Abn logo
Jul 23 2021 @ 23:29PM

బిల్లుల నిలుపుదల దుర్మార్గం

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

చిలకలూరిపేట, జూలై 23: గత ప్రభుత్వంలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌, నీరు-చెట్టు పనులు చేసినవారికి 26 నెలలు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడం దుర్మార్గమని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలోని తన నివాసగృహంలో శుక్రవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేళ్లపాటు ప్రభుత్వం విజిలెన్స్‌ అని, నాణ్యత లేదని కుంటిసాకులు చెప్పిందన్నారు. రోడ్లు వేసినవారు రోడ్డున పడ్డారని, పనులు చేసినవారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో 4వ తరగతి ఉద్యోగులకైనా గౌరవం ఉంటుందేమో కానీ ఐఏఎస్‌, ఐపీఎస్‌లపై మాత్రం ప్రజల్లోగౌరవం లేదన్నారు. ఐఏఎస్‌లు ప్రాధాన్యం కలిగిన పోస్టుల కోసం ఎందుకు ఉన్న గౌరవాన్ని తగ్గించుకుంటున్నారని ప్రశ్నించారు. 14వ ఆర్థికసంఘం నిధులు సర్పంచ్‌లకు తెలియకుండా ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల కింద లాగేసుకోవడం దారుణమని విమర్శించారు. రైతులు అమ్ముకున్న ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేయాలని  డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 2.64లక్షల ఇల్లు నిర్మించామని, జగనన్న కాలనీలలో ఇళ్లు నిర్మించేలోపు గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలన్నారు. తనపై బురదజల్లి యడవల్లి దళితులకు పట్టాలు ఇస్తామని ప్రస్తుత సీఎం, స్థానిక ఎమ్మెల్యే హామీ ఇచ్చి నియోజకవర్గంలోని దళితుల అందరి ఓట్లు వేయించుకున్నారనారు. దీనిపై తాను స్పష్టత ఇవ్వాలని అడుగుతున్నా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ తాను చెప్పినమాట వినలేదని ఆమెపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయించడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ఎంపీ సందర్శించారనే కక్షతో స్థానిక ప్రజాప్రతినిధి అక్కడి సూపరింటెండెంట్‌పై కక్షసాధింపులో భాగంగా కేసు నమోదు చేయించినట్లు ఆరోపించారు. సమావేశంలో టీడీపీ నాయకులు షేక్‌ అబ్దుల్‌ఖుమీర్‌, పోపూరి శివరామకృష్ణ, బండారుపల్లి సత్యనారాయణ, ఎస్‌ఏఎన్‌ రాజు, లోకాబ్రహయ్య, జవ్వాజి బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు.