ఇసుక దందా

ABN , First Publish Date - 2022-01-04T06:03:58+05:30 IST

అధికారం అండ చూసుకొని పేట్రేగిపోతున్నారు. అనుమతి లేకుండానే ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేసి లక్షలాది రూపాయలు పోగు చేసుకుంటున్నారు. కళ్ల ముందే అడ్డగోలుగా ఇసుకను తోడేస్తున్నా, అనుమతిలేని చోటికి రోడ్డు వేస్తున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.

ఇసుక దందా
అనుమతిలేకుండా ఎక్స్‌కవేటర్‌తో తవ్వకాలు

అనుమతి లేకుండానే తవ్వకాలు 

రీచ కోసం 5 కి.మీ మేర దారి ఏర్పాటు 

బరితెగించిన కాంట్రాక్ట్‌ సంస్థ

భూగర్భ జలాలు అండుగంటుతాయంటూ రైతుల ఆందోళన 

అక్రమ తవ్వకాలను అడ్డుకోవాలంటూ జేసీకి రైతుల విజ్ఞప్తి 

పెండ్లిమర్రి, జనవరి 3 : అధికారం అండ చూసుకొని పేట్రేగిపోతున్నారు. అనుమతి లేకుండానే ఇష్టారాజ్యంగా ఇసుకను తవ్వేసి లక్షలాది రూపాయలు పోగు చేసుకుంటున్నారు. కళ్ల ముందే అడ్డగోలుగా ఇసుకను తోడేస్తున్నా, అనుమతిలేని చోటికి రోడ్డు వేస్తున్నా అధికార యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది. ఇక్కడ ఇసుక తవ్వితే సాగునీటితో పాటు తాగునీటికి ముప్పు వస్తుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇది ఎక్కడో జరగలేదు. కడప జిల్లా కేంద్రానికి దగ్గర్లోని పాపాగ్ని నదిలో ఈ ఇసుక దందా నడుస్తోంది. 


భూగర్భాలు పడిపోతాయని రైతుల ఆందోళన 

పెండ్లిమర్రి, కమలాపురం సరిహద్దుల్లోని ఎర్రబళి సమీపంలో ఉన్న పాపాగ్ని నదిలో ఇసుకను అక్రమంగా అనుమతి లేకుండా తోడేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుకను ప్రభుత్వం జేపీ వెంచర్‌కు కట్టబెట్టింది. అయితే ఇక్కడ జేపీ వెంచర్‌ వేరే వారికి సబ్‌ కాంట్రాక్ట్‌ ఇచ్చిందని సమాచారం. వీరు ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తోడేస్తున్నారు. ఇసుకను తరలించేందుకు నదిలో ఏకంగా మట్టిరోడ్డు వేసుకున్నారు. వీరు ఇసుకను తోడుతున్న చోట రైతులకు చెందిన 100కు పైగా ఫిల్టర్‌ బోర్‌ పాయింట్లు ఉన్నాయి. కొండూరు, తుమ్మలూరు, గోపరాజుపల్లె, ఎర్రబల్లె, కొత్తపల్లె, పొడదుర్తి గ్రామాల్లో 3 వేల ఎకరాలకు ఫిల్టర్‌ పాయింట్ల ద్వారానే తాగునీరు అందుతుంది. అయితే ఇప్పుడు ఇష్జారాజ్యంగా ఇసుక తవ్వేస్తుండటంతో భూగర్భజలాలు అడుగంటుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న వచ్చిన వరద కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆ బాధ నుంచి కోలుకోకముందే ఇక్కడ జరుగుతున్న ఇసుక తవ్వకాలు చూసి రైతులు బోరుమంటున్నారు. ఇసుక తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటితే ఫిల్టర్‌ పాయింట్ల ద్వారా తాగునీరు అందదు, నీరు అందకపోతే పంటలు ఎలా పెట్టాలంటూ రైతులు వాపోతున్నారు. అలాగే తాగునీటి ఎద్దడి కూడా తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలానే కొనసాగితే రానున్న వేసవిలో గుక్కెడు నీటికోసం వెంపర్లాడాల్సిన దుస్థితి వస్తుందంటూ చెబుతున్నారు. అనుమతి లేకుండా ఎక్స్‌కవేటర్లు పెట్టి ఇసుక తవ్వేసి టిప్పటర్ల ద్వారా తరలిస్తున్నారు. తవ్వకాలు నిలిపేయాలని, ఇక్కడ అనుమతి ఇవ్వదంటూ స్థానికులు సోమవారం స్పందన కార్యక్రమంలో జేసీ గౌతమి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు.


తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదు

- వెంకటేశ్వరరెడ్డి, భూగర ్భ గనులశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ 

ఎర్రబల్లెలోని పాపాగ్ని నదిలో ఇసుక తవ్వకాలకు ఎవరికి అనుమతి ఇవ్వలేదు. ఈ విషయం మా దృష్టికి రాలేదు. నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2022-01-04T06:03:58+05:30 IST