పక్కాగా బడి బయట పిల్లల సర్వే

ABN , First Publish Date - 2022-05-13T05:57:59+05:30 IST

బడిఈడు పిల్లలు పాఠశాలల్లో చేరేలా విద్యాశాఖధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఏటా వివిధ కారణాలతో మధ్యలో పాఠశాలలకు దూరమైన వారు, బడి ఈడు కలిగి పనులు చేసుకుంటున్న వారి వివరాలను సేకరించి, వారిని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

పక్కాగా బడి బయట పిల్లల సర్వే
బడి బయట పిల్లల సర్వే చేపడుతున్న విద్యాశాఖ సిబ్బంది

- చదువుకు దూరమవుతున్న బాలలు

- ఇటుక బట్టీలు, కూలి పనులు, వ్యాపారుల వద్దే మగ్గుతున్న బాల్యం

- జిల్లా వ్యాప్తంగా సీఆర్‌పీలతో సర్వే

- సర్వే వివరాలను ప్రభంద్‌, ఐఎస్‌ఎన్‌ఎస్‌ పోర్టల్‌లో నమోదు

- తల్లిదండ్రులకు, చదువు మానేసిన విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్న విద్యాశాఖ

- బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు


కామారెడ్డి టౌన్‌, మే 12: బడిఈడు పిల్లలు పాఠశాలల్లో చేరేలా విద్యాశాఖధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. ఏటా వివిధ కారణాలతో మధ్యలో పాఠశాలలకు దూరమైన వారు, బడి ఈడు కలిగి పనులు చేసుకుంటున్న వారి వివరాలను సేకరించి, వారిని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కరోనా ప్రభావంతో రెండు సంవత్సరాల్లో సర్వేకు ఆటంకం ఏర్పడింది. గతేడాది ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల హాజరు మెరుగుపడేందుకు చాలా సమయం పట్టింది. ఎట్టకేలకు ఈ ఏడాది జనవరిలో గత విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్వే నిర్వహించాలని తెలంగాణ సమగ్ర శిక్ష అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఈ సర్వేగతేడాది మే నెలలో నిర్వహించాల్సి ఉండగా కొవిడ్‌ ప్రభావంతో ముందడుగు పడలేదు. జనవరిలో నిర్వహించిన సర్వేలో మొత్తం 446 మంది బడి బయట పిల్లలను గుర్తించారు. ఇందులో 6-14 ఏళ్ల లోపు వయస్సు వారు 176,  15-19 ఏళ్ల లోపు వయస్సు వారు 268 మంది ఉన్నట్లు విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

31 వరకు సర్వే..

రైట్‌ టూ ఎడ్యుకేషన్‌ చట్టం ప్రకారం 6-14 ఏళ్ల పిల్లలకు ప్రభుత్వం ఉచిత నిర్బంధవిద్యను అందిస్తోంది. అయినా చాలా మంది తల్లిదండ్రులు తమ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేక జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడంతో పిల్లల చదువు మధ్యలోనే మాన్పించేస్తున్నారు. పిల్లలు కూడా తల్లిదండ్రులు పనిచేసే చోటే ఉంటూ బడికి దూరమవుతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రతీ మండలం, నివాస ప్రాంతం, ఇల్లును క్షేత్రస్థాయిలో సందర్శించి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నెల 5 నుంచి 31 వరకు సర్వే నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. కొవిడ్‌ పరిస్థితులతో బడి మానేసిన వారు, బాలకార్మికుల వివరాలు సేకరించనున్నారు. ఎంఈవోలు, క్లస్టర్‌ రిసోర్స్‌పర్సన్‌లకు సర్వే బాధ్యతలు అప్పగించారు. సీఆర్‌పీలు ఇంటింటికి వెళ్లి బడికి దూరంగా ఉంటున్న రెండు విభాగాల పిల్లల వివరాలు నమోదు చేస్తున్నారు. ఈ సర్వేకు సంబంధించి ప్రతిరోజూ జిల్లా విద్యాశాఖ అధికారికి నివేదిక అందించాల్సి ఉంటుంది. ఈనెల 31 వరకు సర్వే పూర్తిచేసి ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా వివరాలు సమగ్రంగా సేకరించామని ధ్రువీకరణ పత్రం అందించాల్సి ఉంటుంది. కాగా  ఏటా నూతన విద్యాసంవత్సరం ప్రారంభంలో ఈ సర్వేను చేపడుతారు. జిల్లాలో ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన వారితో పాటు నిరుపేదల కుటుంబాలే ఎక్కువ. పేదకుటుంబాలకు చెందిన బాలలు బడికి వెళ్లాల్సిన సమయంలో బయట కన్పిస్తున్నారని విద్యాశాఖధికారులు పేర్కొంటున్నారు.

ప్రబంధ్‌ పోర్టల్‌, ఐఎస్‌ఎన్‌ఎస్‌లో వివరాల నమోదు

ఈ ఏడాది జనవరిలో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించిన సర్వే వివరాలతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న సర్వే వివరాలను కూడా కేంద్ర ప్రభుత్వ ప్రబంధ్‌ పోర్టల్‌లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చైల్డ్‌ఇన్‌ఫో(ఐస్‌ఎన్‌ఎస్‌)లో నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. గతంలో సేకరించిన వివరాలను మండల స్థాయిలో ఎంఐఎస్‌ల ఆధ్వర్యంలో ఆన్‌లైన్‌లో నమోదు చేయడంతో పాటు ప్రస్తుతం సర్వేను కొనసాగిస్తూ వివరాలు సేకరించే పనిలో సీఆర్‌పీలు నిమగ్నమయ్యారు. గతేడాదికి సంబంధించిన సర్వే వివరాలను ఈనెల 20 వరకు పోర్టల్‌లో నమోదు చేసేందుకు గడువు ఇచ్చారు. సర్వేలో గుర్తించి 6-14 సంవత్సరాల వారిని ప్రభుత్వ పాఠశాలల్లో, 15-19 సంవత్సరాల వారిని సార్వత్రిక పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

పని చేసే చోటే ఎక్కువ

జిల్లాలో ఎక్కువగా ఇటుక బట్టిలు, ఇనుప వస్తువులు తయారీదారులు, రోడ్డుసైడ్‌ వ్యాపారం చేసే వారి వద్ద పనిచేసే వారు ఎక్కువగా ఉన్నారు. మహారాష్ట్ర, బిహార్‌, ఒడిశా, యూపీ రాష్ట్రాల నుంచి కూలి పనుల కోసం వలస వస్తుంటారు. స్థానికంగా వ్యవసాయ కూలీలుగా, ఇటుక బట్టీలు, పౌలీ్ట్రఫారంలు, భవన నిర్మాణ రంగంలో ఉపాధి పనులు చేస్తుంటారు. దీంతో బడిమానేసిన వారిలో వీరి పిల్లలే ఎక్కువగా ఉంటారు. ముఖ్యంగా ఇటుక బట్టిలు, పంట చేన్లలో, ఇనుప వస్తువుల తయారీ, అమ్మకాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులు బడిబాట పట్టే అవకాశాలు ఉన్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ఈ అంశంపైన సైతం దృష్టి సారిస్తామని పిల్లలను బడిబయట ఉంచకుండా చూడాలని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తునట్లు విద్యాశాఖధికారులు పేర్కొంటున్నారు.


బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి

- రాజు, డీఈవో, కామారెడ్డి

బడి బయట బాల్యం ఉండకూడదనే ప్రభుత్వం 6-14 ఏళ్ల వయస్సు గల పిల్లలను ఉచిత నిర్బంధ విద్యను అందజేస్తోంది. ప్రతీఏటా ఈ సర్వే నిర్వహిస్తున్నా.. పనులు చేస్తున్న చోటే పిల్లలు ఎక్కువగా బడులకు వెళ్లకుండా కనిపిస్తున్నారు. వారిని గుర్తించేందుకు సీఆర్‌పీల ద్వారా సర్వే నిర్వహిస్తున్నాం. జిల్లాలో ఈనెల 5 నుంచి 31 వరకు ఈ సర్వే కొనసాగనుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను బడులకు పంపేందుకు సహకరించాలి.

Read more