ఖననం చేసిన యువకుడి మృతదేహానికి పరీక్ష

ABN , First Publish Date - 2022-06-15T05:42:15+05:30 IST

నాలుగు నెలల క్రితం ఖననం చేసిన ఓ వ్యక్తి మృతదేహానికి పోలీసులు శవపరీక్ష నిర్వహించారు. వైరా పోలీసుల కథనం ప్రకారం..

ఖననం చేసిన యువకుడి మృతదేహానికి పరీక్ష
పంచనామా చేస్తున్న అధికారులు

 ఐదుగురిపై కేసునమోదు

  వైరా మండలంలోని రెబ్బవరం ఘటన

వైరా,జూన్‌14: నాలుగు నెలల క్రితం ఖననం చేసిన ఓ వ్యక్తి మృతదేహానికి పోలీసులు శవపరీక్ష నిర్వహించారు. వైరా పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని రెబ్బవరం గ్రామానికి చెందిన మెండెం శ్రీనివాసరావు(46) ఈ ఏడాది మార్చి 28న ఖానాపురం గ్రామంలోని తమ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకరోజల్లా కుటుంబ సభ్యులు తర్జనభర్జనలు పడిన అనంతరం శ్రీనివాసరావు ఆత్మహత్యను గోప్యంగా ఉంచి అందరి సహకారంతో తన స్వగ్రామమైన రెబ్బవరంలో ఖననం చేశారు. శ్రీనివాసరావు కొన్నేళ్లుగా ఖానాపురంలో నివాసముంటున్నప్పటికీ సోదరుడి కుటుంబసభ్యులతో భూ వివాదం, పాతగొడవలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాసరావు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం ఆతర్వాత ఖననం చేయటం అంతా సద్దుమ ణిగింది అనుకుంటున్న సమయంలో.. తన ఆత్మహత్యకు కారణం తన సోదరుడు, ఆయన కుటుంబ సభ్యులే కారణమని రాసిన లేఖ మృతుడి భార్య సంపూరణకు ఇంట్లో  లభ్యమైంది. దీంతో ఆమె వైరా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు మేరకు శ్రీనివాసరావు సోదరుడు మెండెం ఇసాక్‌బాబు ఆయన కుటుంబసభ్యులైన కాంతమ్మ, కిరణ్‌, తోట సత్యావతి అలియాస్‌ శాంతి, ఉషలపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే సమయంలో ఖననం చేసిన శ్రీనివాసరావు మృతదేహానికి మంగళవారం రెబ్బవరం పరీక్షలు చేయించారు. తహసీల్దార్‌ నారపోగు అరుణ పంచనామా నిర్వహించారు. మధిర డాక్టర్‌ బాబ్‌జాన్‌ శవపరీక్ష నిర్వహించారు. వైరా ఎస్‌ఐ శాఖమూరి వీరప్రసాద్‌, పోలీసు సిబ్బంది బందోబస్తు ఏర్పాటుచేశారు.

Updated Date - 2022-06-15T05:42:15+05:30 IST