చంద్రబాబును నిర్బంధించడం దుర్మార్గపు చర్య : కాటంరెడ్డి

ABN , First Publish Date - 2021-03-03T04:15:48+05:30 IST

ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమానాశ్రయంలో నిర్బంధించడం దుర్మార్గపు చర్య అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కావలి ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు.

చంద్రబాబును నిర్బంధించడం దుర్మార్గపు చర్య : కాటంరెడ్డి
మాట్లాడుతున్న కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి

అల్లూరు, మార్చి 2 : ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును విమానాశ్రయంలో నిర్బంధించడం దుర్మార్గపు చర్య అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కావలి ఇన్‌చార్జి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జాతీయ నాయకుడు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు చేసే ప్రయత్నాన్ని పోలీసులు సహకారంతో నిలిపివేయడం సరైన పద్ధతి కాదన్నారు. పార్టీ అధ్యక్షుడినే ఈ విధమైన పరిస్థితులుకు గురిచేస్తే సాధారణ పౌరులు, పోటీ చేసే అభ్యర్థుల పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమైపోతుందన్నారు. జగన్మోహన్‌రెడ్డి ఆనాడు పాదయాత్ర చేసిన కాలంలో అప్పటి అధికార పార్టీపై విమర్శలు గుప్పించిన అంశాల్లో ప్రధానమైనవి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని పేర్కొన్నారు. అదే పరిస్థితి నాటికి నేటికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆమోదం తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం దాని ఏర్పాటుకు ఆనాడు పడిన శ్రమ, భూదానం, ప్రాణార్పణలు గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్‌ చంద్రబాబునాయుడును నిర్బంధించిన విషయమై స్పందించి అవసరమైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనంతరాజు బాలకృష్ణంరాజు, యరటపల్లి శేఖర్‌రెడ్డి, పప్పు సుధాకర్‌, బండి శ్రీనివాసులు, ఇస్మాయిల్‌, జగన్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-03T04:15:48+05:30 IST