పరీక్షలు రాయాలంటే హిజాబ్‌ వదలాల్సిందే

ABN , First Publish Date - 2022-02-23T18:15:25+05:30 IST

ఎస్‌ఎస్ఎల్‌సీ, ద్వితీయ పీయూసీ పరీక్షలు రాయాలంటే హిజాబ్‌ను త్యజించాల్సిందేనని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ స్పష్టం చేశారు. శాసనసభ లాంజ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

పరీక్షలు రాయాలంటే హిజాబ్‌ వదలాల్సిందే

                                 - విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ 


బెంగళూరు: ఎస్‌ఎస్ఎల్‌సీ, ద్వితీయ పీయూసీ  పరీక్షలు రాయాలంటే హిజాబ్‌ను త్యజించాల్సిందేనని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ స్పష్టం చేశారు. శాసనసభ లాంజ్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైకోర్టు తుదితీర్పు వచ్చేంతవరకు మధ్యంతర ఆదేశాలు అమలులో ఉంటాయన్నారు. హిజాబ్‌తోపాటు కాషాయ కండువాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. ఈ నియమాలు ఉల్లంఘించే ఏ మతానికి చెందిన విద్యార్థులకైనా సరే మళ్లీ పరీక్షలు నిర్వహించే ప్రశ్నే లేదన్నారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను కొందరు విద్యార్థినులు వ్యతిరేకిస్తున్నారని, వారి తరపున కాంగ్రెస్‌ వకాల్తా పుచ్చుకుంటోందని ఆవేదన చెందారు. మతాచారాల మత్తులోపడి అమూల్యమైన విద్యాభ్యాసాన్ని దూరం చేసుకోవద్దని హితవు పలికారు. తమకు అన్ని మతాల పిల్లలు సమానమేనని, ఈ విషయంలో వివక్షత ఉండదని స్పష్టం చేశారు. ఎవరైనా వివక్షత ప్రదర్శిస్తే సహించబోమన్నారు. శివమొగ్గలో ఇంకా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నందున శుక్రవారం వరకు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించామన్నారు. హిజాబ్‌ విషయంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ చేష్టలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. 

Updated Date - 2022-02-23T18:15:25+05:30 IST