అక్రమ మైనింగ్‌పై ఆందోళన

ABN , First Publish Date - 2022-05-24T06:28:52+05:30 IST

అక్రమ మైనింగ్‌పై ఆందోళన

అక్రమ మైనింగ్‌పై ఆందోళన
రాఘవాపురంలో అక్రమ మైనింగ్‌ జరుగుతున్న కొండ వద్ద సోమవారం అర్ధరాత్రి బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

చీకట్లో నిరసనకు ఉపక్రమించిన మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

రాత్రంతా నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు

రాఘవాపురం కొండ వద్ద ఉద్రిక్త పరిస్థితులు


నందిగామ, మే 23 : అక్రమ మైనింగ్‌పై మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కన్నెర్రజేశారు. అధికార పార్టీ నాయకులు కొండలు కొల్లగొడుతూ, కోట్లాది రూపాయల అక్రమంగా సంపాదిస్తుంటే, అధికారులు ఏం చేస్తున్నారంటూ సోమవారం రాత్రంతా నిరసనకు దిగారు. అక్రమ మైనింగ్‌ను అరికట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఎన్ని రోజులైనా ఉద్యమం ఆపేది లేదని హెచ్చరించారు. మండలంలోని రాఘవాపురం కొండ  వద్ద జరుగుతున్న అక్రమ మైనింగ్‌ను సౌమ్య సోమవారం రాత్రి అడ్డుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అక్రమ మైనింగ్‌ జరుగుతుందన్న సమాచారంతో అక్కడికి చేరుకున్న ఆమెను చూసి ఎస్కవేటర్‌, మిషన్లు వదిలి లారీల డ్రైవర్లు పరారయ్యారు. వాహనాల ముందు బైఠాయించిన సౌమ్య అధికారులకు ఫోన్‌ చేశారు. ఆర్‌డీవో ఫోన్‌ స్పందించకపోవడంతో కలెక్టర్‌కు ఫోన్‌ చేశారు. ఏసీపీ నాగేశ్వరరెడ్డికి సమాచారాన్ని తెలియజేశారు. తక్షణమే ఘటనాస్థలానికి మైనింగ్‌, రెవెన్యూ అధికారులు వచ్చి చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో తాను కదిలేది లేదన్నారు. గతంలో పలుమార్లు ఇక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై సమాచారం ఇచ్చినా రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు పట్టించుకోలేదని మండిపడ్డారు. గ్రావెల్‌ తవ్వకాల్లో ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించకపోవడం హేయమన్నారు. మైనింగ్‌నే ఆదాయ వనరుగా మార్చుకున్న వైసీపీ నాయకులు కొండలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు జరిగిన అక్రమ మైనింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సౌమ్య డిమాండ్‌ చేశారు. దీనివెనుక ఉన్న పెద్దలను బయటపెట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. అంతవరకూ ఎన్ని రోజులైనా కొండను విడిచి వెళ్లేది లేదన్నారు. రాత్రయినా, ఎండైనా ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ప్రభుత్వానికి, అక్రమ మైనింగ్‌దారులకు వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. కటిక చీకట్లో సెల్‌ఫోన్‌ లైట్ల నడుమ రాత్రంతా ఆందోళన కొనసాగింది. కాగా, రాత్రి సమయంలో స్థానిక సీఐ వచ్చి ఆందోళన విరమించాలని కోరగా, అక్రమ మైనింగ్‌పై చర్యలు తీసుకోవాలని సౌమ్య పేర్కొన్నారు. తనకు ఆ అధికారం లేదని సీఐ చెప్పారు. స్థానిక తహసీల్దార్‌కు ఫోన్‌ చేయగా, తానేమీ చేయలేనని సమాధానమిచ్చారు. మైనింగ్‌ ఏడీకి మెసేజ్‌ పెట్టగా, అంతా ఫేక్‌ అని రిటర్న్‌ మెసేజ్‌ ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 



Updated Date - 2022-05-24T06:28:52+05:30 IST