ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఎలా..?

ABN , First Publish Date - 2021-04-09T06:25:03+05:30 IST

2020-21 విద్యాసంవత్సరాన్ని

ప‌ది, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ఎలా..?

ఇది ‘పరీక్షా’ సమయం 

పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై గందరగోళం 

కేంద్రాల నిర్వహణకు ‘ప్రైవేట్‌’ యాజమాన్యాల నిరాకరణ

బడులను అర్థాంతరంగా బంద్‌ చేసినందుకు నిరసన

డిమాండ్లు నెరవేరిస్తేనే కేంద్రాలు అప్పగిస్తామని వెల్లడి


టెన్త్‌, ఇంటర్‌ వార్షిక పరీక్షల సమయం సమీపిస్తోంది. పరీక్షలు నిర్వహిస్తారా, లేదా అనే దానిపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన జారీ చేయలేదు. మరో వైపు తమ పాఠశాలల్లో పరీక్షా కేంద్రాల ఏర్పాటుకు ప్రైవేటు యాజమాన్యాలు ససేమిరా అంటున్నాయి. షెడ్యూల్‌ దగ్గర పడుతుండడంతో విద్యాశాఖ ఆందోళనకు గురవుతోంది. 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి) : 2020-21 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని మే 1 నుంచి 20 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌, మే 17 నుంచి 26 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఆయా బోర్డులు నాలుగు నెలల క్రితమే షెడ్యూల్‌ ఖరారు చేశాయి. దాని ప్రకారం ఇప్పటికే పరీక్షా కేంద్రాల గుర్తింపు, ఏర్పాటు పనులు జరగాలి. గతంలో మాదిరిగా ప్రైవేట్‌ యాజమాన్యాలు సెంటర్ల  నిర్వహణకు తమ పాఠశాలలను అప్పగించకుండా మొండికేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. 


కరోనా కల్లోలం..


కరోనాతో గతేడాది పదో తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే పై తరగతికి ప్రమోట్‌ చేశారు. ఇంటర్‌లో ఫీజు చెల్లించిన ప్రతి విద్యార్థినీ పాస్‌ చేశారు. 2021-22 విద్యా సంవత్సరంలో భాగంగా సెప్టెంబర్‌ 12 నుంచి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదివే విద్యార్థులకు టీ-శాట్‌, దూరదర్శన్‌ ఛానళ్ల ద్వారా ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించారు. ఫిబ్రవరి 1 నుంచి 9, 10, ఇంటర్‌, డిగ్రీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనలు ప్రారంభించారు. మరోసారి కరోనా విజృంభణతో మార్చి 23 నుంచి క్లాస్‌రూమ్‌ బోధనలకు ప్రభుత్వం బ్రేక్‌ వేసింది. దీంతో ఆయా తరగతుల విద్యార్థులు మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసుల బాట పట్టారు. 


22 రోజుల్లో ఇంటర్‌ పరీక్షలు


జిల్లాలో మరో 22 రోజుల్లో ఇంటర్‌, నెలా పది రోజుల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. కొవిడ్‌ నేపథ్యంలో బెంచీకి కేవలం ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టాలని అధికారులు నిర్ణయించారు. గదిలో 20 మందికి సీటింగ్‌ కేటాయిస్తున్నారు. ఈసారి అదనంగా మరో 71 సెంటర్లను తీసుకుంటున్నారు. పదో తరగతికి గతంలో 361 ఉండగా, ఈసారి 453కు పెంచారు. సెంటర్ల కోసం ప్రభుత్వ స్కూళ్లతో పాటు ప్రైవేట్‌ బడులు, స్కూళ్లను తీసుకునేందుకు చర్యలు చేపట్టారు. వారం రోజులుగా ప్రైవేట్‌ యాజమాన్యాలకు ఇంటర్‌ విద్యా, జిల్లా విద్యాశాఖాధికారులు ఫోన్లు చేస్తున్నారు. 


కేంద్రాల నిర్వహణకు ‘పీఠ’ముడి


గతంలో పరీక్షల సమయంలో ప్రభుత్వానికి సహకరించిన ప్రైవేట్‌ యాజమాన్యాలు ప్రస్తుతం సహాయ నిరాకరణ చేస్తున్నాయి. కరోనాతో నష్టాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం తమపై కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్‌ స్కూళ్లు, కాలేజీలకు సాయం అందించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పరీక్షలకు కావాల్సిన సెంటర్లను తామెందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నారు. సెంటర్లు కావాలంటే తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Updated Date - 2021-04-09T06:25:03+05:30 IST