తీవ్రమవుతున్న పశుగ్రాసం కొరత

ABN , First Publish Date - 2022-05-03T05:48:16+05:30 IST

తీవ్రమవుతున్న పశుగ్రాసం కొరత

తీవ్రమవుతున్న పశుగ్రాసం కొరత
ట్రాక్టర్‌లు, డీసీఎంలు, లారీలలో తరలుతున్న పశుగ్రాసం


  • ట్రాక్టర్లు, డీసీఎంలలో తరలుతున్న గడ్డి           
  • ట్రాక్టర్‌ గడ్డికి రూ. 8వేలు 

పశుగ్రాసం కొరత  తీవ్రమౌతోంది. ఓ వైపు మండుతున్న ఎండలు మరో వైపు పశుగ్రాసం సమస్యతో  పశువులు అల్లాడుతున్నాయి. ప్రభుత్వం వరిసాగు చేయవద్దని విస్త్రత ప్రచారం చేయడంతో రైతులు ఈసారి ఎక్కువగా వరి పంటపై దృష్టిసారించలేదు.  దీంతో  పశువులు గ్రాసం కోసం అల్లాడుతున్నాయి. 

మేడ్చల్‌, మే2:  మేడ్చల్‌ ప్రాంతం నగరానికి కూతవేటు దూరంలో ఉండటంతో వ్యవసాయ పొలాలు ఎక్కువగా రియల్‌ భూములుగా మారిపోయాయి. ఉన్న కాస్తో కూస్తో గ్రామాల్లో ఎక్కువగా ఆరుతడి పంటలపైనే రైతులు ఆధారపడుతారు. మేడ్చల్‌ ప్రాంతంలో వ్యవసాయ ఆధారిత కుటుంబాలు తక్కువగా ఉన్నా పాడిపరిశ్రమ ఎక్కువగానే ఉంది. దీంతో పశుగ్రాసం కోసం డిమాండ్‌ ఉంటుంది.  దీంతో  రైతులు, పాడి వ్యాపారులు పశుగ్రాసం కోసం పక్క జిల్లాలను ఆశ్రయించాల్సి వస్తోంది. దాదాపు వంద, 150 కిలోమీటర్ల దూరం  ఉన్న మెదక్‌, నిజామాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల నుంచి ట్రాకర్ల ద్వారా పశుగ్రాసాన్ని తెచ్చుకుంటున్నారు.  ట్రాక్టర్‌ ఎండుగడ్డి 8 వేలు పలుకుతుంది. పైగా ట్రాక్ట్‌ర్‌ కిరాయి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. (ట్రాక్టర్‌లో మోపులైతే 45, కట్టలైతే 60 నుండి 70 కట్టలు ఉంటాయి.) పాడి రైతులు ప్రస్తుతం పచ్చి మేత దిగుబడి కూడా తక్కువగా ఉండటంతో దూర ప్రాంతాల నుంచి ఎండు గడ్డిని తెప్పిస్తున్నారు. ఇదే అదనుగా పరిసర జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ఎండుగడ్డి ధరకు అమాంతంగా ధరను పెంచేశారు. అయినాసరే తప్పనిసరి పరిస్థితుల్లో ఎండు గడ్డిని దిగుమతి చేసుకుంటున్నారు. రానున్న రోజుల్లో  గ్రాసం ధర మరింతగా పెరిగే అవకాశముందని రైతులు  వాపోతున్నారు.  పాడి పరిశ్రమను కాపాడుకోవడానికి ఎంత ధరైనా చెల్లించి ఎండు గడ్డిని కొనాల్సి వస్తుందని పాడి వ్యాపారులు వాపోతున్నారు. గ్రామాల్లో రైతులు వరి పొలాల కోతకు యంత్రాలను ఉపయోగిస్తున్నారని కొందరు రైతులు మాత్రమే వరిగడ్డి కోసం యంత్రాలను ఉపయోగించకుండా కూలీల ద్వారా కోస్తుండటంతో గడ్డికి డిమాండ్‌ పెరిగిందని పాడి రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం కూడా ప్రత్యామ్నాయంగా ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేద న వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఎండుగడ్డి కొరత తీవ్రతరం కాకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

పరిసర జిల్లాల నుంచి తెప్పిస్తున్నాం

వేసవిలో పశువులకు గ్రాసం కోసం ఇబ్బందులు ఎదురౌతున్నాయి. నగరశివారులో వ్యవసాయం తక్కువగా ఉండటంతో పశుగ్రాసం కోసం పరిసర జిల్లాలపై ఆధారపడాల్సి వస్తోంది. మెదక్‌, కామారెడ్డి, నల్గొండ జిల్లాల నుంచి ట్రాక్టర్లు, డీసీఎంల ద్వారా తెప్పిస్తున్నాం. ఒక్కో పశువుకు రోజుకు ఒక్కో కట్ట వేయాల్సి వస్తోంది.. మరో రెండు నెలల పాటు పశుగ్రాసం కోసం తిప్పలు తప్పవు. మరోవైపు పాల దిగుబడి కూడా తగ్గింది.

                                                                          - పెంటయ్య, గౌడవెల్లి, పాడిరైతు 

Read more