Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడు వసూళ్లేంటి?

యరపతినేని శ్రీనివాసరావు

పిడుగురాళ్ల, డిసెంబరు5: ఒక్క ఇల్లు నిర్మించలేని వైసీపీ ప్రభుత్వం ఎప్పుడో కట్టిన ఇళ్లకు ఇప్పుడొచ్చి మేళా పేరుతో డబ్బులు వసూలు చేడయం ఏంటని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. ఆదివారం పిడుగురాళ్ల పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు హయాంలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పక్కా గృహం మంజూరైందన్నారు.  టీడీపీ హయాంలో గురజాల నియోజకవర్గంలో 6వేల ఇళ్లు మంజూరు చేయగా, టిడ్కో పథ కంలో మరో 6వేల ఇళ్లు 90శాతం పనులు పూర్తిచేశామన్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పదిశాతం పనులు పూర్తిచేయకుండానే కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో బకాయిల పేరుతో విద్యుత్‌ ను తొలగిస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ లోపం వల్ల విపత్తును ముందుగానే గుర్తించలేక ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటే పదిరోజుల తరువాత పరామర్శలకు వెళ్లటం సిగ్గుచేటన్నారు. యురేనియం నిల్వల కోసం వైసీపీ ప్రభుత్వం జరిపిన తవ్వకాల వల్లే ప్రాజెక్టు బలైందని యరపతినేని పేర్కొన్నారు. ఇప్పటివరకు అందరూ ముఖ్యమంత్రులు రూ.3.50లక్షల కోట్ల అప్పులు చేస్తే రెండేళ్లలో వైసీపీ ప్రభుత్వం రూ3.50లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. పరిశ్రమలు, ఉపాధి, రోడ్ల మరమ్మత్తులు, ఏమీ లేకుండానే లక్షల కోట్లు ఏమిచేశాడో సీఎం జగన్‌ రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు. అభయహస్తం, పొదుపు రుణాల మొత్తాన్ని కూడా ప్రభుత్వం లాగేసుకుందని తెలిపారు. వత్తిడి తెచ్చి డబ్బులు వసూలు చేయాలని చూస్తే లబ్ధిదారులతో కలసి నిరసన వ్యక్తం చేసేందుకు టీడీపీ సిద్ధంగా ఉందన్నారు. 

 

Advertisement
Advertisement