Abn logo
Oct 21 2021 @ 00:43AM

రాష్ట్రంలో రాక్షసపాలన

పాడేరులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు

తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

వైసీపీ వాళ్ల అరాచకాలను పోలీసులు అడ్డుకోవడంలేదు

మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజం

పాడేరులో టీడీపీ బంద్‌ ప్రశాంతం

మూతపడిన విద్య, వ్యాపార సంస్థలు


పాడేరురూరల్‌, అక్టోబరు 20: ఒక్క అవకాశం ఇవ్వండంటూ ప్రజలను వేడుకొని అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి... రాష్ట్రంలో రాక్షసపాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై వైసీపీ నాయకులు దాడులు చేసినందుకు నిరసనగా పార్టీ అధిష్ఠానం పిలుపుమేరకు బుధవారం పాడేరులో బంద్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ నాయకుల అరాచకాలను పోలీసులు అడ్డుకోకుండా పరోక్షంగా మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. వైసీపీ పాలకులకు ప్రజలు బుద్ధిచెప్పే సమయం ఆసన్నమైందన్నారు. కాగా ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు బంద్‌ నిర్వహించారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు తెరుచుకోలేదు. అంతకుముందు కుమ్మరిపుట్టు నుంచి సినిమాహాలు సెంటర్‌ మీదుగా అంబేడ్కర్‌ కూడలి, మెయిన్‌ బజారు మీదుగా పీటీడీ కాంప్లెక్స్‌ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొర్రా నాగరాజు, పోలుపర్తి గోవిందరావు, గంగపూజారి శివకుమార్‌, బొర్రా విజయరాణి, రొబ్బి రాము, డిప్పల వెంకటకుమారి, డి.కుమారి, అల్లంగి సుబ్బలక్ష్మి, కూడి రామునాయుడు, కోడా వెంకటసురేశ్‌కుమార్‌, బుద్ద జ్యోతికిరణ్‌, బొర్రా మణికంఠరాజు, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.


రాష్ట్రంలో అరాచక పాలన: జ్ఞానేశ్వరి

చింతపల్లి, అక్టోబరు 20: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని వైసీపీ శ్రేణులు దాడులు చేయడం అమానుషమని టీడీపీ అరకు పార్లమెంట్‌ కార్యనిర్వాహక కార్యదర్శి చల్లంగి జ్ఞానేశ్వరి అన్నారు. బంద్‌లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాతబస్‌స్టాండ్‌ నుంచి హనుమాన్‌ జంక్షన్‌ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రధాన ప్రతిపక్షాన్ని నైతికంగా ఎదుర్కొలేని అధికార పార్టీ నాయకులు భౌతికదాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కిల్లో పూర్ణచందర్‌, కిముడు లక్ష్మయ్య, సరమండ శ్రీధర్‌, శెట్టి నాగేశ్వరరావు, రమణ, రీమల ఆనందరావు, పాంగి రాము, బేరా సత్యనారాయణ పడాల్‌, తదితరులు పాల్గొన్నారు. 


జీకేవీధిలో...

 వైసీపీ నేతలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయడం సరికాదని, టీడీపీ నాయకులపై దాడిని ప్రతి ఒక్కరు ఖండించాలని పార్టీ మండలాధ్యక్షుడు కొర్ర బలరామ్‌ అన్నారు. మండల కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికార పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో ముక్కలి మహేశ్‌, రమేశ్‌, మొట్టడం రామకృష్ణ, వండలం బాలయ్య, తదతరులు పాల్గొన్నారు. 


నిరసన తెలిపేందుకు అనుమతి కావాలా?

కొయ్యూరు: ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిరసన తెలిపేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం దారుణమని జీసీసీ మాజీ చైర్మన్‌ ఎంవీవీ ప్రసాద్‌ అన్నారు. మండల కేంద్రంలో బంద్‌ నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న వైసీపీ పాలకులకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే వుందని అన్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నాగేంద్ర, పోలీసులు అక్కడకు చేరుకుని టీడీపీ నేతలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కురుజు శ్రీనుబాబు, కొర్రు రామ్మూర్తి, బఖీర్‌ఖాన్‌, అనిశెట్టి చిరంజీవి, అప్పన వరహాలబాబు, తోట దొరబాబు, శ్యామల వరలక్ష్మి, మేడి బోయన్న, భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం 11 గంటల వరకు ఆర్టీసీ బస్సులు నడవలేదు. బంద్‌ నిర్వాహకులు దుకాణాలను మూయించగా, కొద్దిసేపటి తరువాత పోలీసులు వచ్చి వాటిని తెరిపించారు.


వైసీపీ పాలనలో ప్రజలకు రక్షణ లేదు

సీలేరు: తెలుగుదేశం పార్టీ నాయకుడు నక్కా తిరుమలరావు ఆధ్వర్యంలో సీలేరులో రాస్తారోకో నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ కార్యాలయాలు, పార్టీ నాయకుల ఇళ్లపై వైసీపీ వాళ్లు దాడులు చేయడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో బొర్ర కృష్ణ, వల్లి ప్రసాద్‌, చిటికెల రాము, తదితరులు పాల్గొన్నారు. 


జి.మాడుగులలో..

జి.మాడుగుల: మండల కేంద్రంలో టీడీపీ మండల అధ్యక్షుడు సోమెలి చిట్టిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్‌ విజయవంతమయ్యింది. వ్యాపారులు షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ప్రైవేటు వాహనాలు నడవలేదు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొర్రా పద్మ, టీడీపీ నాయకులు ఎం.వరహాలరాజు, పేతురు, రెహమాన్‌, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు కొండలరావు, భీంబాబు, నాగబ్బాయి, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.