Abn logo
Sep 23 2021 @ 23:55PM

రామకృష్ణారెడ్డి ఇంటి ముట్టడికి యత్నం

విలేకర్లతో మాట్లాడుతున్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

ఇంటి ముట్టడికి వచ్చిన నాయకులు
అనపర్తి, సెప్టెంబరు 23: మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పెడపర్తి సర్పంచ్‌ నల్లమిల్లి కాంతమ్మ మధ్య రెండు రోజులుగా జరుగుతున్న మాటల యుద్ధం గురువారం తారస్థాయికి చేరింది. రామకృష్ణారెడ్డి ఇంటి ముట్టడికి కాంతమ్మ పిలుపునివ్వడంతో అటు రామవరం, ఇటు పెడపర్తి గ్రామాల్లో పోలీసులు మోహరించారు.  రెండు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఐదు రోజుల క్రితం పెడపర్తిలో పోలీసులు స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్ల వ్యవహారం చిలికిచిలికి గాలివానగా మారింది. సుమారు రూ.కోటి విలువైన గుట్కాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేవలం ఐదు లక్షల సరుకును మాత్రమే లెక్కల్లో చూపారని, దీని వెనుక పెడపర్తికి చెందిన నాయకుల హస్తం ఉందని, నిగ్గు తేల్చాలని రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. దీనికి స్పందించిన కాంతమ్మ తమ కుటుంబం ఉన్నతమైనదని, నిందలు మోపడం సరికాదని... ఈ వ్యవహారంలో తన ప్రమేయం ఉందని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని, ఇందుకు 24 గంటల సమయం ఇస్తున్నానని బుధవారం సవాల్‌ విసిరారు. గురువారం మాజీ ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి అక్కడే తేల్చుకోవాని నిర్ణయం తీసుకోవడంతో రెండు గ్రామాల్లో టెన్షన్‌ మొదలైంది. ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంతమ్మ ముందుగానే తన నివాసం నుంచి బయటకు వచ్చి రామవరం పయనమైంది. పోలీసులు ఆమెను గ్రామ పొలిమేర్లలోనే అడ్డగించి వెనుదిరగాలని కోరారు. అందుకు ఆమె నిరాకరించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. చివరకు ఆమె రామచంద్రపురం డీఎస్పీతో ఫోనులో మాట్లాడారు. ఈ విషయంలో ఫిర్యాదు ఇస్తే చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో కాంతమ్మ అక్కడి నుంచి వెనుదిరిగారు. అనంతరం పెడపర్తిలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ 40ఏళ్ల రాజకీయ చరిత్రలో తమ కుటుంబంపై ఎటువంటి మచ్చ లేదని అన్నారు. నిజానిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలని, లేకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. కాంతమ్మకు సంఘీభావం తెలపడానికి అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

నన్ను హతమార్చేందుకే ఈ దాడులు:
మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం జరుగుతోందని, అన్యాయాలను ప్రశ్నించే తనపై దాడులకు ఎగబడుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. గురువారం తన ఇంటి ముట్టడి యత్నం అనంతరం ఆయన రామవరంలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే విచక్షణ లేకుండా పరుష పదజాలంతో మాట్లాడటం సరికాదని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని అన్నారు. వైసీపీ చేస్తున్న అవినీతిని అడ్డుకునేందుకు తానెప్పుడూ సిద్ధంగానే ఉంటానని, దేనికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. తనకు ప్రజాదరణ లేదని చెప్తున్న ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని, ప్రజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని చాలెంజ్‌ చేశారు. తన హయాంలో అవినీతి జరిగిందని ఎంక్వయిరీలు చేయిస్తున్నారన్నారు. దాంతో పాటు ఈ రెండున్నర సంవత్సరాలుగా జరుగుతున్న అవినీతిపైనా విచారణ చేయించుకుని ఎమ్మెల్యే తన సచ్ఛీలతను  నిరూపించు కోవాలన్నారు. కక్ష సాధింపు నైజాన్ని మానుకోవాలని సూచించారు.