విద్యార్థుల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా నమోదైంది. తెలుగు, ఉర్దూ మీడియం విద్యార్థుల ఉత్తీర్ణత శాతంతో పోలిస్తే వీరు కొంత ఎక్కువ ఉత్తీర్ణతను సాధించారు.







Updated Date - 2022-07-01T16:49:38+05:30 IST