‘రాజకీయ కక్షతోనే సోదాలు’

ABN , First Publish Date - 2021-07-25T13:41:29+05:30 IST

తన ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఏసీపీ సోదాలపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీమంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ స్పందించారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని, రాజకీయ కక్షతోనే అధికా

‘రాజకీయ కక్షతోనే సోదాలు’

  - నాకు స్వంత ఇల్లు కూడా లేదు!

  - మాజీ మంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌


పెరంబూర్‌(చెన్నై): తన ఇళ్లు, కార్యాలయాలపై జరిగిన ఏసీపీ సోదాలపై అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీమంత్రి ఎంఆర్‌ విజయభాస్కర్‌ స్పందించారు. తనకు సొంత ఇల్లు కూడా లేదని, రాజకీయ కక్షతోనే అధికార డీఎంకే సోదాలు చేయిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ నెల 22వ తేది చెన్నై, కరూర్‌లోని మాజీ మంత్రి ఇళ్లు, కార్యాలయాలు అని మొత్తం 26 ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. 14 గంటలకు పైగా జరిగిన ఈ తనిఖీల్లో రూ.25,56,600 నగదు సహా పలు దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనిపై విజయభాస్కర్‌ శనివారం కరూర్‌లో మీడియాతో మాట్లాడుతూ... రెండు రోజుల క్రితం చెన్నై, కరూర్‌ ప్రాంతాల్లోని తన ఇళ్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడిచేశారని, రాజకీయ కక్షతోనే డీఎంకే ఈ చర్యకు పాల్పడిందని ఆరోపించారు. దాడుల్లో స్వాధీనం చేసుకున్న నగదు, దస్తావేజులకు తగిన ఆధారాలున్నాయని, వాటిని చూపించనున్నామని తెలిపారు. ఇలాంటి తనిఖీలతో కరూర్‌లో పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు. ఇలాంటి దాడులు జరుగుతాయని తాము ముందే ఊహించామ న్నారు. ఈ దాడులను చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా వున్నామని తెలిపారు. చెన్నై, కరూర్‌లో తనకు స్వంత ఇల్లు లేదని, 35 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. అధికారం చేపట్టిన వెంటనే డీఎంకే ఇతర పార్టీల వారికి ఆశచూపి తమ పార్టీలో చేర్చుకొనే స్వార్థ్ధపూరిత రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. ముఖ్యంగా, రవాణా శాఖలో అన్నాడీఎంకే కార్మిక సంఘానికి చెందిన నేతలను బదిలీ చేస్తున్నారని, ఇలాంటి చర్యలు ప్రతి శాఖలోనూ నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. ముగిసిన సోదాల నేపథ్యంలో, మీ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపజేశారా? అనే విలేఖరుల ప్రశ్నకు, ఆ వార్తల్లో వాస్తవం లేదని, తమ బ్యాంకు ఖాతాలు స్తంభింపజేయలేదని విజయభాస్కర్‌ సమాధానమిచ్చారు.

Updated Date - 2021-07-25T13:41:29+05:30 IST