మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం

ABN , First Publish Date - 2020-02-26T08:26:15+05:30 IST

వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు(67) ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్‌ చింతల్‌లో ఉంటున్న

మాజీ ఎమ్మెల్యే సంజీవరావు హఠాన్మరణం

  • సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి.. పలువురి నివాళి

వెంకటేశ్వరకాలనీ/ వికారాబాద్‌(ఆంధ్రజ్యోతి): వికారాబాద్‌ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు(67) ఆకస్మికంగా మృతి చెందారు. హైదరాబాద్‌ చింతల్‌లో ఉంటున్న ఆయన కొన్ని రోజులుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైన ఆయన్ను కుటుంబ సభ్యులు నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో మృతిచెందారు. సంజీవరావు మరణం పట్ల సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మంత్రి సబితారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, కాలె యాదయ్య, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తదితరులు నిమ్స్‌ ఆస్పత్రిలో సంజీవరావు మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. సంజీవరావుకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు లావణ్య, సుష్మా ప్రియాంక, ప్రియదర్శిని ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం స్వగ్రామమైన గేటువనంపల్లిలో సంజీవరావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చిన సంజీవరావు అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2018లో టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆయనకు టికెట్‌ నిరాకరించింది.

Updated Date - 2020-02-26T08:26:15+05:30 IST