- రూ.110 కోట్ల డిపాజిట్లను స్తంభింపజేయాలని ప్రత్యేక కోర్టు ఆదేశం
చెన్నై: అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి కుటుంబీకులు, సన్నిహితుల పేర్లతో వున్న రూ.110 కోట్ల బ్యాంక్ డిపాజిట్లను స్తంభింపజేయాలని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఎస్పీ వేలుమణి తన సన్నిహితులకు, బంధువులకు చెందిన సంస్థలకు పలు రాయితీలు కల్పించి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు చెలరేగిన విషయం తెలిసిందే. చెన్నై, కోయంబత్తూరు కార్పొరేషన్లలో తన సన్నిహితులకు పలు కాంట్రాక్టులను కేటాయించినట్లు కూడా తేలింది. దీంతో ఏసీబీ అధికారులు గత ఏడాది ఆగస్టులో వేలుమణి, ఆయన సన్నిహితులు నివాసగృహాలు, కార్యాలయాలు సహా 63 చోట్ల ఒకే సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఆ సందర్భంగా పలు కీలకమైన దస్తావేజులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వేలుమణి సన్నిహితులకు చెందిన కేసీపీ ఇన్ఫ్రా లిమిటెడ్, ఆలమ్ గోల్డ్ డైమండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై ఏసీబీ అధికారులు ఆరా తీశారు. ఆ రెండు సంస్థలు రూ.100 కోట్లకు పైగా డిపాజిట్లు కలిగి ఉన్నాయని, ఆ నగదుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలేవీ లేవని తెలుసుకున్నారు. ఆ నగదును జప్తు చేసుకునేందుకు ఏసీబీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుసుకున్న ఆ సంస్థ నిర్వాహకులు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ సంస్థల బ్యాంకు ఖాతాల్లో ఉన్న నగదును స్తంభింపజేయకూడదంటూ పిటిషన్లో కోరారు. ఆ పిటిషన్పై విచారణ సమయంలో రెండు సంస్థలు అక్రమంగా ఆస్తులు సంపాదించినట్లు తేలింది. దీంతో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జే ఓంప్రకాష్ ఆ రెండు సంస్థలకు చెందిన రూ.110 కోట్లను స్తంభింపజేయాలని మంగళవారం ఆదేశించారు.
ఇవి కూడా చదవండి