Advertisement
Advertisement
Abn logo
Advertisement

పరీక్షలు దగ్గరకొచ్చేకొద్దీ గుండెల్లో దడ పెరుగుతోందా?

పరీక్షేమీ కాదు..

పరీక్షలు దగ్గరకొచ్చేకొద్దీ గుండెల్లో దడ పెరుగుతోందా?

ఆకలి, నిద్ర తగ్గిపోయి, తెలియని గుబులు ఆవరిస్తోందా?

ఎంత చదివినా, ఇంకా ఏదో మిగిలిపోయిందని అనిపిస్తోందా?

గండం గట్టెక్కగలమో, లేదో అనే ఆందోళన వేధిస్తోందా?

ఇలాంటి ఎగ్జామ్‌ ఫీవర్‌ పరీక్షల వేళ అత్యంత సహజం! 


అయితే ఈ ఇబ్బందులన్నీ అర్థం లేనివనీ... వీటిని అధిగమించి

పరీక్షల్లో విజయం సాధించడం సులభమేననీ అంటున్నారు వైద్యులు!


వాళ్లు చెబుతున్న మెళకువలు...

పుస్తకాలతో గంటల తరబడి గడిపేసే పిల్లలు ఉంటారు. పరీక్షల ముందు మాత్రమే పుస్తకాల దుమ్ము దులిపే పిల్లలూ ఉంటారు. అయితే ఈ రెండు వ్యవహార శైలులూ సరైనవి కావు. చదువు విషయంలో అతి ఎంత అనర్థమో, ప్రణాళిక లేకుండా పరీక్షలకు సిద్ధపడడమూ అంతే అనర్థదాయకం. కాబట్టి పరీక్షల్లో మెరుగైన ఫలితం సాధించాలంటే కొన్ని నియమాలు పాటించాలి. 


మూడు ‘పీత’లు!

విద్యార్ధులు పరీక్షలకు సిద్ధమయ్యేటప్పుడు మూడు సూత్రాలు పాటించాలి. అవేమిటంటే... ప్రిపరేషన్‌, ప్లానింగ్‌, పర్‌ఫార్మెన్స్‌!


ప్రిపరేషన్‌: కొందరు పిల్లలు కష్టపడి చదివే క్రమంలో విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటే సమస్యగానే భావించాలి. ఇందుకు వారిలో పరీక్షల్లో నెగ్గలేమేమోననే భయం, ఆత్మవిశ్వాసం లోపించడం ప్రధాన కారణం. ఇలాంటి పిల్లలు చదివిందే పదే పదే చదువుతూ ఉంటారు. పరీక్షల వరకూ సమయం పెట్టుకుని, అప్పటిలోగా రివిజన్‌ పూర్తి చేయాలని ధ్యేయంగా పెట్టుకుంటారు. తీరా పరీక్షలు దగ్గరకొచ్చేసరికి కొంత పోర్షన్‌ మిగిలిపోతూ ఉంటుంది. అవి అంతకుముందు పట్టు ఉన్న పాఠాలే అయినా, లెక్క ప్రకారం చదవలేకపోయారు కాబట్టి, ఆ పాఠాలు తమకు ఒంటపట్టలేదనే భావనలో ఉండిపోతారు. ఇలా ఆందోళనకు లోనవకుండా ఉండాలంటే పరీక్షలకు ఎంతో ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధపడాలి. అలాగే ఒకసారి ప్రిపేర్‌ అయి ఉంటే, అంతకుమించి మరో ప్రిపరేషన్‌ అవసరం లేదు. ఇలా చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. 


ప్లానింగ్‌: కష్టమైన సబ్జెక్టును చివరికి నెట్టేసి, తేలికైన సబ్జెక్టును ముందు చదివేస్తూ ఉంటారు. ఇలా చేస్తే కష్టమైన సబ్జెక్టు ఎప్పటికీ కష్టంగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది. అలాగే ‘నాకు మ్యాథ్స్‌ రాదు, నాకు సైన్స్‌ రాదు’ అనే స్థిరమైన ఆలోచనతో పరీక్షలకు సిద్ధపడడం సరి కాదు. వాటికి ప్రథమ స్థానం కేటాయించి సిద్ధపడాలి. అన్ని సబ్జెక్టులనూ సమమైన ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటే తప్పక మెరుగైన ఫలితం సాధించగలుగుతారు. 


పెర్ఫార్మెన్స్‌: పరీక్ష హాల్లో అవసరం లేని భయానికీ, ఆందోళనకూ గురైతే, హఠాత్తుగా మతిమరుపునకు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. చదివిన పాఠాలేవీ సమయానికి గుర్తుకురావు. కాబట్టి ఒత్తిడిని మొదట వదిలేయాలి. ఎంత బాగా సిద్ధపడినా చదవని ప్రశ్నలు కూడా పరీక్షల్లో ఎదురవుతాయనే వాస్తవాన్ని మనసులో పెట్టుకుని పరీక్ష హాల్లోకి అడుగు పెట్టాలి. ప్రశ్నాపత్రంలో తెలియని ఒకటి, రెండు మార్కుల ప్రశ్నలు చూసి ఒత్తిడికి లోనయితే, మిగిలిన 80 మార్కుల ప్రశ్నల జవాబులు రాయలేక గందరగోళానికి లోనవుతారు. కాబట్టి స్థిమితంగా కూర్చుని, తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు రాసి, చివర్లో తెలియని ప్రశ్నల గురించి ఆలోచన చేయాలి. తెలిసినవి మొదట రాస్తే సహజంగా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 


తల్లితండ్రులు ఇలా నడుచుకోవాలి!

‘పరీక్షల్లో నెగ్గితేనే జీవితం. లేదంటే విలువైన విద్యాసంవత్సరం వృథా’ అనే ధోరణిలో తల్లితండ్రులు పిల్లలతో వ్యవహరించకూడదు. ఇలాంటి ప్రవర్తన పిల్లల్లో ఒత్తిడిని పెంచుతుంది. ‘నీ వరకు నువ్వు కష్టపడి చదివావు, ఫలితం నీ చేతుల్లో ఉండదు. కాబట్టి సాధ్యమైనంత బాగా పరీక్షలు రాయి. ఫలితం ఎలా వచ్చినా మేము అంగీకరిస్తాం’ అనే చందంగా అందరు తల్లితండ్రులు నడుచుకోవాలి. ఇలాంటి మాటలతో పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. 


నిద్రలేమి!

పరీక్షల వేళ పిల్లల్లో ఒత్తిడి సహజం. ఆ ప్రభావంతో ఆకలి మందగిస్తుంది. ఫలితంగా సరిపడా పోషకాలు అందక, వ్యాధినిరోధకశక్తి కుంటుపడుతుంది.  దాంతో రాత్రుళ్లు నిద్ర పట్టదు. నిద్రలేమితో పలు శారీరక సమస్యలూ మొదలవుతాయి. దాంతో తేలికగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడతారు. దాంతో నిద్ర పట్టని పరిస్థితి తలెత్తుతుంది. అందువల్ల పరీక్షలకు చాలా ముందునుంచే పిల్లలకు పౌష్ఠికాహారం విషయంలో శ్రద్ద చూపడం చాలా అవసరం. ఆహారంలో పోషకాల లోపమేమీ లేకపోయినా నిద్రలేమి ఉంటే, అది పూర్తిగా మానసిక అంశం అవుతుంది. పరీక్షల తాలూకు ఒత్తిళ్లు, భయాందోళలనలను తగ్గించడానికి అవసరమైతే మానసిక నిపుణులను కలవవచ్చు.


తలనొప్పి!

పరీక్షల సమయంలో తలనొప్పికి నిద్రలేమి ప్రధాన కారణం. దీనికి ‘డోలో’ మాత్ర ఇస్తే తగ్గిపోతుంది. అవసరాన్ని బట్టి ఒకటి రెండు సార్లు ఇవ్వవచ్చు. అప్పటికీ తగ్గకపోతే, డాక్టర్‌ను సంప్రతించడం తప్పనిసరి! ఒకవేళ మైగ్రేన్‌ తలనొప్పి అయితే, మైగ్రేన్‌ మందులు ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మంది పిల్లల్లో దృష్టి లోపాల వల్ల కూడా తలనొప్పి రావచ్చు. అంతకుముందు నుంచే ఆ సమస్య ఉన్నా, పరీక్షల సమయంలో రెట్టింపు ఒత్తిడి ఉండడం వల్ల తలనొప్పి రావచ్చు. ఈ స్థితిలో నేత్ర వైద్యుడిని  కలవడమే పరిష్కారం. 


గుండె దడ!

చదువు తాలూకు ఒత్తిడితో కూడా పిల్లల్లో గుండె దడ రావచ్చు. ఒళ్లంతా చెమటలు పట్టవచ్చు. సాఽధారణంగా ఈ ఒత్తిడి కొద్ది సేపట్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ ఆ దడ ఎక్కువ సేపు ఉంటే దాన్ని తీవ్రంగానే పరిగణించాలి. కొంత మంది పిల్లల గుండె దడకు నిద్రలేమి కూడా కారణం కావచ్చు. పిల్లల్లో థైరాయిడ్‌ సమస్యతో కూడా గుండె దడ రావచ్చు. కొంత మంది పిల్లల్లో బాల్యం నుంచే గుండెకు సంబంధించిన  సమస్య ఏదైనా ఉండవచ్చు. ఈ విషయంలో సొంత వైద్యానికి పోకుండా వెంటనే డాక్టర్‌ను కలవాలి.


వాంతులు...

ఒత్తిళ్లతో కొందరు పిల్లలకు ఆకలి మందగిస్తే, మరికొందరికి ఆకలి పెరుగుతుంది. ఈ రెండూ పరీక్షల సమయంలో పిల్లలను ఇబ్బందిపెట్టేవే! అతిగా తింటే మలబద్ధకం, ఇన్‌ఫెక్షన్లు తప్పవు. కడుపు ఉబ్బరంతో పాటు, వాంతులూ అవవచ్చు. కాబట్టి అవసరాన్ని బట్టి వైద్యులను కలవాలి. అలాగే మలబద్ధకాన్ని నిరోధించడానికి పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే పండ్లు ఇవ్వాలి. చల్లని పదార్థాలకు దూరంగా ఉంచాలి. గోరు వెచ్చని నీళ్లు తాగనివ్వాలి


జ్వరం!

విపరీతమైన ఆందోళనతో ఒత్తిడికి లోనై పరీక్షల సమయంలో పిల్లలకు జ్వరం రావచ్చు. ఇలాంటప్పుడు జ్వరం తగ్గే మాత్రలతో పాటు, మానసకి స్థయిర్యం పెంచేలా పిల్లలతో వ్యవహరించాలి.


ఒంటి నొప్పులు!

పరీక్షల వేళ కొంత మంది పిల్లలు ఒంటి నొప్పులతో బాధపడుతుంటారు. దీనికి శరీరంలో విటమిన్లూ, లవణాలూ తగ్గడం కారణం కావచ్చు. ఇలాంటి వారికి పండ్లు తరచూ ఇవ్వాలి. నూనె పదార్థాలను ఆపేయాలి. నిద్రలేమితో ఆహారం పూర్తిగా జీర్ణం కాక పోషకాల శోషణ జరగదు. ఫలితంగా కూడా ఒంటి నొప్పులు రావచ్చు. కాబట్టి విటమిన్లు, ఖనిజ లవణాలు లభించే పండ్ల రసాలు ఇస్తే మేలు. పరీక్షల తరుణంలో, రాత్రి పూట 8 గంటల లోపే భోజనం ముగించేలా చూడటం కూడా అవసరమే! అలా తినడం వల్ల ఆహారపదార్థాలు పూర్తి స్థాయిలో జీర్ణమై, మొత్తం పోషకాలు ఒంటపడతాయి.


- డాక్టర్‌ నవోదయ్‌ గిల్లా,

కన్సల్టెంట్‌ ఇంటర్నల్‌ మెడిసిన్‌, హైదరాబాద్‌.పరీక్షలకు ఒక్క రోజు ముందు...

పరీక్షలకు ప్రిపరేషన్‌ ఎంత అవసరమో, రిలాక్సేషన్‌ కూడా అంతే అవసరం. ఇందుకోసం....


రాత్రి మేలుకోవడం: పరీక్షకు ముందు రోజు రాత్రి ఎక్కువ సమయం చదవడం అనవసరం. మెదడు చురుగ్గా పనిచేయడానికి, జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండడానికీ కంటి నిండా నిద్ర ఎంతో అవసరం.


ఆహారం: సమయం వృథా అవుతుందనీ, వాంతి వచ్చేస్తుందనీ తినకుండా ఉండడం సరి కాదు. నిజానికి పరీక్షల రోజుల్లో మిగతా రోజుల కన్నా ఎక్కువగా క్యాలరీలు అవసరం అవుతాయి. కాబట్టి పౌష్ఠికాహారం తీసుకోవాలి. దాంతో మెదడుకు అవసరమైన గ్లూకోజ్‌ అంది చురుగ్గా ఉంటుంది. 


స్టడీ బ్రేక్స్‌: అదే పనిగా గంటలతరబడి చదవకుండా, మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే మెదడు అలసిపోదు. 


ఆందోళనలు: పరీక్షకు ముందు రోజు తగాదాల్లో తలదూర్చడం, ఉద్రేకానికి కారణమయ్యే ఎడ్రినలిన్‌  హార్మోన్‌ను పెంచే భయంకరమైన వార్తలు చూడడం, చదవడం సరికాదు.


ఇలా ఎదుర్కోవాలి

పరీక్షల ముందు వరకూ చలాకీగా చదువుకునే పిల్లలు ఒక్కోసారి హఠాత్తుగా డీలా పడతారు. నిద్రలేమి, అజీర్తి, జ్వరం లాంటి ఇబ్బందులకు లోనవుతారు. ఇలాంటప్పుడు మూల కారణాలను కనిపెట్టి, తదనుగుణంగా వారికి ఆసరా అందించాలి.


పరీక్ష హాల్లో....

ప్రశ్నాపత్రం తీసుకున్న వెంటనే సమాధానాలు రాయడానికి పరుగులు పెట్టకుండా శ్వాస, గుండె వేగం, కండరాలు రిలాక్స్‌డ్‌గా ఉన్నాయో, లేదో గమనించుకోవాలి. అవి వేగంగా ఉంటే, నెమ్మదించేవరకూ కొన్ని నిమిషాల సమయం తీసుకోవాలి.


రెండు నిమిషాల పాటు కళ్లు మూసుకుని, ముక్కు ద్వారా శ్వాస పీల్చుకుని, నోటి ద్వారా వదిలేస్తూ ఉండాలి. శ్వాస పీల్చుకునేటప్పుడు కండరాలు బిగపడుతూ, వదిలేటప్పుడు కండరాలు రిలాక్స్‌ చేయాలి.


- డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి,

సైకాలజిస్ట్‌, హైదరాబాద్‌.

Advertisement

పిల్లల సంరక్షణమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...