సర్వసభ్య సమావేశంలో పాల్గొనకుంటే ఏమీ కాదు..

ABN , First Publish Date - 2022-06-16T18:02:28+05:30 IST

అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీకి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. త్వరలో జరుగనున్న అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో

సర్వసభ్య సమావేశంలో పాల్గొనకుంటే ఏమీ కాదు..

                          - Rajendra balajiకి షాకిచ్చిన సుప్రీంకోర్టు 



అడయార్‌(చెన్నై), జూన్‌ 15: అన్నాడీఎంకే సీనియర్‌ నేత, మాజీ మంత్రి రాజేంద్ర బాలాజీకి సుప్రీంకోర్టు గట్టి షాకిచ్చింది. త్వరలో జరుగనున్న అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశంలో మీరు (రాజేంద్ర బాలాజీ) పాల్గొనపోతే ఏం కాదు’ అంటూ వ్యాఖ్యానించింది. పైగా ఈ జనరల్‌ బాడీ మీటింగ్‌లో పాల్గొనేందుకు తనకు ఐదు రోజుల బెయిల్‌ నిబంధనలు సడలించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను తోసిపుచ్చింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో ఈయన పాడిపరిశ్రమలు, విద్యుత్‌, హిందూ దేవాదాయ శాఖల మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత రూ.3 కోట్ల మోసం కేసులో ఆయనను విరుదునగర్‌ జిల్లా నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయకు పలు నిబంధనలతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. పాస్‌పోర్టును పోలీసులకు అప్పగించాలని, జిల్లా సరిహద్దులను దాటి వెళ్ళడానికి వీల్లేదని, పోలీసుల విచారణకు క్రమం తప్పకుండా హాజరుకావాలని ఇలా షరతులు విధించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొనేందుకు బెయిల్‌ నిబంధనలను ఐదు రోజుల పాటు సడలించాలని ఆయన సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. పైగా ఈ పిటిషన్‌పై అత్యవసర  విచారణ కింద దాఖలు చేశారు. దీంతో ఈ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్‌ జేకే మహేశ్వరి, హీమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేసింది. ‘పార్టీ సర్వసభ్య సమావేశంలో మీరు పాల్గొనకపోతే ఏం జరగదులే అని వ్యాఖ్యానిస్తూ ఈ పిటిషన్‌ను అత్యవసర విచారణగా స్వీకరించలేం’ అంటూ ధర్మాసనం పేర్కొంది. దీంతో రాజేంద్ర బాలాజీ పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొనలేని పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2022-06-16T18:02:28+05:30 IST