వెల్దుర్తి శివారులో గుప్త నిధుల కోసం తవ్వకాలు!

ABN , First Publish Date - 2022-05-27T06:00:42+05:30 IST

వెల్దుర్తి గ్రామ శివారు శ్మశాన వాటిక పక్కన వ్యవసాయ పొలాల్లో చారిత్రక కట్టడాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసిన ఘటన గురువారం వెలుగు చూసింది.

వెల్దుర్తి శివారులో గుప్త నిధుల కోసం తవ్వకాలు!
కాశోని కులస్థులు నిర్మించిన చారిత్రాత్మక కట్టడం (ఫైల్‌), శ్మశానవాటిక పక్కన తవ్విన దృశ్యం

ఫిర్యాదు చేసిన గ్రామస్థులు

వెల్దుర్తి, మే 26: వెల్దుర్తి గ్రామ శివారు శ్మశాన వాటిక పక్కన వ్యవసాయ పొలాల్లో చారిత్రక కట్టడాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసిన ఘటన గురువారం వెలుగు చూసింది.   కాశన్నగోరీగా పిలువబడే ఈ చారిత్రక కట్టడాన్ని గుప్త నిధుల కోసమే తవ్వకాలు చేపట్టి ధ్వంసం చేసినట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.   వందలాది ఏళ్ల క్రితం స్థానికంగా విఠలేశ్వర ఆలయంతోపాటు కాకతీయ తోరణాలు, ఇతర కట్టడాలను కాశోలుగా పిలువబడే కులస్తులు నిర్మించినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడే ఉండి పని ముగిసిన అనంతరం గుర్తింపుగా ఈ నిర్మాణం చేపట్టినట్లు గ్రామపెద్దలు వివరించారు. ఈ నిర్మాణం శ్మశాన  వాటిక పక్కనే ఉండటంతో రానురాను గ్రామస్థులు కాశన్నగోరీగా పిలుస్తున్నారు. కాకతీయ కట్టడాల మాదిరిగా ఉన్న నిర్మాణం కాశన్నగోరీగా మారినట్లు మానవహక్కుల సంఘం రాష్ట్ర పీఆర్వో ముక్తాబాయి తెలిపారు. అక్కడ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లు తెలియడంతో మాజీ జడ్పీటీసీ ఆంజనేయులు, ఈవో బలరాంరెడ్డి ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ విషయాన్ని రెవెన్యూ పోలీసుశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. గుర్తు తెలియని దుండగులు గుప్త నిధుల కోసం ఈ నిర్మాణం వద్ద పసుపు, కుంకుమ, నిమ్మకాయలు వేసి క్షుద్ర పూజలు జరిపి తవ్వకాలు చేపట్టినట్లు ముక్తాబాయితోపాటు, గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెల్ధుర్తి తహసీల్దారు సురేష్‌, పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలన చేశారు.  

Updated Date - 2022-05-27T06:00:42+05:30 IST