ఉడత ఊపులకు భయపడేది లేదు..

ABN , First Publish Date - 2022-07-04T06:04:10+05:30 IST

కొంతమంది వైసీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఉడత ఊపులకు బెదిరేదిలేదని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు.

ఉడత ఊపులకు భయపడేది లేదు..
కొండపాటూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న నరేంద్రకుమార్‌ తదితరులు

అధికారులు, పోలీసులు ఆలోచించి పనిచేయాలి

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌

కాకుమాను, జూలై 3:  కొంతమంది వైసీపీ నాయకులు పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, ఉడత ఊపులకు బెదిరేదిలేదని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ స్పష్టం చేశారు. మండల కేంద్రం కాకుమానులో ఆదివారం సాయంత్రం ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ అధికారులు, పోలీసులు ఆలోచించి పనిచేయాలని సూచించారు. కాకుమాను వ్యవసాయ ఆధారిత మండలమని, ఇక్కడి ప్రశాంత వాతావరణానికి భగ్నం కలిగిస్తే టీడీపీ శ్రేణులు తిరగపడతారని హెచ్చరించారు. మంత్రివర్గంలో బుగ్గన, పెద్దిరెడ్డి, బొత్స, మరి కొంతమందిని కొనసాగించి మేకతోటి సుచరితను తొలగించడానికి కారణం చెప్పాలన్నారు. సామర్ధ్యం లేదా లేక ఆమె అవినీతి పరురాలా అనే విషయం వైసీపీ ప్రభుత్వం ఈ నియోజకవర్గ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. చేబ్రోలు పంచాయతీలో రూ.200 కోట్లు, అలాగే నంబూరు పంచాయతీలో రూ.3కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఇంతవరకు నిధుల దుర్వినియోగం చేసిన వారిని పట్టుకోలేదని ప్రశ్నించారు. గ్రామాలలో తొలిసారిగా చెత్తపై పన్నువేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే దక్కుతుందన్నారు. కొన్ని వర్గాల వారికే రైతు భరోసా ఇవ్వడం కౌలు రైతులను మోసం చేయడమేనన్నారు. టీడీపీ గుంటూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు దార్శనికత ఎంతో గొప్పదని వివరించారు. రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. టీడీపీ తెలుగు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్‌ రాజకీయ పార్టీ స్థాపించినపుడు ఆయన కోసం రోజుల తరబడి ఎదురు చూసిన సంఘటనలు గుర్తు చేసుకున్నారు. తొలుత కొండపాటూరులో ఎన్టీఆర్‌ విగ్రమానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గింజుపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వీరయ్యఔదరి, మాజీ ఎంపీపీ శైలజ,  లక్ష్మారెడ్డి, కుర్రి సుబ్బారెడ్డి, భాగ్యారావు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సునీల్‌ చౌదరి, విక్రయాల సుబ్బారావు, నక్కల అగస్టీన్‌, మాణిక్యారావు, శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.   

 

Updated Date - 2022-07-04T06:04:10+05:30 IST