పరీక్షా సమయం.. ఆరోగ్యం పదిలం

ABN , First Publish Date - 2022-04-23T05:30:00+05:30 IST

కరోనా.. వరుసగా రెండేళ్లు విద్యార్థులను అన్ని రకాల పరీక్షలకు దూరం చేసింది. ఆనలైన బోధనతో పాఠ్యాంశాలను నేరుగా తరగతి గదిలో వినే అవకాశం లేకుండా పోయింది.

పరీక్షా సమయం..  ఆరోగ్యం పదిలం

రెండేళ్ల తర్వాత ఆఫ్‌లైనలో పరీక్షలు

27న టెన్త, మే 6 నుంచి ఇంటర్‌ విద్యార్థులకు..

రేయింబవళ్లు పుస్తకాలతో బిజీబిజీ

ఒత్తిడి జయించాలంటున్న నిపుణులు

ఆహారపు అలవాట్లలో మార్పులూ అనివార్యం


ఆశయానికి ఆచరణ జోడిస్తే... చక్కటి ప్రణాళికతో ముందుకెళితే.. కలలలోకం కళ్లెదుటే సాక్షాత్కరిస్తుంది.   నిజజీవితంలో దీనిని ఎంతోమంది నిరూపించారు కూడా. కరోనా మహమ్మారి దాదాపు తెరమరుగు కావడంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతూ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు. ఈ తరుణంలో ఉత్తమ మార్కుల సాధన కోసం విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతుండగా, తల్లిదండ్రుల్లోనూ ఆందోళన నెలకొంది. స్పష్టమైన ప్రణాళిక, కఠోరశ్రమ, అకుంఠిత దీక్షతో లక్ష్యాలను చేరవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చదువుతోపాటు   తీసుకునే ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఈ నేపథ్యంలో పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థుల కోసం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం...


నెల్లూరు (విద్య) ఏప్రిల్‌ 23 : కరోనా.. వరుసగా రెండేళ్లు విద్యార్థులను అన్ని రకాల పరీక్షలకు దూరం చేసింది. ఆనలైన బోధనతో పాఠ్యాంశాలను నేరుగా తరగతి గదిలో వినే అవకాశం లేకుండా పోయింది. ప్రస్తుతం వైరస్‌ తగ్గుముఖం పట్టడం, వ్యాక్సినేషన దాదాపు పూర్తి కావడంతో ఈ ఏడాది ఆఫ్‌లైన పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్‌ 27వ తేదీ నుంచి పదోతరగతి, మే 6న ఇంటర్‌ ప్రఽథమ, 7న ద్వితీయ సంవత్సరం విద్యార్ధులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత పోటీ పరీక్షలు కూడా జరగనున్నాయి. దీంతో విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.  కొందరిలో తెలియని ఆందోళన, భయం నెలకొని ఉన్నాయి. మంచి మార్కులు సాధించే క్రమంలో తమ పిల్లలు తిండిపై కూడా ధ్యాస పెట్టకపోవడంతో ప్రభావం ఫలితాలపై పడుతుందనే ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది. ఒత్తిడికి గురికాకుండా సమయానికి సాత్విక ఆహారం తీసుకుంటూ బాగా నిద్రపోతే జ్ఞాపకశక్తి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 


సమస్యలకు చెక్‌...


కరోనా కారణంగా విద్యార్థులు పరీక్షలు రాయకపోవడం, ఆనలైన తరగతులే జరగడం, సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు లేని వారికి బోధన సరిగా అందకపోవడం తదితర కారణాలతో పిల్లలపై ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆనలైన తరగతుల కారణంగా చాలామంది విద్యార్థులు కాగితంపై రాయడంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యలతో బాధపడే విద్యార్థులు ముందు ప్రశాంతంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షలు రాయడమే తప్ప పాస్‌, ఫెయిల్‌ గురించి ఆలోచించవద్దంటున్నారు. మార్కుల గురించి పట్టించుకోవద్దని, వచ్చిన అంశాలను పేపర్‌పై ప్రజెంట్‌ చేయడంపైనే దృష్టి సారించాలని చెబుతున్నారు. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో కొత్త అంశాలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపించవద్దని, ఇప్పటికే చదివిన పాఠ్యాంశాలనే పునరుచ్చరణ చేసుకోవాలని చెబుతున్నారు. పిల్లలు ప్రశాంత వాతావరణంలో పరీక్షలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు చొరవ చూపాలని, మార్కులు, టార్గెట్‌లు అసలు పెట్టవద్దని సూచిస్తున్నారు. అలాగే ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం యోగా, మెడిటేషన చేస్తే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందవచ్చు. స్మార్ట్‌ఫోన్లకు అలవాటుపడిన విద్యార్థులు పరీక్షలు పూర్తయ్యే వరకు వాటి జోలికి వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. 


తీసుకునే ఆహారం ఇలా..


విద్యార్థులు ఒత్తిడికి గురికావడంతో కడపులో మంట వస్తుంది. రాత్రిపూట ప్రతిరోజూ పెరుగుతో కూడిన అన్నం తీసుకుంటే బాగుంటుంది. 

పచ్చి క్యారెట్‌ను మితంగా తినడం వల్ల విటమిన్‌-ఏ లభిస్తుంది. పుస్తకాలు చదివే సమయంలో కళ్లు మంటలు పుడుతుంటాయి. దీనినుంచి విద్యార్థులు బయటపడాలంటే క్యారెట్‌ తప్పనిసరి. 

ఉదయం ఇడ్లీ తినడం వల్ల విద్యార్థులకు కార్బొహైడ్రేట్స్‌ లభిస్తాయి. అది జీర్ణం కావడం వల్ల గ్లూకోజ్‌గా మారి శక్తి లభిస్తుంది.

అరటిపండ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

విద్యార్థులు ఒత్తిడికి గురికావడంతో చెమటలు పడతాయి. ఇలాంటి విద్యార్థులు నీటిని ఎక్కువగా తీసుకుంటే బాగుంటుంది. ఒత్తిడిని అధిగమించడానికి యోగా చేయడం మంచిది. 

కొవ్వు పదార్థాలు, నూనె వస్తువులు, మాంసాహారాన్ని వీలైనంత తగ్గించుకోవాలి.

తీసుకునే ఆహారం పరిమాణం తగ్గించాలి. నిద్రపోయే ముందు పాలు తాగాలి. 

జామ, అరటి, ఆపిల్‌ వంటి పండ్లను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మంచిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా అవి విద్యార్థికి ఎంతగానో ఉపయోగపడతాయి. 



ఆత్మవిశ్వాసం ముఖ్యం


విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలకు హాజరయ్యేలా చర్యలు చేపడుతున్నాం. మారిన పరీక్షా విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించాం. ఎలాంటి ఆందోళన చెందకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్ష హాలులో అడుగుపెట్టాలి. మిగిలిన వారితో అనవసర విషయాలు మాట్లాడకుండా ప్రశాంతంగా ఉండాలి. నేను పరీక్ష బాగా రాయగలను అన్న ఒక్క నినాదంతోనే ముందుకెళితే విజయం సాధ్యమవుతంది. 

- కె.రమేష్‌, జిల్లా విద్యాశాఖాధికారి 



ఆత్మస్థైర్యమే ఆయుధం


పరీక్షల సమయంలో భయాన్ని వదిలేసి ఆత్మస్థైర్యంతో ముందకెళితే మంచి ఫలితాలు వస్తాయి. మార్కులు, ర్యాంకుల గురించి పట్టించుకోకుండా హర్డ్‌వర్క్‌, బెస్ట్‌ ఎఫెర్ట్‌ పెడితే తప్పక ఫలితాలు వరిస్తాయి. అనవసర ఆలోచనలతో ఒత్తిడి పెరుగుతుంది. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లలను ప్రోత్సహించి పరీక్షలకు సన్నద్దం చేయాలి. చదువుపై ఏకాగ్రత పెట్టడంతోపాటు తగిన సమయం విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారపు అలవాట్లు ఉత్తమ విద్యార్థిగా తీర్చిదిద్దుతాయి. 

- వరప్రసాద్‌రావు, ఇంటర్‌బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి 


ఆహారం, నిద్ర ముఖ్యం


పరీక్షలు దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు ఒత్తిడికి గురికావద్దు. చదివిన అంశాలు గుర్తు ఉండాలంటే నిద్రకు  7-8 గంటలు కేటాయించాలి. ఇడ్లీ, పెరుగన్నం, అరటిపండ్లు, క్యారెట్‌, పాలు, నీళ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఒత్తిడికి గురికాకుండా ఉంటేనే మేథా సంపత్తి పెరుగుతుంది. పరీక్షలకు ముందు మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారు. గ్లూకోజ్‌ కలిపిన నీటిని తరచూ తీసుకుంటే ఉత్సాహంగా ఉంటారు. 


- సీహెచ.ఉషారాణి, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌ 


ప్రణాళికతోనే విజయాలు సాధ్యం


రెండేళ్ల విరామం అనంతరం జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో ప్రణాళికతో ముందుకెళ్లాలి. వాయిదా వేసే మనస్తత్వాన్ని విడనాడాలి. చదువులో ఉండే ఆనందాన్ని అనుభవించాలి. మీ విద్యకు ఆటంకపరిచే అన్ని విషయాలను పక్కన పెట్టాలి. రోజూ రెండుగంటలకు ఒకసారి కొంతసేపు విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తినడం, మంచినీరు తాగడం చేయాలి. పిల్లలు ఒత్తిడికి గురికాకుండా తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలి. భరోసాను కల్పించేలా వ్యవహరిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చు. 

- సీహెచ.రమే్‌షబాబు, సైకాలజిస్ట్‌, నెల్లూరు

Updated Date - 2022-04-23T05:30:00+05:30 IST