అరాచక పాలనను అంతమొందించాలి

ABN , First Publish Date - 2021-10-21T06:07:33+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు.

అరాచక పాలనను అంతమొందించాలి
రాస్తారోకో చేస్తున్న కిడారి శ్రావణ్‌, అబ్రహం, దాసుబాబు, తదితరులు

వైసీపీ దాడులను పోలీసులు అడ్డుకోకపోవడం దారుణం

మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌ ధ్వజం

అరకులోయలో బంద్‌ విజయవంతం


అరకులోయ, అక్టోబరు 20: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో అరాచక పాలన సాగుతోందని, టీడీపీ కార్యాలయాలు, పార్టీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ అన్నారు. బుధ వారం టీడీపీ నాయకులతో కలిసి స్థానిక నాలుగురోడ్ల జంక్షన్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు చేయడం గతంలో ఎన్నడూ లేదని, వైసీపీ పాలకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని, ఈ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ వారి ఆగడాలను పోలీసులు అడ్డకోకపోవడం అన్యాయమని అన్నారు. కాగా టీడీపీ బంద్‌ పిలుపుతో వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసి వేశారు. వాహనాల రాకపోకలను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. 11.30 గంటల ప్రాంతంలో సీఐ, ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది వచ్చి శ్రావణ్‌కుమార్‌తోపాటు పార్టీ నాయకులు అబ్రహం, దాసుబాబు, బాబురావు, రమేశ్‌, అమ్మన్న, మహదేవ్‌, సొనాయి కృష్ణారావు, బూర్జ లక్ష్మి, అరుణకుమారి, ఇచ్చావతి, ద్రౌపతి, తదితరులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


ముంచంగిపుట్టులో...

ముంచంగిపుట్టు: తెలుగుదేశం నాయకులు స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో రాస్తారోకో చేశారు. టీడీపీ కార్యాలయాలపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వ్యాపారులు స్వచ్ఛందగా దుకాణాలను మూసివేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జి.రామ్మూర్తి, ఎ.తిరుపతి, కె.బలరామ్‌, వి.లక్ష్మణ్‌, జగత్‌రాయ్‌, చిన్నా, బాబూజీ, జి.కృష్ణ, జి.ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు.


బొర్రాలో...

అనంతగిరి: తెలుగుదేశం పార్టీ నాయకులు బొర్రా జంక్షన్‌లో సుమారు రెండు గంటలపాటు బంద్‌ నిర్వహించి దుకాణాలను మూయుంచారు. బొర్రా గుహలు ఎదుట ఆందోళన చేసి, మధ్యాహ్నం 12 గంటల వరకు తెరవనివ్వలేదు. అరాచక పాలన చేస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రపతి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కొట్యాడ అప్పారావు, బుజ్జిబాబు, టి.ఆనందరావు, జోగులు, సోము, దొన్ను, తదితరులు పాల్గొన్నారు. 


డుంబ్రిగుడలో...

డుంబ్రిగుడ: మండల కేంద్రంతోపాటు అరకు సంతబయలు, కించుమండ గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు మధ్యాహ్నం వరకు నడవలేదు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌, టీడీపీ మండల అధ్యక్షుడు టి.సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-21T06:07:33+05:30 IST